అత్య‌వ‌స‌ర నిధి కోసం బంగారంలో పెట్టుబ‌డులు.. మంచి ఆలోచ‌నేనా?

అత్య‌వ‌స‌ర‌ కార్ప‌స్ కోసం చేసే పెట్టుబ‌డుల‌లో బంగారాన్ని జోడించ‌వ‌చ్చా?  నిపుణుల స‌ల‌హా ఏంటి? తెలుసుకుందాం.

Updated : 11 Jun 2021 14:02 IST

ఆప‌ద వేళ బంగారం అక్క‌ర‌కు వ‌స్తుందంటారు పెద్ద‌లు. అంటే అప్ప‌టి వ‌ర‌కు తాము కూడిబెట్టిన బంగారాన్ని, పూర్వీకుల నుంచి వ‌చ్చిన బంగారాన్ని త‌మ అవ‌స‌రాల కోసం తాక‌ట్టుపెట్టి డ‌బ్బు తెచ్చుకుని,  డ‌బ్బు చేతికి వ‌చ్చిన‌ప్పుడు  అప్పు చెల్లించి బంగారం తెచ్చుకుంటారు. త‌రచూ ఇలా చేసే వారు మ‌న చుట్టూ చాలామంది ఉంటారు. 

ప్ర‌స్తుతం నెల‌కున్న క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో చాలా మంది ప్ర‌జ‌లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొంత మందికి జీతాల‌లో కోత‌వుంటే, మ‌రికొంత మంది పూర్తిగా ఉపాదినే కోల్పోతున్నారు. ఆదాయం త‌గ్గింది కానీ ఖ‌ర్చులు, అవ‌స‌రాలు త‌గ్గ‌వు కాదా. అందుకే  న‌గ‌దు అవ‌స‌రాల కోసం త‌మ వ‌ద్ద ఉన్న‌ బంగారాన్ని తాక‌ట్టు పెట్టి రుణం తీసుకునే వారు కొంద‌రైతే, విక్ర‌యించేవారు ఇంకొంద‌రు. అయితే బంగారం అనేది అస్థిర ఆస్తి. విలువ‌లో హెచ్చుత‌గ్గులు ఉంటాయి.  క‌నుక ఈ విష‌యంలో నిపుణులు ఏమంటున్నారు? అత్య‌వ‌స‌ర నిధి కోసం బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిదేనా?  ప్ర‌స్తుతం అత్య‌వ‌స‌ర కార్ప‌స్‌ను ఏర్పాటు చేసుకునే వారు ఇందులో బంగారాన్ని జోడించ‌వ‌చ్చా?  త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం. 

సెబి-రిజిస్ట‌ర్డ్ ఇన్వెస్ట‌మెంట్ అడ్వైజ‌ర్, మైవెల్త్‌గ్రోత్‌.కామ్ స‌హా-వ్య‌వ‌స్థాప‌కుడు హ‌ర్ష‌ద్  చేత‌న్‌వాలా అభిప్రాయం ప్ర‌కారం..

అత్య‌వ‌స‌ర నిధి అనేది న‌గ‌దు రూపంలో ఉండాలి. లేదా అతి త‌క్కువ స‌మ‌యంలోనే ద్ర‌వ్య‌రూపంలోకి మార్చుకో గ‌లిగేలా ఉండాలి.  అదేవిధంగా మూల‌ధ‌నానికి రిస్క్‌ ఉండ‌కూడ‌దు.  బ్యాంక్ పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్ల‌లో  మూల‌ధ‌నం కోల్పోయే అవ‌కాశం  త‌క్కువ. అందువ‌ల్ల అత్య‌వ‌స‌ర నిధిని నిల్వ చేసుకునేందుకు వీటిని ఉత్త‌మ మార్గాలుగా చెబుతారు.
 
దీర్ఘ‌కాలంగా చూస్తే, బంగారంలో పెట్టుబ‌డులు ద్ర‌వ్యోల్భ‌ణాన్ని మించి స్వ‌ల్పంగా ఎక్కువ రాబ‌డి ఇచ్చాయి. ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. అత్య‌వ‌స‌ర నిదుల‌పై ద్ర‌వ్యోల్భ‌ణాన్ని అధిగ‌మించేందుకు బంగారం పెట్టుబ‌డులు మ‌దుప‌ర్ల‌కు స‌హాయ‌ప‌డతాయి.  ఈ ప్ర‌భావాన్ని మించి రాబ‌డి పొంద‌డం బ్యాంక్ లేదా లిక్విడ్ ఫండ్ల‌లో క‌ష్టం.  మ‌రోవైపు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో బంగారాన్ని ద్ర‌వ్య రూపంలోకి మార్చ‌డం అంత సుల‌భం కాదు. కార‌ణం మ‌న‌లో చాలా మంది బంగారం ధ‌ర‌లు చూసి కొనుగోలు చేయ‌డం లేదా విక్ర‌యించ‌డం చేస్తుంటారు. ఒక‌వేళ విక్ర‌యించే స‌మ‌యంలో బంగారం ధ‌ర త‌క్కువ‌గా ఉంటే రాబ‌డి త‌క్కువ ఉంటుంద‌ని విక్ర‌యించ‌లేరు. పెట్టుబడులు స‌రైన స‌మ‌యంలో పెట్ట‌క‌పోతే మూల‌ధ‌నాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అందువ‌ల్ల అత్య‌వ‌స‌ర నిధి కోసం బంగారంలో పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది. 

ఇన్వెస్టోగ్ర‌ఫీ ప్రైవేట్ లిమిటెడ్ వ్య‌వ‌స్థాప‌కురాలు, ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ శ్వేతా జైన్ మాట్లాడుతూ..

'అత్య‌వ‌స‌ర నిధిని కోసం బంగారాన్ని ఎంచుకోమ‌ని నేను చెప్ప‌ను.  బ్యాంక్ పొదుపు ఖాతాలో నిల్వ చేయ‌మ‌ని సూచిస్తాను. అవ‌స‌ర‌మైన‌ వేళ్ల‌ల్లో వేగంగా తీసుకునేందుకు వీలుంటుంది. అత్య‌వ‌స‌ర నిధిలో కొంత భాగాన్ని ఫిక్స‌డ్ డిపాజిట్ల‌కు కేటాయించ‌వ‌చ్చు. దీనిలో పెట్టుబ‌డులు సుర‌క్షితంగా ఉంటాయి. విత్‌డ్రా చేసుకోవ‌డ‌మూ సుల‌భం. ముంద‌స్తు విత్‌డ్రాల‌కు ఎక్కువ న‌ష్టం ఉండ‌దు.  అత్య‌వ‌స‌ర నిధి ఉంచేందుకు నాకు బాగా న‌చ్చిన మార్గం ఓవ‌ర్‌నైట్ ఫండ్‌/ అల్ట్రా షార్ట్ ట‌ర్మ్/ లిక్విడ్ ఫండ్లు. వీటి క‌లియిక మంచి ఫ‌లితాలు ఇస్తుంది. ఒక నెల ఖ‌ర్చుల కోసం అయితే బ్యాంకు ఖాతాలోనూ 2 నెల‌ల‌కు ఎఫ్‌డీలు, 3 నెల‌ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్లు. దీనినే 1,2,3 ప‌ద్ధ‌తి అని పిలుస్తారు. మూడు నెల‌ల స్వ‌ల్ప కాలానికి బంగారం ధ‌ర‌ల‌ల్లో అనిశ్చితి ఎక్కువ‌గా కనిపిస్తుంది. దీర్ఘ‌కాలంలో మాత్ర‌మే రాబ‌డి క‌నిపిస్తుంది.' అని తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని