స్టాక్‌మార్కెట్లో ప్ర‌వాస భార‌తీయుల పెట్టుబ‌డులు

భార‌తీయ పౌరులై ఉండి ఫెమా ప‌రిధిలో ఎన్‌.ఆర్‌.ఐగా గుర్తింపు పొందిన‌వారు, భార‌తీయ మూలాలున్న వ్య‌క్తులు దేశీయ‌ స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా షేర్లు, క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు.....

Published : 16 Dec 2020 11:34 IST

ఎన్‌.ఆర్‌.ఐలు సాధార‌ణ రెసిడెంట్ల మాదిరిగా షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా? వారికి ఎలాంటి ష‌ర‌తులు వ‌ర్తిస్తాయో చూద్దాం.

భార‌తీయ పౌరులై ఉండి ఫెమా ప‌రిధిలో ఎన్‌.ఆర్‌.ఐగా గుర్తింపు పొందిన‌వారు, భార‌తీయ మూలాలున్న వ్య‌క్తులు దేశీయ‌ స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా షేర్లు, క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్ర‌త్యేక విధానాన్ని రూపొందించింది. అదే పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (పీఐఎస్‌). ఈ విధానంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న నియ‌మ‌నిబంధ‌న‌లను తెలుసుకుందాం.

పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌

భార‌తీయ కంపెనీల‌కు చెందిన షేర్లు, క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్ల కొనుగోళ్లు, అమ్మ‌కాలు జ‌రిపేందుకు ఎన్‌.ఆర్‌.ఐలు నిర్దిష్ట బ్యాంకు శాఖలో ఖాతా తెరవాల్సి ఉంటుంది. పెట్టుబ‌డులు రీపాట్రియేష‌న్ లేదా నాన్ రీపాట్రియేష‌న్ విధానంలో చేయ‌వ‌చ్చు. అమ్మ‌కాల లాభాల‌ను రీపాట్రియేష‌న్ విధానంలో విదేశాలకు తిరిగి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఉంటే పెట్టుబ‌డులు చేసేటప్పుడు ఎన్‌.ఆర్‌.ఈ - పీఐఎస్ ఖాతాను తెరావాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబ‌డులను స్వ‌దేశంలోనే ఉప‌యోగించాల‌నే ఉద్దేశం ఉన్న‌వారు మాత్రం ఎన్‌.ఆర్‌.ఓ - పీఐఎస్ ఖాతా తెరవాలి. షేర్ల అమ్మ‌కాలు, కొనుగోళ్ల లాంటి లావాదేవీలు జ‌రిపేందుకు ఈ బ్యాంకు ఖాతాలు ప‌రిమితంగానే తోడ్ప‌డ‌తాయి. సాధార‌ణ ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలో ఎంత సొమ్మును జ‌మచేసేందుకు అనుమ‌తిస్తారో దాదాపు అదే మొత్తాన్ని ఎన్‌.ఆర్‌.ఈ-పీఐఎస్ ఖాతాల‌లో జ‌మ చేయ‌వ‌చ్చు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా ఐపీవోల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రిజిస్ట‌ర్డ్ షేర్ బ్రోకర్ ద్వారా మాత్ర‌మే ఈ స్కీమ్ కింద లావాదేవీలు జ‌ర‌పాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా జ‌రిపే లావాదేవీల‌న్నింటినీ సంబంధిత బ్యాంకు శాఖ‌కి ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌ప‌ర‌చాలి.

ఏదైనా స‌మ‌యంలో ఒకే ఎన్‌.ఆర్‌.ఈ- పీఐఎస్ ఖాతా మ‌రియు ఒక్క ఎన్‌.ఆర్‌.ఓ - పీఓఎస్ ఖాతా తెరిచేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అయితే ఖాతా క‌లిగి ఉన్న బ్యాంకు శాఖ నుంచి మ‌రోదానికి విధాన‌ప‌ర‌ ప్ర‌క్రియ‌ను పాటించి బ‌దిలీచేయించుకోవ‌చ్చు.

పెట్టుబ‌డుల‌పై ప‌రిమితులు

  • పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద చేసే పెట్టుబ‌డుల‌కు ఎలాంటి ప‌రిమితులు లేవు.
  • అయితే ఏదైనా ఒక్క‌ భార‌తీయ కంపెనీని తీసుకుంటే ఆ కంపెనీ మొత్తం మూల‌ధ‌నంలో 5శాతానికి మించి పెట్టుబ‌డి పెట్టేందుకు వీల్లేదు.
  • అదేవిధంగా క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్ల‌లో ఒక‌ సిరీస్‌లో 5 శాతం మేర‌కే పెట్టుబ‌డుల‌ను అనుమ‌తిస్తారు. * రీపాట్రియేష‌న్ లేదా నాన్ రీపాట్రియేష‌న్, రెండింటి కోసం క‌లిపి ఉద్దేశించిన‌దైనా పెట్టుబడులు మాత్రం 5శాతానికే ప‌రిమిత‌వ్వాలి.
  • షేర్లు, డిబెంచ‌ర్ల పెట్టుబ‌డులు క‌లిపి 10శాతానికి మించ‌కూడదు.
  • వ్య‌క్తిగ‌త పెట్టుబ‌డుల కేటాయింపుల‌ ప‌రిమితుల‌పై ఎన్.ఆర్‌.ఐ స్వ‌యంగా నిర్ణ‌యం తీసుకోవవ‌చ్చు.
  • పెట్టుబ‌డుల‌ను ఒక వ్య‌క్తికి కేటాయించేట‌ప్ప‌డు కంపెనీలు 10శాతం వాటాకే అనుమ‌తి ఇచ్చేలా చూసుకోవాలి. అయితే కంపెనీ త‌మ స‌భ్యుల‌తో చ‌ర్చించి ప్ర‌త్యేక తీర్మానాన్ని చేసుకొని 10శాతం ఉన్న ప‌రిమితిని 24శాతానికి పెంచుకోవ‌చ్చు. ఇలా చేసేందుకుగాను ఆర్‌బీఐ నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది.

లావాదేవీల‌పై ఆర్‌బీఐ ఆంక్ష‌లు

భార‌తీయ స్టాక్ ఎక్స్ఛేంజీల వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన బ్రోక‌ర్ ద్వారానే పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కింద కొన్న షేర్లు, డిబెంచ‌ర్ల‌ను అమ్మాల్సి ఉంటుంది. ప్ర‌యివేట్ డీల్ కుదుర్చుకొని లావాదేవీలు జ‌రిపేందుకు ఆర్‌బీఐ ఆమోదించాల్సి ఉంటుంది. పీఐఎస్ పెట్టుబ‌డుల‌ను బ‌హూక‌రించేందుకో, బ‌దిలీ చేసేందుకు ముంద‌స్తు అనుమ‌తులు తీసుకునేలా ఆర్‌బీఐ ఆంక్ష‌లు విధించింది. అయితే కంపెనీల‌ చ‌ట్టం మాత్రం ఎలాంటి షేర్ల‌ను అయినా బ‌హుమ‌తిగా ఇచ్చిపుచ్చుకునేందుకు వెసులుబాటు క‌ల్పిస్తోంది.

ఇత‌ర ఆంక్ష‌లు

పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్ లో డెలివ‌రీ బేసిస్‌ లోనే పెట్టుబ‌డుల‌ను అనుమ‌తిస్తారు. అంతే త‌ప్ప స్క్వేరింగ్ ఆఫ్‌ ద ట్రాన్సాక్ష‌న్‌ జ‌రిపేందుకు వీలులేదు. ఎన్‌.ఆర్‌.ఐల‌కు ఈ స్కీమ్ ద్వారా షార్ట్ సెల్లింగ్‌ చేసుకునేందుకు అనుమ‌తించ‌రు. ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్‌లో లావాదేవీలు చేసుకోవ‌చ్చు అయితే నాన్ రీపాట్రియేష‌న్‌ నియమాన్ని అనుసరించి మాత్రమే ఇందులో పెట్టుబడుల‌కు చేయ‌నిస్తారు. క‌రెన్సీ సెగ్మెంట్‌లోని ఏ డెరివేటివ్ లావాదేవీలు జ‌ర‌ప‌కుండా ఎన్‌.ఆర్‌.ఐలకు ఆంక్ష‌లున్నాయి. షేర్ల ప్లెడ్జింగ్‌ను సైతం అనుమ‌తించ‌బోరు.

స్థానిక‌త హోదాలో మార్పు

కొన్నాళ్లు విదేశాల్లో ఉండి తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చేవారుంటారు. ఫెమా ప్ర‌కారం వారు ఇక్క‌డకు వ‌చ్చాక వారి స్థానిక హోదా రెసిడెంట్‌గా మార్పు చెందుతుంది. పీఐఎస్ స్కీం ద్వారా పెట్టుబ‌డులు ఉన్న‌వారు ఇక్క‌డ‌కు వ‌చ్చిన వెంట‌నే షేర్ల‌ను అమ్ముకోవాల్సిన అవ‌స‌రం లేదు. వాటిని అట్టే పెట్టుకోవ‌చ్చు. కాక‌పోతే స్థానిక హోదాలో మార్పును బ్యాంకు శాఖ‌కు తెలియ‌ప‌ర్చి వారి రికార్డుల్లో న‌మోదు చేయించుకోవాలి.

బ్యాంకులు ఎన్.ఆర్‌.ఈ - పీఐఎస్‌, ఎన్‌.ఆర్‌.ఓ - పీఐఎస్ ఖాతాల‌ను సాధార‌ణ బ్యాంకు ఖాతాలుగా మారుస్తారు. స్థానికుడిగా ఇక్క‌డ స్థిర‌ప‌డ్డాక‌ డీమ్యాట్ ఖాతా తెర‌వాలి. త‌ర్వాత పోర్ట్‌ఫోలియో స్కీమ్ లో ఉన్న షేర్ల‌ను డీమ్యాట్ ఖాతాకు బ‌దిలీ చేసుకోవాలి. అయితే ఇక్క‌డ ఓ విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. కావాల‌నుకుంటే పీఐఎస్ ఖాతాలోనే పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. కానీ ఇందులోని సొమ్మును భార‌త దేశం వెలుప‌లికి త‌ర‌లించే వీలులేదు. దీనికీ ఓ మిన‌హాయింపు ఉంది. ఏటా 2.5 ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్ల వ‌ర‌కు లిబ‌ర‌లైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద బ‌య‌టి దేశాల‌కు త‌ర‌లించ‌వ‌చ్చు.

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని