జియో కొత్త ప్లాన్స్‌.. డైలీ డేటా లిమిట్‌కు చెక్‌

Jio No Daily Limit plans: రోజువారీ డేటా ప్లాన్లకు చెక్‌ పెడుతూ కొత్త ప్లాన్లను రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది.

Updated : 12 Jun 2021 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ పుణ్యమా అని డేటా వినియోగం భారీగా పెరిగింది. ఒక్కోసారి రోజుకు 2జీబీ పైనే అయిపోతుంటుంది కొందరికి. దీంతో ఆ రోజు లిమిట్‌ పూర్తయితే వేగం నెమ్మదిస్తుంది. అంటే మళ్లీ వేరే డేటా ప్లాన్‌ను వేసుకోవాలి. లేదంటే తర్వాతి రోజు వరకూ ఆగాలి. ఈ డైలీ లిమిట్‌కు చెక్‌ పెడుతూ రిలయన్స్‌ జియో సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లు రీఛార్జి చేసుకుంటే డైలీ లిమిట్‌ అనే ప్రస్తావన లేకుండా కేటాయించిన మొత్తాన్ని పూర్తయ్యే వరకూ డేటా వినియోగించుకోవచ్చు.

జియో కొత్త ప్లాన్లలో గతం మాదిరిగానే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, డైలీ 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు జియో యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి. కొత్త ప్లాన్లు ₹127 నుంచి ప్రారంభమవుతాయి. ₹127 ప్లాన్‌ గడువు 15 రోజులు. 12జీబీ డేటా లభిస్తుంది. అలాగే ₹247 ప్లాన్‌కు 25జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. గరిష్ఠ ప్యాక్‌ ధర ₹2,397. ఈ ప్యాక్‌తో రీఛార్జి చేసుకుంటే ఏడాది వ్యాలిడిటీతో పాటు 365జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్‌ గడువు లోపల ఎప్పుడైనా డేటాను వినియోగించుకునే వీలుంటుంది. మై జియో యాప్‌లో ‘నో డెయిలీ లిమిట్‌’ సెక్షన్‌లో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని