Whatsapp- Jio: వాట్సాప్‌ ద్వారా జియో రీఛార్జి, జియో మార్ట్‌ సేవలు!

రిలయన్స్‌ జియో నంబర్‌ రీఛార్జి చేయడం ఇక సులభతరం కానుంది. ప్రముఖ మెసెంజర్‌ వాట్సాప్‌ ద్వారానే రీఛార్జి చేసుకునే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది.

Published : 15 Dec 2021 21:16 IST

దిల్లీ: రిలయన్స్‌ జియో నంబర్‌ రీఛార్జి చేయడం ఇక సులభతరం కానుంది. ప్రముఖ మెసెంజర్‌ వాట్సాప్‌ ద్వారానే రీఛార్జి చేసుకునే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. అలాగే, జియో మార్ట్‌ సేవలూ వాట్సాప్‌ వేదికగా లభించనున్నాయి. బుధవారం మెటా (ఫేస్‌బుక్‌) ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా 2021 కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్‌ డైరెక్టర్లు ఆకాశ్‌ అంబానీ, ఇషా అంబానీ ఈ వివరాలను వెల్లడించారు.

వినియోగదారులకు రీఛార్జి చేసుకునే పనిని సులభతరం చేస్తూ వాట్సాప్‌ వేదికగా జియో ప్రీపెయిడ్‌ రీఛార్జి చేసుకునే సౌలభ్యాన్ని తీసుకొస్తున్నట్ల ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. 2022లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. వృద్ధులకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జియో మార్ట్‌ సేవలు సైతం వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇకపై వాట్సాప్‌ ద్వారా ‘ట్యాప్‌ అండ్‌ చాట్‌’ ఆప్షన్‌ ద్వారా తమకు నచ్చిన కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయొచ్చని ఆకాశ్‌ అంబానీ తెలిపారు. కొనుగోలు చేసిన వస్తువులకు జియో మార్ట్‌ లేదా క్యాష్‌ ఆన్‌ డెలివరీ రూపంలో నగదు చెల్లించొచ్చని తెలిపారు. ఫ్రీ డెలివరీ సదుపాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

గతేడాది ఏప్రిల్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలను 5.7 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ (ప్రస్తుతం మెటా) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఉన్న 40 కోట్ల వాట్సాప్‌ వినియోగదారులను, 50 లక్షల మంది రిటైలర్లతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. వాట్సాప్‌ ద్వారా సేవలను మరింత సులభతరం చేయడం ద్వారా ప్రస్తుతం ఆన్‌లైన్‌ వ్యాపారంలో ఉన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కు జియో మార్ట్‌ గట్టి పోటీ ఇవ్వనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు