ప్రామాణిక స్వదేశీ ప్రయాణ బీమా .. భారత్ యాత్రా సురక్ష  

ప్రామాణిక స్వదేశీ ప్రయాణ బీమా పాలసీకి సంబంధించి ఐఆర్‌డీఏఐ కొన్ని మార్గదర్శకాలను విడుద‌ల చేసింది. 

Updated : 07 May 2021 11:43 IST

బీమా నియంత్రణ ప్రాదికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రామాణక స్వదేశీ ప్రయాణ బీమా పాల‌సీ.. భారత్ యాత్రా సురక్ష‌పై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా దేశంలో టాక్సీ, బస్సు, రైలు, ఓడ, విమానాలు.. ఎందులో ప్రయాణం చేసినా, ప్రమాదం జరిగితే.. అయ్యే ఆసుపత్రి ఖర్చులు, మరణం, ప్రమాదం కారణంగా శాశ్వత పూర్తి లేదా పాక్షిక వైకల్యం ఏర్పడడం వంటి వాటికి క‌వ‌రేజ్‌ అందిస్తుంది. 

రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు బేసిక్ కవరేజ్ కింద ఆసుప్రతి ఖర్చులు, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద రూ.1 లక్ష నుంచి రూ. 1కోటి వరకు కవరేజ్ ఉంటుంది. ఫ్లైట్ మిస్సైనా, చెక్-ఇన్ చేసేప్పుడు సామాను పోగొట్టుకున్న,  మూడు గంటలకు మించి ప్రయాణం ఆలస్యమైనా లేదా రద్దైనా ఆప్షనల్ క‌వ‌రేజ్ ఉంటుంది.

ఇందులో ప్ర‌యాణాన్ని అనుస‌రించి ప్ర‌తిపాదిత ప్రాడెక్ట్‌ను జారీ చేస్తారు కాబ‌ట్టి పాల‌సీని పున‌రుద్ధ‌రించే అవ‌కాశం లేదు. అయితే ప్రీమియం చెల్లింపుపై పొడిగింపును అనుమ‌తిస్తారు. ఒకే  ప్రీమియం చెల్లింపు ఉంటుంది. అది కూడా ముందుగానే చెల్లించాలి. ప్రామాణిక ప్రయాణ బీమా తప్పనిసరి కానప్పటికీ, జూలై 1,2021 నుంచి ఈ పాల‌సీని ఆఫ‌ర్ చేయాల‌ని సాధార‌ణ‌, ఆరోగ్య బీమా సంస్థ‌ల‌ను ఐఆర్‌డీఏఐ కోరింది. 

"భారతదేశంలో అనేక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక‌దానికొక‌టి భిన్నంగా ఉండ‌డంతో, త‌గిన ప్ర‌యాణ బీమాను ఎంచుకోవ‌డం ప్ర‌జ‌ల‌కు క‌ష్ట‌మ‌వుతుంది. అందువ‌ల్ల ఒక సాధారణ ప్రయాణికుడి సంబంధించి అత్యంత సాధారణ అవసరాలను తీర్చేందుకు, ఒకేర‌క‌మైన ఫీచ‌ర్స్‌తో అంద‌రికి అందుబాటులో ప్రామాణిక ప్రయాణ బీమాను అందుబాటులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశ్యంతో దీన్ని రూపొందించారు.” అని మే 5, 2021 నాటి స‌ర్క్యుల‌ర్‌లో ఐఆర్‌డీఐఏ పేర్కొంది. 

ప్రామాణిక దేశీయ ప్రయాణ పాల‌సీలో సహ-చెల్లింపులు ఉండ‌వు. కానీ డిడ‌క్ట‌బుల్స్‌ను అనుమ‌తిస్తారు. స‌హ చెల్లింపులలో ఖ‌ర్చును షేర్ చేసుకోవాలి. అంటే క్లెయిమ్ చేసిన మొత్తంలో కొంత భాగాన్ని పాల‌సీదారుడు చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. డిడ‌క్ట‌బుల్ అంటే మీరు ఎంచుకున్న మొత్తం వ‌ర‌కు బీమా సంస్థ చెల్లింపులు చేయ‌దు. 

గ‌దిఅద్దె, ఐసీయూ వంటి వాటికి కొన్ని ప‌రిమితులు ఉంటాయి. గది అద్దె, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులను బీమా మొత్తంలో 2శాతం వరకు అంటే రోజుకు గరిష్టంగా రూ.10వేల‌కు, ఇన్‌టెన్సివ్ కేర్‌యూనిట్ (ఐసియు) ఛార్జీలు బీమా చేసిన మొత్తంలో 4శాతం లేదా ఒక రోజుకు గరిష్టంగా రూ .20వేల వ‌ర‌కు చెల్లిస్తారు.

ప్రయాణ దూరం.. ఏ మార్గం ద్వారా ప్ర‌యాణిస్తున్నారు.. అనే విష‌యాల ఆధారంగా.. ఐదు వేరియంట్లలో పాల‌సీని అందిస్తున్నారు. ప్లాన్ 'A' కింద, టాక్సీ లేదా బ‌స్సు ద్వారా 100 కిలోమీటర్ల లోపు ప్ర‌యాణాల‌కు, ప్లాన్ 'B' ప్ర‌కారం  టాక్సీ లేదా బ‌స్సులో 100 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి కవరేజీని అందిస్తుండగా, ప్లాన్ 'C', 'D' రైలు, విమాన ప్ర‌యాణ‌ల‌కు దూరంతో సంబంధం లేకుండా క‌వ‌ర్ చేస్తున్నాయి. ప్లాన్ 'E' పైన పేర్కొన్న అన్ని రవాణా మార్గాల రౌండ్ ట్రిప్(రాను, పోను ప్రయాణం) ల‌ను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, ప్లాన్ 'E' మాత్రమే 30 రోజుల వరకు కవర్ను అందిస్తుంది, ఇతర ప్రణాళికలు ఒకే ప్రయాణానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

పాలసీలో కనీస, గరిష్ట వయస్సుపై ఎటువంటి పరిమితి ఉండదు. ఐఆర్‌డీఏఐ ప్రకారం, పాల‌సీని ఒక వ్యక్తితో పాటు, గ్రూప్‌ ప్రాతిపదికన అందించవచ్చు, కానీ కుటుంబ కవర్ విషయానికి వస్తే, బీమా చేసిన మొత్తం - ప్రతి కుటుంబ సభ్యునికి విడి విడిగా వర్తిస్తుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని