Updated : 01 Jan 2021 15:30 IST

పిల్ల‌ల పేరుతో పాల‌సీలు, పెట్టుబ‌డులు చేయ‌డం లాభ‌దాయ‌క‌మేనా?

త‌ల్లిదండ్రుల ప్రాథ‌మిక ల‌క్ష్యాల‌లో అతి ముఖ్య‌మైన‌వి వారి పిల్ల‌ల చ‌ద‌వు, వివాహం. ఈ రెండు దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం మ‌దుపు చేసేందుకు చాలా పెట్టుబ‌డి మార్గాలు ఉన్నాయి. మ‌రి ఇందుకోసం మీ పేరుతో పెట్ట‌బడి పెట్ట‌డం మంచిదా? లేదా పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిదా?

కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్ప‌, పిల్ల‌ల పేరిట పెట్టిన పెట్టుబ‌డులు త‌ల్లిదండ్రుల‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాన్ని చూకూర్చ‌లేవ‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. త‌ల్లిదండ్రులు, పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం, సంబంధిత‌ ల‌క్ష్యాల చేధ‌న‌కు వారి సంపాద‌న‌లో కొంత భాగాన్ని కేటాయించాలి. ఈ మొత్తాన్నిఇత‌ర లక్ష్యాలు, ఖ‌ర్చుల కోసం వినియోగించ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. ఆర్థిక ప్రణాళిక, సంపద నిర్వహణ సంస్థ మెయిన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ పాండే మాట్లాడుతూ, మేము మా ఖాతాదారుల‌ను వారి ల‌క్ష్యాల గురించి అడుగుతాము. అందులో వారి ప్రాధాన్య‌త‌ల ఆధారంగా పెట్టుబ‌డి పెట్ట‌మ‌ని సూచిస్తాయి. అంతేకానీ పిల్ల‌లకు సంబంధించిన ల‌క్ష్యాల‌కు కోసం ప్ర‌త్యేకించి వారి పేరుపైనే పెట్టుబ‌డులు చేయాల్సిన‌ అవ‌స‌రం లేదని తెలిపారు.

ప్ర‌స్తుతం మార్కెట్లో పిల్ల‌ల కోసం నిర్థిష్ట పెట్టుబ‌డి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటి వ‌ల్ల క‌లిగే అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ఒక్క‌సారి ప‌రిశీలిస్తే…

మ్యూచువ‌ల్ ఫండ్లు, బీమా పాల‌సీలు, ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్‌) వంటి వాటిలో పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. ముందుగా పాల‌సీల విష‌యానికొస్తే…సాధారణంగా, బీమా ఏజెంట్లు పిల్లల కోస‌మే నిర్దిష్ట ప్రణాళికలు, పాల‌సీల గురించి చెప్తుంటారు. వాటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని చెప్తుంటారు. అయితే ఇటువంటి బీమా పాల‌సీలు పిల్ల‌ల కోస‌మే ప్ర‌త్యేకంగా రూపొందిచిన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టీ వీటి వ‌ల్ల అద‌న‌పు రాబ‌డి, ప‌న్ను త‌గ్గింపు, మిన‌హాయింపులు వంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌తో పాటు పెట్టుబ‌డి పెట్టేప్పుడు ప‌రిగ‌ణించే అంశాలు ఏమీ ఉండ‌వ‌ని నిపుణులు చెప్తున్నారు.

కుటుంబంలో సంపాందించే వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, ఆ కుంటుంబం ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఉద్దేశించిన‌దే ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీ. అయితే ఎటువంటి సంపాద‌నా లేని పిల్ల‌ల పేరుపై ఇటువంటి పాల‌సీల‌ను తీసుకోవ‌డంలో అర్థం లేద‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ మ‌నీ మేట‌ర్స్ ప్రేవ‌ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, ఛీఫ్ ఎగ్సిక్యూటీవ్ ఆఫీస‌ర్ లోవై నవలాఖి అన్నారు.

ఇక పీపీఎఫ్ ఖాతా విష‌యానికి వ‌స్తే, మీపేరుపై, మీతో పాటు మీ కుమార్తె/కుమారుని పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్య విష‌యం పీపీఎఫ్ నిబంధ‌న ప్ర‌కారం రెండు ఖాతాల‌పై క‌లిపి మొత్తంగా ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మిన‌హాయింపు కూడా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కే ఉంటుంది. అంతేకాకుండా పీపీఎఫ్ రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తించ‌దు.

పిల్ల‌ల పేరుపై పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల ఒకే ఒక్క ప‌థ‌కం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌(ఎస్ఎస్ఏ). అయితే ఆడ‌పిల్ల పేరుపై మాత్ర‌మే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టేందుకు వీల‌వుతుంది. ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇది. త‌ల్లిదండ్రలు లేదా గార్డియ‌న్ ఆడ‌పిల్ల పేరుపై సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. ఒక్క‌క్క ఆడ‌పిల్ల పేరుపై ఒక ఖాతా చొప్పున ఒక‌రు గరిష్టంగా రెండు ఖాతాల‌ను తెర‌వ‌చ్చు. ప్ర‌స్తుతం 8.1 శాతం వార్షిక వ‌డ్డీ అందుతుంది. వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తించ‌దు. వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇత‌ర పెట్టుబ‌డి మార్గాలైన పీపీఎఫ్‌, జాతీయ పొదుపు ప‌త్రాల‌పై వ‌చ్చే రాబ‌డి కంటే సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కం ద్వారా వ‌చ్చే రాబ‌డి ఎక్కువ‌.

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 64 ప్ర‌కారం మైన‌రు పిల్ల‌ల(18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్లలు) పేరుపై చేసే పెట్టుబ‌డిపై వ‌చ్చే రాబ‌డి త‌ల్లిదండ్రలు ఇరువురి సంపాద‌న‌లో ఎవ‌రి ఆదాయం ఎక్కువ‌గా ఉంటుందో, వారి ఆదాయానికి చేర్చి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయాల‌ని గుర్తించుకోవాలి.

అయితే పిల్ల‌ల పేరుపై చేసే పెట్టుబ‌డుల‌కు చిన్న మిన‌హాయింపు అందుబాటులో ఉంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(32) ప్ర‌కారం ఒక్కొక్క‌రికి రూ.1500 చొప్పున గరిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీపై ఒక్క‌రికి రూ.1500 చొప్పున గ‌రిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు రూ.3 వేల వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

స‌రైన ప్ర‌ణాళిక అవ‌స‌రం:
పిల్ల‌ల కోసం పెట్టుబ‌డి పెడుతున్న‌ప్పుడు ల‌క్ష్యాల ఆధారంగా పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది. వారి కోసం పొదుపు చేసిన మొత్తాన్ని వేరే వాటికి వినియోగించ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌ల్లిదండ్రులు మ‌రింత నిబ‌ద్ధ‌త పాటించాలి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో దీర్ఘ‌కాలంపాటు పెట్టుబడులు కొన‌సాగించ‌డం వ‌ల్ల ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు వీల‌వడంతో పాటు ఏ ద‌శ‌లోనూ ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోవ‌చ్చు.

పిల్ల‌ల పేరుతో పెట్టుబ‌డి పెట్టేప్పుడు, ప‌థ‌కం నుంచి నిష్క్ర‌మించే స‌మ‌యంలో కూడా అద‌న‌పు పేప‌ర్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. నిర్థిష్ట పెట్టుబ‌డుల‌కు పిల్ల‌ల పేరుతో ప్ర‌త్యేక‌మైన బ్యాంకు ఖాతాను కూడా తెర‌వాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా మీ పిల్ల‌ల‌కు 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌రువాత‌, వారికి ఆ పెట్టుబ‌డి పూర్తి హ‌క్కు వ‌స్తుంది. మీరు మీ పిల్ల‌ల కోసం అద‌నంగా పొదుపు చేస్తుంటే, అందుకు మీరు ఎంచుకున్న పెట్టుబ‌డి మార్గాన్ని, ఏ ల‌క్ష్యం కోసం పెట్టుబ‌డి పెట్టారు… త‌దిత‌ర విష‌యాల‌ను ఎప్పుడూ గుర్తించుకోవాలి.

ఒక‌వేళ పిల్ల‌ల పేరుపై ప్ర‌త్యేకంగా పెట్టుబ‌డి పెడితే అది మీ పోర్ట్‌ఫోలియోకి స‌రిప‌డుతుందో లేదో కూడా సరిచూసుకోవాలి. మీ పెట్టుబ‌డుల‌కు మెచ్యూరిటీ పిరియ‌డ్‌, లాక్ పిరియ‌డ్ వంటివి ఉంటే అవి పిల్ల‌ల అవ‌స‌రాల‌కు త‌గిన స‌మ‌యానికి తిరిగి వ‌చ్చేలా ప్ర‌ణాళిక చేసుకోవాలి.

పిల్లల ప్రత్యేక పాలసీల నుంచి దూరంగా ఉండడం మేలు. ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts