గోల్డ్ డిపాజిట్ స్కీమ్ సుర‌క్షిత‌మేనా?

ఈ పథకం ద్వారా వినియోగ‌దారులు బంగారం కొనేందుకు డబ్బును కూడబెట్టుకునే అవ‌కాశం ఉంది, కాని ఇతర సురక్షితమైన పెట్టుబడి ప‌థ‌కాలు కూడా ఉన్నాయ‌ని గుర్తుంచుకోండి.....

Published : 21 Dec 2020 16:16 IST

ఈ పథకం ద్వారా వినియోగ‌దారులు బంగారం కొనేందుకు డబ్బును కూడబెట్టుకునే అవ‌కాశం ఉంది, కాని ఇతర సురక్షితమైన పెట్టుబడి ప‌థ‌కాలు కూడా ఉన్నాయ‌ని గుర్తుంచుకోండి.​​​​​​​

13 నవంబర్ 2019 మధ్యాహ్నం 3:40

ఇటీవ‌ల వినియోగ‌దారుల‌ను సొమ్మును దోచుకొని దుకాణాన్ని మూసివేసిన‌ మ‌హారాష్ర్ట‌కు చెందిన గుడ్‌విన్ జువెల‌ర్స్ వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇందులో చాలామంది వినియోగ‌దారులు గోల్డ్ డిపాజిట్ స్కీముల్లో నెల‌వారిగా (ఈఎమ్ఐ) చెల్లిస్తున్నారని తెలిసింది.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఏంటి?
ఈ స్కీముల్లో భాగంగా వినియోగ‌దారులు 11 నెల‌ల వాయిదాలు చెల్లిస్తే, ఒక నెల దుకాణ‌దారుడు వాయిదాను చెల్లిస్తాడు. ఆ త‌ర్వాత కూడ‌బెట్టిన‌ మొత్తానికి విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాలు తీసుకునేందుకు వీలుంటుంది. కొన్ని జువెల‌ర్స్ 12 నెల‌ల వాయిదాలు చెల్లించాల్సిందిగా, దానికి బ‌దులుగా త‌యారీ ఛార్జీలు ఉండ‌వ‌ని చెప్తారు. త‌యారీ ఛార్జీలు, తీసుకుంటున్న బంగారు ఆభ‌ర‌ణాల ధ‌ర‌లో 13-15 శాతం ఉంటాయి. ఈ స్కీముల గురించి విన‌డానికి బాగానే ఉన్న ఇవి నియంత్ర‌ణ ప‌రిధిలో ఉండ‌వు కాబ‌ట్టి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

బంగారంపై మ‌క్కువ‌
భార‌తీయులు బంగారం కొనుగోళ్లును సాంప్రదాయంగా భావిస్తారు. బంగారాన్ని విలువైన పెట్టుబ‌డిగా న‌మ్ముతారు. రెండేళ్ల క్రితం వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ చేసిన ప‌రిశోధ‌న ప్ర‌కారం, భారతీయుల వ‌ద్ద‌ 23,000-24,000 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య 23,500 ట‌న్నుల‌కు చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తోంది. బంగారం సాంప్రదాయకంగా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా పరిగణిస్తారు, దీని విలువ భౌగోళిక రాజకీయ సంక్షోభం లేదా ఆర్థిక అస్థిరత సమయంలో పెరిగే అవకాశం ఉందని విశ్లేష‌కుల అభిప్రాయం.

భారతీయులకు బంగారంపై మ‌క్కువ ఎక్కువ‌. దానికి త‌గిన‌ట్లుగా బంగారం కొనేందుకు డ‌బ్బు ఆదా చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో వివాహం వంటి సంద‌ర్భాల కోసం ఎక్కువ బంగారం కొంటారు. అందుకే జువెల‌ర్లు వినియోగ‌దారులను ఆక‌ర్షించేందుకు బంగారు డిపాజిట్ పథకాలు ప్ర‌వేశ‌పెట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల దుకాణాలు అనేక దశాబ్దాలుగా వినియోగదారులకు బంగారు కొనుగోలు ప్రణాళికలు లేదా బంగారు పొదుపు పథకాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో ఈ ప‌థ‌కాల‌వైపు మొగ్గుచూపుతున్నారు.

ప‌థ‌కాల‌పై ప‌రిశీల‌న‌
ఇలాంటి డిపాజిట్ పథకాలు పరిశీలనలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో, నియంత్రణ లేని డిపాజిట్ పథకాలపై ఆర్డినెన్స్ జారీ చేయ‌డం ద్వారా బిల్డర్లు, ఆభరణాల వ్యాపారులు అందించే అధిక-రిస్క్ డిపాజిట్ పథకాలపై ప్రభుత్వం నిబంధ‌న‌లు విధించింది. ఈ ఆర్డినెన్స్ నిర్దిష్ట రెగ్యులేటరీ ఆమోదం ఉన్నవి మినహాయించి అటువంటి అన్ని డిపాజిట్ పథకాలను చట్టవిరుద్ధం చేసింది. ఇది మరింత సమగ్ర నియంత్రణ పాలన విధించడమే లక్ష్యంగా ప‌నిచేస్తుంది.

జువెల‌ర్లు వ్యాపారంలో భాగంగానే ఇలాంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. డిపాజిట్ చేసిన‌వారికి, తీసుకున్న‌ట్లు ఆధారాలు చూపాలి. దీనిప్ర‌కారం, బంగారం అమ్మ‌కాల‌కు, చెల్లింపుల‌కు ఇన్‌వాయిస్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డులు
గోల్డ్ డిపాజిట్ స్కీముల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి కార‌ణం బంగారం కొనుగోలు చేసేందుకు త‌గిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌డ‌మే. అయితే ఇలా క్ర‌మానుగుతంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు మార్కెట్ రెగ్యులేట‌రీ ఆమోదం పొందిన మ్యూచువ‌ల్ ఫండ్లు , సిప్ వంటి ప‌థ‌కాలు కూడా ఉన్నాయి. ఆభ‌ర‌ణాలు కొనేది కేవ‌లం వాటిని ధ‌రించి సంతోషించేందుకే. పాత రోజుల్లో పెట్టుబ‌డులు ఇత‌ర మార్గాలు లేనందును బంగారం కొనుగోలు చేసి దాచుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ఆవ‌స‌రం లేదు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబ‌డిన‌చ్చే ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. రిక‌రింగ్ డిపాజిట్లు, సిప్, డెట్ ఫండ్ల వంటి వాటిని ప‌రిశీలించ‌వ‌చ్చు. త‌యారీ ఛార్జీల‌ను జువెల‌ర్లు వారి ఇష్టానుసారం నిర్ణ‌యిస్తారు. . అయితే బంగారం కొనేట‌ప్పుడు త‌యారీ ఛార్జీల‌తో స‌హా ఉంటుంది. కానీ అమ్మేట‌ప్పుడు కేడ‌లం ఆభ‌ర‌ణానికి మాత్ర‌మే విలువ ఉంటుంద‌ని గుర్తించండి.

ఫిజిక‌ల్ గోల్డ్‌ను పెట్టుబ‌డుల సాధనంగా ఎంచుకోవ‌డం కంటే ఇత‌ర ప్ర‌త్యామ్నాయాల‌ను గుర్తించ‌డం తెలివైన ప‌ని . బంగారం కొన‌డం, నిల్వ చేయ‌డం, రిస్క్, నాణ్య‌త వంటి భ‌యాలు ఉంటాయి. గోల్డ్ డిజిట‌ల్ ప‌థ‌కాలు కూడా బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. బంగారం కొని ఇంట్లో దాచుకునే బ‌దులుగా బాండ్లు, ఈటీఎఫ్‌ల రూపంలో కొంటే ఎలాంటి భ‌యం ఉండ‌దు. గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కాలు రెగ్యులేట‌రీ ఆమోదం పొంద‌లేవు కాబ‌ట్టి పెట్టుబ‌డులుకు ఇత‌ర ప్ర‌త్యామ్నాయ ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని