ఐటీఆర్‌లో పన్ను మినహాయింపు ఆదాయం చూపించడం ఎందుకు ముఖ్యం?

పన్ను చెల్లింపుదారులు మినహాయింపు ఆదాయాన్ని ‘మినహాయింపు ఆదాయం’ లో చూప‌వ‌చ్చు

Updated : 24 Jun 2021 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను రిటర్న్స్‌ (ఐటీఆర్)ను చాలా జాగ్రత్తగా దాఖలు చేయాలి. కొందరు ఈ ప్రక్రియలో కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. దీనివల్ల కొన్ని పరిణామాలు ఎదురుకావొచ్చు. ఐటీఆర్‌లో పన్ను మినహాయింపు ఆదాయాన్ని వెల్లడించక‌పోవ‌డం ఒక సాధారణ తప్పు. ఈ విధంగా మీరు ఐటీఆర్‌లో చూపాల్సిన మిన‌హాయింపు ఆదాయాలు ఏవో తెలుసుకుందాం.
మినహాయింపు ఆదాయం: 
వ్యవసాయ ఆదాయం రూ.5,000 వరకు, బంధువుల నుంచి పొందిన‌ బహుమతి, ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్ 10 (10డి) ఉప నిబంధనలు (ఎ) నుంచి (డి)లో పేర్కొన్న‌వి కాకుండా జీవిత బీమా పాలసీ నుంచి అందుకున్న బోనస్‌, చట్టబద్ధమైన ప్రావిడెంట్ ఫండ్ నుంచి పొందిన మొత్తం, మంచి ర్యాంకు పొందినందుకు గాను వ‌చ్చే స్కాల‌ర్‌షిప్.. వంటి వాటిపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. కానీ ఈ ఆదాయాల‌ను ఐటీఆర్‌లో చూపాల్సి ఉంటుంది.
ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు: ఇది మిన‌హాయింపు ఆదాయం కావొచ్చు, కానీ మినహాయింపు ఆదాయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా సంపాదించే ఏదైనా ఆదాయం పన్ను పరిధిలోకి రావచ్చు. కాబట్టి, దానిని బహిర్గతం చేయకపోవడం వల్ల ఆదాయ ప‌న్ను శాఖ దాని మూలం గురించి అడుగుతుంది. ఉదాహరణకు, ఒక తండ్రి తన కొడుకు వ‌ద్ద‌ కొంత మొత్తాన్ని తీసుకొని, ఆస్తి కొనుగోలు చేసేందుకు పెట్టుబడి పెడితే, అత‌డి ఆదాయంలో ఈ మొత్తాన్ని చూప‌ని కార‌ణంగా ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందని అడ‌గొచ్చు.
  
బ్యాంకులు, రిజిస్ట్రార్లు, కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, అధీకృత డీలర్ల నుంచి అధిక విలువైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని పన్ను శాఖ సంగ్రహిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు వారి ఆదాయ వనరులు, ఖర్చుల గురించి వెల్ల‌డించే విష‌యంలో అప్రమత్తంగా ఉండాలి. పన్ను చెల్లింపుదారులు మినహాయింపు ఆదాయాన్ని ‘మినహాయింపు ఆదాయం’ లో చూప‌వ‌చ్చు. ఇది తుది పన్ను బాధ్యతలను లెక్కించేటప్పుడు ఆటోమేటిక్‌గా మినహాయింపు అవుతుంది.

తల్లిదండ్రులతో కలిసి ఉన్న మైనర్ పిల్లల మినహాయింపు ఆదాయాన్ని కూడా ఐటీఆర్‌లో నివేదించాలి. ఒక వ్యక్తి పన్ను చెల్లింపుదారు మొత్తం ఆదాయాన్ని లెక్కించడంలో, అతని మైనర్ బిడ్డకు వచ్చే ఆదాయం లేదా ఉత్పన్నమయ్యే ఆదాయం (వైక‌ల్యం ఉన్న కార‌ణంగా వ‌చ్చే ఆదాయం లేదా అతని నైపుణ్యం లేదా ప్రతిభను ఉపయోగించడం ద్వారా వ‌చ్చే ఆదాయం కాదు) త‌ల్లిదండ్రులో ఎవ‌రి ఆదాయం ఎక్కువ‌గా ఉందో వాళ్ల‌తో క‌లిపి లెక్కించాలి. లేదా ఎవ‌రు పిల్ల‌వాడి సంర‌క్ష‌ణ చూసుకుంటున్నారో వాళ్ల‌తో క‌లిపి ప‌రిగ‌ణించాలి. అయితే, తల్లిదండ్రులకు, దీనిపై రూ. 1,500 వరకు మినహాయింపు  ఉంటుంది. ఈ విధంగా తల్లిదండ్రుల చేతిలో ఉన్న ఆదాయాన్ని షెడ్యూల్ ఎస్‌పీఐ (ఆదాయ ప్రకటన),  షెడ్యూల్ ఈఐ (మినహాయింపు ఆదాయం) లో వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని