పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం పొదుపు చేస్తున్నారా? ఈ పెట్టుబ‌డుల‌ను ప‌రిశీలించండి

సంపాదించడం ప్రారంభించిన తొలి రోజుల నుంచే ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే దీర్ఘ‌కాలంలో లార్జ్ కార్ప‌స్‌ను  స‌మ‌కూర్చుకోవ‌చ్చు.

Published : 09 Aug 2021 14:28 IST


త‌ల్లిదండ్రులు వారి పిల్లల‌కు ఇచ్చే గొప్ప బహుమ‌తి నాణ్య‌మైన విద్య‌. పిల్ల‌లు ఆత్మ‌విశ్వాసంతో వారి వృత్తి, ఉద్యోగాల‌లో మంచి ప‌రిణితి సాధించేందుకు, వారి జీవిత ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ఎంతోగానే తోడ్ప‌డుతుంది. వారు ప‌నిచేసే రంగంలోని ఇండ‌స్ట్రీలు, సంస్థ‌లులో లీడ‌ర్‌గా ఎద‌గ‌డంతో పాటు, త‌రువాతి త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తారు.  విద్య వారిని పారిశ్రామిక వేత్త‌లుగా తీర్చిదిద్దుతుంది. చాలా మందికి ఉపాది క‌ల్పిస్తుంది. ఎకాన‌మి వృద్ధి చెందుతుంది. 

ప్రొఫెషనల్ మార్గం - అర్హత ఉన్న నిపుణులు వ‌ద్ద‌, ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో, విలువ‌ల‌తో నేర్చుకుంటే, స్థిరమైన దీర్ఘకాల వృద్ధిని సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది. 

జ‌నాభా పెరుగుద‌ల పాటు, జీవ‌ణ ప్ర‌మాణాలు కూడా మెరుగుప‌డుతున్నాయి. దీనితో నాణ్య‌మైన వ‌స్తువుల ఉత్త‌త్తి, వాటి నిర్వ‌హ‌ణ  ఎంతో అవ‌స‌రం. దేశీయంగా ఇటువంటి ఉత్ప‌త్తుల‌ను త‌యారీ చేసేందుకు నిపుణుల అవ‌స‌రం ఎంత‌గానో ఉంది. ఇది మెరుగైన విద్య‌ను అందించ‌డం ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌వుంతుంది. అన్ని స్థాయిల‌లోనూ నాణ్య‌మైన విద్య‌ను అందించే సంస్థ‌లు కొన్ని మాత్ర‌మే ఉన్నాయి.  ఉన్న‌త త‌ర‌గ‌తుల‌లో చేరే విద్య‌ర్థుల‌కు మొద‌టి నుంచి నాణ్య‌మైన విద్య‌ను అభ్య‌సించిన విద్యార్థుల‌తో పోటీప‌డ‌డం క‌ష్టం అవుతుంది.

నాణ్య‌మైన విద్య కోసం ఖ‌ర్చు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. స‌రైన ఆర్ధిక ప్ర‌ణాళిక ద్వారా మాత్రమే ల‌క్ష్యాన్ని చేరుకోగ‌ల‌రు. సంపాద‌న ప్రారంభ‌మైన నాటి నుంచి ల‌క్ష్యాల‌కు అధిక ప్రాధ‌న్య‌త ఇవ్వాలి. పిల్ల‌ల విద్య‌తో పాటు ఇంటి కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్రాణాళిక‌, కారు కొనుగోలు, విహార‌యాత్ర‌లు వంటి ల‌క్ష్యాలు ఉంటాయి. వీటి కోసం కూడా కొంత మొత్తాన్ని కేటాయించాలి.  అందువ‌ల్ల మ‌న ఆర్థిక ల‌క్ష్యాలను తెలుసుకుని వాటికి త‌గిన ప్ర‌ణాళిక రూపొందించుకుని, మ‌దుపు చేయాల్సి ఉంటుంది. 

సంపాదించడం ప్రారంభించిన తొలి రోజుల నుంచే ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే దీర్ఘ‌కాలంలో ఎక్కువ నిధి(లార్జ్ కార్ప‌స్‌)ను స‌మ‌కూర్చుకోగ‌ల‌రు. 
ఉదాహ‌ర‌ణ‌కి, అనిల్ 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఉద్యోగంలో చేరాడు. త‌న 30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. 32 సంవ‌త్స‌రాలకు పిల్ల‌లు పుడితే, అత‌నికి 35 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చేస‌రికి పిల్ల‌ల‌ను స్కూల్‌లో చేర్పించాలి.  నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లో చేర్చేందుకు త‌గిన మొత్తం అవ‌స‌రం.  ఇందుకు చాలా పెట్టుబ‌డి మార్గాలు ఉన్నాయి. అయితే మ‌దుపు చేయ‌డం ప్రారంభించే ముందు, ఎంచుకున్న పెట్టుబ‌డుల‌ నియ‌మ నిబంధ‌న‌లు, కాల‌ప‌రిమితి, రాబ‌డి, లిక్వీడిటీ, ర‌క్ష‌ణ‌, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, ప్ర‌భుత్వ విధానాల‌ను అర్ధంచేసుకోవాలి. 

పిల్ల‌ల చ‌దువులు కోసం పొదుపు చేసేందుకు కొన్ని పెట్టుబ‌డి మార్గాల‌ను ఇప్పుడు చూద్దాం. 

రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా:
స్వ‌ల్ప కాల ల‌క్ష్యాల‌కు ఇందులో పొదుపు చేయ‌వ‌చ్చు. స్థిర మొత్తం ప్ర‌తీ నెల డిపాజిట్ చేయాలి. వ‌డ్డీ రేటు కూడా స్థిరంగా ఉంటుంది. కాబ‌ట్టి కాల‌ప‌రిమితి పూర్తైయ్యే స‌రికి ఎంత మొత్తం చేతికి వ‌స్తుంతో ముందుగానే అంచ‌నా వేయ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, పిల్ల‌ల స్కూల్ ఫీజు కోసం నెల నెల కొంత స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాల‌నుకుంటే.. ఆర్‌డీ ఖాతాను ఎంచుకోవ‌చ్చు. ఈ విధానం ద్వారా పెట్టుబ‌డులు చేయ‌డం అల‌వాటుగా మారుతుంది. 

పోస్టాఫీస్ ఐదేళ్ల కాల‌ప‌రిమితిలో మాత్ర‌మే రిక‌రింగ్ డిపాజిట్ల‌ను అందిస్తుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 5.8శాతం, ఎస్‌బీఐతో మ‌రికొన్ని ప్ర‌భుత్వ ప్ర‌వేట్ బ్యాంకులు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు, ప‌దేళ్లు కాల‌ప‌రిమితితో ఆర్‌డీ ఖాతాను అందిస్తున్నాయి. 

పీపీఎఫ్‌:  
దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌కు  ఈఈఈ త‌ర‌హా ప‌న్ను ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది. 7వ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వ నిర్ణ‌యిస్తుంది. పెట్టుబ‌డులు పూర్తి సుర‌క్షింగా ఉంటాయి. వార్షికంగా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మ‌దుపు చేయ‌వ‌చ్చు. 

ఎస్ఎస్‌వై(సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌): 
ఈ ప‌థ‌కం ప్ర‌త్యేకించి బాలిక‌ల కోసం రూపొందించింది. బాలిక‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌రు. బాలిక‌ల ఉన్న‌త చ‌దువులు, వివాహా స‌మ‌యాల్లో ఈ ప‌థ‌కం నుంచి వ‌చ్చే మొత్తం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వ నిర్ణ‌యిస్తుంది. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీరేటు7.6 శాతం.

ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లు:
దీర్ఘ‌కాలంలో(10 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ కాలానికి) అధిక రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు. మీరు తీసుకునే రిస్క్ ఆధారంగా త‌గిన ఫండ్‌ను ఎంచుకోవాలి. పెట్టుబ‌డుల‌కు గ‌రిష్ట ప‌రిమితి లేదు. దీర్ఘ‌కాలంలో, అధిక రాబ‌డుల‌తో ఎక్కువ నిధిని స‌మ‌కూర్చుకోవ‌చ్చు. 

చివ‌రిగా:
వివిధ పెట్టుబ‌డి సాధాన‌ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా వివిధ స‌మ‌యాల‌లో నిధులు అందుబాటులో ఉంటాయి. పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్న ప్ర‌తీ ప‌థ‌కం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎండోమెంట్‌, యులిప్స్ వంటి ప‌థ‌కాల‌కు దూరంగా ఉండండి. వీటిలో ప్రీమియం ఎక్కువ‌గానూ రాబ‌డి త‌క్కువ‌గానూ ఉంటుంది. ఈ ప‌థ‌కాల‌తో త‌గిన జీవిత బీమా ల‌భించ‌దు. అదేవిధంగా ఆర్‌డీ ఖాతా వంటి వాటిలో వచ్చే రాబ‌డి ఉండ‌దు. 

ఏదైనా ప‌థకంలో పెట్టుబ‌డి పెట్టేముందు, దాని గురించి తెలుసుకునేందుకు మీకు పూర్తి హ‌క్కు ఉంది. ఎందుకంటే ఇది మీరు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు. నేటి స‌ర‌దాలు త్యాగం చేస్తేనే రేపు సంతోష‌దాయ‌క‌మైన జీవితాన్ని పొంద‌గ‌ల‌మ‌ని గుర్తించుకోండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని