గృహ రుణ ముంద‌స్తు చెల్లింపులు లాభ‌దాయ‌క‌మేనా? 

గృహ‌రుణాన్ని ముంద‌స్తుగా చెల్లించాల‌నే ఆలోచ‌న ఉన్న‌వారు ఈ మూడు అంశాల‌ను గ‌మ‌నించి, ఆ త‌ర్వాత స‌రైన నిర్ణ‌యం తీసుకోండి

Updated : 09 Apr 2021 13:42 IST

గృహ‌రుణాన్ని ముందస్తుగా తీర్చేసి అప్పు భారం దించుకొని హ‌మ్మ‌య్య అనుకోవాల‌ని చాలా మందికి ఉంటుంది. పైపెచ్చు తెలిసివ వాళ్లూ ఇదే స‌ల‌హా ఇస్తుంటారు. ముందు అప్పుల‌న్నీ తీర్చేసి ఆ త‌ర్వాత తీరిగ్గా మ‌దుపు చేయ‌డం ప్రారంభించ‌మ‌ని చెబుతుంటారు. అన్ని రుణాల లాగానే గృహ‌రుణాన్ని తీర్చేందుకు తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. గృహ‌రుణం కొన‌సాగించ‌డం ఒకందుకు మంచిదే. అదెలాగో చూద్దాం.

గృహ‌రుణాన్ని ముంద‌స్తుగా చెల్లించాల‌నే ఆలోచ‌న ఉన్న‌వారు ఈ మూడు అంశాల‌ను గ‌మ‌నించండి. ఆ త‌ర్వాత స‌రైన నిర్ణ‌యం తీసుకోండి.

పెట్టుబ‌డిగా పెడితే..

ముంద‌స్తుగా గృహ‌రుణాన్ని తీర్చాల‌నుకునే సొమ్మును పెట్టుబ‌డిగా వినియోగిస్తే ఎలా ఉంటుంది? పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిని గృహ‌రుణ వాయిదాల మొత్తంతో పోల్చి చూసుకోవాలి. ఇలా చూసిన‌ప్పుడు సాధార‌ణంగా పెట్టుబ‌డుల‌పై రాబ‌డే అధికంగా వ‌స్తుంది. అలాంట‌ప్పుడు గృహ‌రుణాన్ని ముంద‌స్తుగా చెల్లించ‌కుండా అదే సొమ్మును పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లిస్తే ఎంత లాభ‌మో ఒక ఉదాహ‌ర‌ణ‌తో చూద్దాం.

మీ ద‌గ్గ‌ర రూ. 10 ల‌క్ష‌లు ఉన్నాయ‌నుకుందాం. దీంతో ముంద‌స్తు గృహ రుణం తీర్చాల‌నుకుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గృహ రుణ వార్షిక వ‌డ్డీ రేటు 8.5 శాతం ఆదా చేసుకోగ‌లుగుతారు. అయితే గృహ‌రుణం ముందస్తుగా చెల్లించ‌కుండా అదే సొమ్మును 10 శాతం వ‌డ్డీనిచ్చే పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో పెడితే లాభం వ‌స్తుంది. అదెలా అంటే… పెట్టుబ‌డుల ద్వారా 10 శాతం రాబ‌డిని ఆర్జిస్తారు. 8.5 శాతం గృహ‌రుణ వ‌డ్డీల‌కు పోతుంది. ఇక మిగిలిన 1.5 శాతం మీ లాభ‌మే. ముంద‌స్తుగా రుణాన్ని తీర్చ‌డం వ‌లన ఈ అధిక రాబ‌డిని కోల్పోయే అవ‌కాశం ఉంది.

అయిదేళ్ల‌లో ముగుస్తుంద‌నుకుంటే వ‌ద్దు..

మీ గృహ‌రుణ కాల‌వ్య‌వ‌ధి మ‌రో అయిదేళ్ల‌లో ముగిసేలా ఉంటే ముంద‌స్తు చెల్లింపును విరమించుకోవ‌డం మంచిది. ఎందుకంటే రుణం చెల్లించే ప్రారంభ సంవ‌త్స‌రాల్లో వ‌డ్డీ ఎక్కువ క‌డ‌తారు, అస‌లు త‌క్కువ క‌డ‌తారు. రాను రాను వ‌డ్డీ త‌గ్గిపోతుంటే అస‌లు పెరుగుతూ ఉంటుంది. చివ‌రి అయిదు సంవ‌త్స‌రాల లోపు అయితే చెల్లించే అస‌లు ఎక్కువ‌గా ఉంటుంది, వ‌డ్డీ త‌క్కువ‌గా ఉంటుంది. అంటే… అదే సొమ్ము పెట్టుబ‌డిగా మ‌లిస్తే ఎక్కువ వ‌డ్డీరేటుతో అధిక రాబ‌డి వ‌స్తుంది. పైన వివ‌రించిన‌ ఉదాహ‌ర‌ణ‌తో చూసిన‌ట్ల‌యితే పెట్టుబ‌డుల వల్ల‌ ఈ రకంగానూ లాభం పొంద‌వ‌చ్చ‌నేది అర్థం అవుతుంది.

ఈక్విటీ పెట్టుబ‌డుల్లో మంచి రాబ‌డి వ‌చ్చేందుకు దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగించాల్సి వ‌స్తుంది. 5 నుంచి 7 ఏళ్లు కొన‌సాగిస్తే గానీ మంచి లాభాలు రావు. ఒకవేళ మార్కెట్ల ప‌రిస్థితి బాగా లేక‌పోతే గృహ‌రుణ వ‌డ్డీ రేటు కంటే ఈక్విటీ పెట్టుబ‌డుల‌తో రాబ‌డి మ‌రింత త‌క్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే గృహ‌రుణ చెల్లింపుల కాల‌వ్య‌వ‌ధి త‌క్కువ‌గా ఉంటే నిర్ణ‌యాన్ని విర‌మించుకోవ‌డ‌మే మంచి ఆలోచ‌న‌.

ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం కోల్పోతారు..

గృహ‌ రుణంపై ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు, వ‌డ్డీ చెల్లింపులు రెండింటి పైనా ఈ వెసులుబాటు ఉంది. ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గోరే వారు గృహ‌ రుణం చెల్లించ‌డం ద్వారా ఎక్కువ మిన‌హాయింపు ల‌భిస్తుందో లేక పెట్టుబ‌డుల‌తో ప‌న్ను మిన‌హాయింపుల‌ వ‌ల్ల ఎక్కువ ల‌బ్ధి పొందగ‌ల‌రో అనే విష‌యాన్ని లెక్క‌లు వేసుకొని చూసుకోవాలి. 

పైన పేర్కొన్న కార‌ణాలు కాకుండా ముంద‌స్తు గృహరుణ చెల్లింపుల‌పై రుణ‌సంస్థ‌లు విధించే ఛార్జీలను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకొని స‌రైన నిర్ణ‌యం తీసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని