KTR-Musk: మస్క్‌ మా తెలంగాణకు వచ్చేయండి.. టెస్లాకు కేటీఆర్‌ ఆహ్వానం

దిల్లీ: భారత విపణిలోకి టెస్లా (Tesla) విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయన్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్‌ మస్క్ (Elon Musk) వ్యాఖ్యలపై తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు.

భారత మార్కెట్‌లోకి టెస్లా విద్యుత్‌ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ)పై దిగుమతి సుంకాన్ని తగ్గించాల్సిందిగా టెస్లా గతేడాది కోరింది. ముందు విద్యుత్‌ కార్ల ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించాల్సిందిగా టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించింది. టెస్లా కోరిన రాయితీలు ఏ వాహన సంస్థకు ఇవ్వడం లేదని, టెస్లాకు పన్ను మినహాయింపులు ఇస్తే, భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన ఇతర కంపెనీలకు మంచి సంకేతాలు వెళ్లవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

కేటీఆర్‌ 2016లోనే టెస్లా కారును నడిపారు. అమెరికాకు వెళ్లిన సందర్భంగా మోడల్‌ ఎక్స్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని చిత్రాలను అప్పట్లో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మస్క్‌ కొత్త మార్పును తీసుకొచ్చారంటూ అభినందించారు. తాజాగా ఆ ట్విటర్‌ సందేశాన్ని కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేయడం విశేషం.



Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని