Title Insurance: ఈ బీమా ఉంటే ఇంటి కొనుగోలులో చిక్కే ఉండదు!

టైటిల్‌లో ఉన్న లోపాల వల్ల కలిగే నష్టాల నుంచి కొనుగోలుదారులను రక్షించేదే టైటిల్‌ ఇన్సూరెన్స్‌...

Published : 14 Sep 2021 13:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ ఆస్తిపై చట్టపరమైన హక్కు కల్పించే పత్రమే ‘టైటిల్‌’. ఆస్తి విక్రయించిన ప్రతిసారీ టైటిల్‌ కూడా మారుతుంది. ఈ క్రమంలో టైటిల్‌లో లోపాలు జరుగుతుంటాయి. లేదా కావాలనే కొంతమంది మోసం చేసేందుకు టైటిల్‌ను లోపభూయిష్ఠంగా రూపొందిస్తారు. అలాంటప్పుడు ఆస్తి కొనుగోలుదారులకు నష్టం తప్పదు. పైగా కోర్టుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టైటిట్‌ ఇన్సూరెన్స్‌ అంటే...

టైటిల్‌లోని లోపాల వల్ల కలిగే నష్టం నుంచి రక్షించేదే టైటిల్‌ ఇన్సూరెన్స్‌. ఈ బీమాలో ఉండే ప్రధాన ఫీచర్‌ రెట్రోస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌. అంటే పాలసీ తీసుకోవడానికి ముందు టైటిల్‌లో ఏమైనా లోపాలున్నా బీమా వర్తిస్తుంది. అయితే, పాలసీ తీసుకునే నాటికి దానిలో లోపాలున్నాయని తెలియకపోతే మాత్రమే బీమా వస్తుంది. ఓ ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి వివాదాలు, లోపాలు లేని వాటినే తీసుకోవాలని అనుకుంటారు. అలా అయితేనే, తిరిగి దాన్ని అమ్మాలనుకున్నా వీలుపడుతుంది. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్‌ దేశాల్లో టైటిల్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులో ఉంది. భారత్‌లో కూడా ఉన్నప్పటికీ.. దీనికి అంతగా ప్రాచుర్యం లేదు.

భారత్‌లో ఎందుకు ప్రాచుర్యం లేదు..

భారత్‌లో మెజారిటీ ఇన్సూరెన్స్‌ కంపెనీలు టైటిల్‌ బీమా ఉత్పత్తులను విక్రయించడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తిరిగి రీఇన్సూరెన్స్‌ చేయించుకుంటాయి. ఇలా టైటిల్‌ ఇన్సూరెన్స్‌ను రీఇన్సూరెన్స్‌ చేయించడం ఖర్చుతో కూడుకున్న పని. పైగా భారత్‌లో ల్యాండ్‌ రికార్డుల్లో లోపాలు ఉండడం కూడా ప్రధాన కారణం. అలాగే పాలసీని జారీ చేసే ముందు ఆస్తి చట్టబద్ధతను ధ్రువీకరించుకోవడం కూడా కష్టమైన పనే. అయితే, రెరాలోని సెక్షన్‌ 16 ప్రకారం.. టైటిల్‌ వల్ల తలెత్తే వివాదాలన్నీ ప్రమోటర్ల బాధ్యతే. ఇన్సూరెన్స్‌ తీసుకొని ఆస్తిని కొనుగోలుదారులకు బదిలీ చేసే వరకు ప్రీమియంలు కూడా చెల్లించాలి. అయితే, ఈ నిబంధనను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. దీనిపై రాష్ట్రాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిబంధనను అమలు చేస్తే స్థిరాస్తి వ్యాపారంలోని లొసుగులు దాదాపు నియంత్రణలోకి వచ్చినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐఆర్‌డీఏఐ సూచన...

సాధారణ బీమా కంపెనీలన్నీ వీలైనంత త్వరగా కొత్త టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులతో ముందుకు రావాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ సోమవారం సూచించింది. ప్రస్తుతం ఉన్న బీమా పాలసీలు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా లేవని స్పష్టం చేసింది. డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ఐఆర్‌డీఏఐ నియమించిన ఓ ప్రత్యేక కార్యాచరణ కమిటీ పలు సూచనలు చేసింది. వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని