రుణం ముందస్తు చెల్లింపు, ఇతర లక్ష్యాలు - ఏది ముఖ్యం?

ఆదాయ వనరు, చెల్లించే సామర్ధ్యం , క్రెడిట్ స్కోర్ వంటి ఆధారంగా గృహ రుణాలను త్వరగా మంజూరు చేస్తున్నాయి....

Published : 21 Dec 2020 16:12 IST

ఆదాయ వనరు, చెల్లించే సామర్ధ్యం , క్రెడిట్ స్కోర్ వంటి ఆధారంగా గృహ రుణాలను త్వరగా మంజూరు చేస్తున్నాయి​​​​​​​.

సొంత ఇల్లు కలిగి ఉండటం ఒక భరోసాని కల్పిస్తుంది. మిగిలిన ఖర్చులు ఎలా ఉన్నా , జీవన ప్రమాణాలు ఎలా ఉన్నా , సొంత ఇంట్లో ఉంటె, నెలవారీ చెల్లించాల్సి అద్దె బాధ ఉండదు. ముఖ్యంగా పట్టణాలలో అద్దె భారంగా ఉంటుంది. అందువల్ల ప్రతి కుటుంబం ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటుంది . పాత రోజులలో ఎన్నో ఏళ్ళు కష్టపడి పొదుపు చేస్తే కానీ , ఇల్లు కట్టుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రస్తుత రోజులలో ఇల్లు కొనుగోలు చాలా సులభమైంది . అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రుణాలు మంజూరు చేయటం చాలా సులభతరం చేశాయి . 10-15 శాతం డౌన్ పేమెంట్ చేయడం ద్వారా మిగిలిన సొమ్ముకి రుణం తీసుకోవడం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతోంది . రాను రాను తగ్గుతున్న వడ్డీ రేట్లు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకునేందుకు దోహదం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ’ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ’ కింద సబ్సిడీ ఇవ్వడం మరొక అవకాశం. వ్యక్తుల ఆదాయ వనరు , తిరిగి చెల్లించే సామర్ధ్యం , మంచి క్రెడిట్ స్కోర్ వంటి ఆధారంగా గృహ రుణాలను త్వరగా మంజూరు చేస్తున్నాయి.

గృహ రుణాన్ని ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఉదా : కృష్ణ కి 40 ఏళ్ళు. ఇల్లు కొనుగోలు కోసం 8.5 శాతం వార్షిక వడ్డీతో రూ. 30 లక్షలు , 15 ఏళ్లకు తీసుకున్నాడు. ఈ ఎం ఐ కింద నెలకు రూ 29,542 చెల్లించాలి. పూర్తి కాలానికి మొత్తం చెల్లించే వడ్డీ రూ 23,17,600. ఈఎంఐ (EMI - Equated Monthly Instalment) లో మొదటి నెల నుంచి చివరి నెలవరకు ఒకే మొత్తం ఉంటుంది. అయితే మొదటి నెలలలో ఈ ఎం ఐ లో ఎక్కువ భాగం వడ్డీ కింద , తక్కువ భాగం అసలు కింద జమ అవుతాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఈ ఎం ఐ లో వడ్డీ భాగం తగ్గి , అసలు భాగం పెరుగుతుంది. ఎందుకంటే వడ్డీని నెలవారీ నిల్వ మీద లెక్కిస్తారు కాబట్టి, మొదటి నెలలలో ఎక్కువ వంతు వడ్డీ కింద జమ అవుతుంది. ఈ కింది పట్టిక ద్వారా మొదటి 24 నెలలలో ఎంత మొత్తం అసలు కింద , ఎంత మొత్తం వడ్డీ కింద జమ అవుతుందో చూద్దాం.

EMI 1.jpg

అలాగే, చివరి 24 నెలలలో ఎంత మొత్తం అసలు కింద , ఎంత మొత్తం వడ్డీ కింద జమ అవుతుందో చూద్దాం.

EMI 2.jpg

ప్రస్తుతం ముందస్తు చెల్లింపులకు రుసుములు లేనందువలన చాలా మంది తమ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి చూస్తుంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయాలు :
ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద గృహ రుణం లో చెల్లించే అసలుకు వార్షికంగా రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. అలాగే సెక్షన్ 24బి కింద చెల్లించే వడ్డీ ఫై వార్షికంగా రూ 2 లక్షల వరకు (ఇల్లును సొంతానికి వాడుకుంటున్నట్లైతే ) మినహాయింపు పొందవచ్చు. అదే ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్లయితే చెల్లించిన పూర్తి వడ్డీకి మినహాయింపు పొందవచ్చు.

ఒకవేళ ఏదేని సంవత్సరంలో ’ గృహ వనరు ఆదాయం’ కింద నష్టం వస్తే, ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరాలలో సర్దుబాటు చేసుకోవచ్చు.

ఈ కింది పట్టిక ద్వారా ప్రతి సంవత్సరం ఎంత మొత్తం వడ్డీ కింద జమ అవుతుందో, ఎంత మొత్తం అసలు కింద జమ అవుతుందో చూద్దాం .

EMI 3.jpg

ఈ మధ్య కాలంలో వడ్డీ రేట్లు పెరిగితే ఈ ఎం ఐ అలాగే ఉంటుంది, కానీ చెల్లించాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఒకవేళ వడ్డీ తగ్గితే , చెల్లించాల్సిన నెలల సంఖ్య తగ్గుతుంది.

ముగింపు:
చాలా మంది ముందస్తు చెల్లింపులు చేసి గృహ రుణభారాన్ని తగ్గించుకోవాలని చూస్తుంటారు. అయితే మారుతున్న కాలానికి , పెరుగుతున్న జీవన ప్రమాణాలకు ఆర్ధిక లక్ష్యాలలో మార్పులు వస్తున్నాయి. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో జీవించే కాలం ఎక్కువ పెరగటం వలన డబ్బు అవసరం మరింత పెరిగింది.
అందువలన ఈ ఎం ఐ లను యధాతధంగా కొనసాగిస్తూ, ముందస్తు చెల్లింపుల సొమ్మును మదుపు చేయటం ద్వారా దీర్ఘకాలం లో మంచి రాబడి పొంది, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సునాయాశంగా చేరుకోవచ్చు. వీటికోసం పీపీఎఫ్ , ఎన్ పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, వంటి వాటిలో మదుపు చేయొచ్చు.
పీ పీ ఎఫ్ లో మదుపు చేయడం వలన, ఏడవ ఆర్ధిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణలు ద్వారా మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవచ్చు.

అలాగే ఎన్ పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పదవీవిరమణ నిధిని సమకూర్చుకోవచ్చు.
ముందు గృహ రుణభారాన్ని తగ్గించుకుని , ఆ తరువాత అధిక మొత్తంలో మదుపు ప్రారంభించవచ్చని మనకి అనిపించవచ్చు. అయితే దీని వలన దీర్ఘకాలంలో లభించే చక్రవడ్డీని కోల్పోతాం. తగినంత నిధి ఏర్పడదు. ప్రతి లక్ష్యానికి రెండు లేదా మూడు పథకాలలో మదుపు చేయడం ద్వారా సునాయాసంగా చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని