Jio: రూపాయి రీఛార్జ్‌ ప్రయోజనాలను మార్చిన జియో!

కేవలం ఒక రూపాయితో రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించి సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో కొన్ని గంటల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది....

Published : 17 Dec 2021 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: కేవలం ఒక రూపాయితో రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించి సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో.. కొన్ని గంటల్లోనే ఆ ఆఫర్‌లోని ప్రయోజనాలను మార్చింది. ప్లాన్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలను కుదించి వినియోగదారులను ఒకింత నిరాశకు గురిచేసింది.

ఒక రూపాయితో రీఛార్జ్‌ చేస్తే 30 రోజుల కాలావధితో 100 ఎంబీ డేటాను అందిస్తామని జియో బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రోజువారీ డేటా కోటా అయిపోయినప్పుడు.. అత్యవసర డేటా అవసరాల కోసం రూ.1తో రీఛార్జ్‌ చేసుకోవచ్చని అందరూ సంబరపడ్డారు. కొంతమంది రీఛార్జి చేసుకున్నారు కూడా. కానీ, దాదాపు 24 గంటల వ్యవధిలో ప్రయోజనాలను తగ్గిస్తూ ప్లాన్‌ను ‘మై జియో యాప్‌’లో అప్‌డేట్‌ చేసింది. ఇప్పుడు ఒక రూపాయితో రీఛార్జ్‌ చేసుకుంటే ఒక రోజు కాలావధితో కేవలం 10 ఎంబీ డేటా మాత్రమే అందిస్తోంది. ఇలా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పటికే రీఛార్జ్‌ చేసుకున్నవారికి మాత్రం ప్రయోజనాలు కొనసాగుతున్నాయని సమాచారం.

రూ.1 రీఛార్జ్‌ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు మైజియో యాప్‌లోకి వెళ్లి ‘రీఛార్జ్‌’పై క్లిక్‌ చేయాలి. అందులో రీఛార్జ్‌ కోసం పలు రకాల ఎంపికలు కన్పిస్తాయి. ఆ వరుసలో చివరన ఉన్న ‘వ్యాల్యూ’ను ఎంపిక చేసుకోవాలి. అందులో కింద ఉన్న ‘అదర్స్‌’ విభాగంలోకి వెళ్తే ‘రూ.1 రీఛార్జ్‌’ కన్పిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, మీకు వీలున్న చెల్లింపు విధానంలో రూ.1 చెల్లించి రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని