బీమాలో కీలక అంశాలు

జీవిత బీమా ఎంచుకునేముందు చూడాల్సిన అంశాల గురించి ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Published : 20 Dec 2020 19:58 IST

ప్రస్తుత కాలంలో ఎవరికైనా జీవిత బీమా పాలసీ అనేది ఒక ముఖ్య అంశం. బీమా తీసుకునేది పెట్టుబడి రూపంగానైనా, పన్ను ఆదా కోసమైనా ఆకస్మికంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఉపయోగపడేదే. బీమా తీసుకునేముందు పాలసీదారులు చాలా అంశాలను వదిలేసి ఆలోచిస్తారు. బీమా తీసుకునేముందు కచ్చితంగా సరిచూసుకోవాల్సిన అంశాలను ఇప్పుడు చూద్దాం.

సరైన బీమా పథకాన్ని ఎంచుకోండి

మార్కెట్లో రకరకాల జీవిత బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. బీమా అవసరమేంటో గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఆర్థిక రక్షణ కోసమైతే టర్మ్‌ ప్లాన్‌ సూచనీయం. పెట్టుబడి కోణం, బీమా రక్షణ రెండింటి కోసమైతే మనీబ్యాక్‌, ఎండోమెంట్‌, యాన్యుటీ, యులిప్స్‌ లాంటివి ఎంచుకోవడం మంచిది. ఇందులో సైతం మన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తగిన పాలసీని తీసుకోవాలి. స్వయంగా సరైన నిర్ధారణకు రాలేకపోతే ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదించి వారి మార్గదర్శకత్వంలో ఒక మంచి జీవిత బీమా పథకాన్ని ఎంచుకోవచ్చు.

ఎంత కాలానికి(టర్మ్‌ కవరేజీ)

పీపీఎఫ్‌లా, ఈపీఎఫ్‌లా కాకుండా మనకు సౌకర్యవంతంగా ఉండేలా కాలపరిమితిని ఎంచుకునే సదుపాయం టర్మ్‌ పాలసీలో ఉంటుంది. 5, 10 మొదలుకొని 30, 35 ఏళ్ల కాలపరిమితి ఉండేలా టర్మ్‌ పాలసీని తీసుకునే వీలు ఉంటుంది. సాధారణంగా పదవీ విరమణ వయసు వరకూ కాలపరిమితి ఉండేలా చూసుకోవడం మంచిది. అప్పటికి కుటుంబానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకునే ఉంటారు కాబట్టి తర్వాత జీవిత బీమా అవసరం ఉండదు. అప్పుడు యాన్యుటీలు తీసుకోవడం సూచనీయం.

బీమా హామీ మొత్తం

మన బంధువులు, స్నేహితులు చెప్పిన దాని ఆధారంగా ఏదో పాలసీని ఎంచుకోవడం చేయకూడదు. మన ఆదాయం, కుటుంబానికి తగ్గట్టు ఎంత మొత్తానికి పాలసీ తీసుకుంటే సరిపోతుందో లెక్కించుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎన్నో బీమా లెక్కింపు కాలిక్యులేటర్లు ఉన్నాయి. అవసరమైతే వాటి సాయం తీసుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి స్థితిలోనైనా కుటుంబ అవసరాలను తీర్చేంతగా నికర ఆస్తులు, స్థిర ఆదాయం ఉన్నప్పుడు సైతం బీమా అవసరం ఉండకపోవచ్చు. వీటన్నింటిని బేరీజు వేసుకుని బీమా హామీ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఆధారపడ్డవారు ఎవరూ లేనప్పుడు బీమా అవసరం నిర్దిష్టంగా ఉండకపోవచ్చు.

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌:

గత కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ హవా ఎక్కువైపోయింది. ఇప్పుడు బీమా పాలసీలు సైతం ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. పాలసీ గురించి కంపెనీ వెబ్‌సైట్‌లో ఉండే వివరాలు, క్లెయిం పద్ధతి, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పాలసీ మధ్య ప్రధాన తేడాలను గమనించాలి. ఆన్‌లైన్‌ గురించి అంతగా తెలియని వారు, ఈ పద్ధతిని కష్టంగా భావించేవారు ఆఫ్‌లైన్‌ పాలసీ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే క్లెయిం విషయంలో సైతం ఏజెంటు మధ్యవర్తిగా ఉంటూ సాయం చేస్తారు. మరోవైపు ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌ పాలసీ ప్రీమియం 20 నుంచి 30 శాతం తక్కువగా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ బేరీజు వేసుకుని ఏది అయితే మనకు అనుకూలంగా ఉంటుందని అనిపిస్తే అటువంటి పాలసీని ఎంచుకోవడం ఉత్తమం.

బీమా కంపెనీ ఎంపిక:

అన్ని అంశాలు చూసుకున్న తర్వాత బీమా కంపెనీ ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. బీమా సంస్థ బీమా ప్రాధికార, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) వద్ద నమోదయి ఉందో లేదో తెలుసుకోవాలి. క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో ఎక్కువగా ఉంటూ పాలసీదారులతో మర్యాదగా వ్యవహరించే కంపెనీని చూసుకోవాలి. ప్రీమియం అందుబాటు ధరలో ఉంటూ, ప్రత్యేకంగా రైడర్ల అవసరం లేకుండా తీవ్ర అనారోగ్యం, శాశ్వత వైకల్యం కలిగినప్పుడు బీమా హామీ మొత్తం అందించే పాలసీలను అందించే కంపెనీని ఎంచుకోవాలి. కంపెనీ క్లెయింల గురించి, కంపెనీపై ప్రజల అభిప్రాయాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకుని ఉంటే మంచిది.

  • పాలసీదారుడికి అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు క్లెయిం పరిష్కార మార్గం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి.

  • పాలసీ నచ్చకపోతే, మధ్యలోనే సరెండర్‌ చేస్తే వచ్చే స్వాధీన విలువను గురించి విచారించాలి.

  • లాక్‌ ఇన్‌ పీరియడ్‌, రుణ సదుపాయం వంటి వాటి గురించి తెలుసుకుని ఉంటే మంచిది.

  • పాలసీ పత్రాన్ని స్వయంగా పూరించడం సూచనీయం.

కుటుంబంలో ప్రధాన సంపాదనపరుడికే బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. జీవితాంతం ఉపయోగపడే పాలసీ తీసుకునే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని ప్రీమియంలు చెల్లించిన తర్వాత పాలసీ మంచిది కాదని భావిస్తే అప్పటి వరకూ ఖర్చు చేసిన డబ్బు వృథా అవుతుంది. అందుకే పై విషయాలన్నింటినీ నిశితంగా తెలుసుకున్న తర్వాతే బీమా తీసుకునేందుకు ముందడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని