ఎల్ఐసీ అందించే పెన్ష‌న్ ప‌థ‌కాల‌లో ఏది మేలు?

జీవ‌న్ శాంతి, జీవ‌న్ అక్ష‌య్‌, జీవ‌న్ నిధి, జీవ‌న్ ఉమాంగ్ ఏ పాల‌సీ మేలో తెలుసుకోండి

Published : 22 Dec 2020 15:25 IST

లైఫ్ ఇన్సూరెన్స్ కార్సొరేషేన్ ఆఫ్ ఇండియా(ఎల్ ఐ సి) వారు ప్ర‌భుత్వేత‌ర ఉద్యోగుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన జీవ‌న్‌ అక్ష‌య్ పాల‌సీ ద్వారా పెన్షన్ దారుల అవ‌స‌రాల‌ను తీరుస్తున్నారు. అయితే 2004లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెన్ష‌న్ పాలసీలో తీసుకువ‌చ్చిన మార్పుల కార‌ణంగా నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎపీస్‌) వ‌ల్ల ఎల్ఐసీ వారు జీవ‌న్ శాంతి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. జీవ‌న్ అక్ష‌య్ పాల‌సీ ద్వారా పెన్ష‌న్ దారునికి త‌క్ష‌ణ‌మే యాన్యూటీ అందిస్తారు. అయితే జీవ‌న్ శాంతి పాల‌సీ ద్వారా పెన్ష‌న్ దారుడు త‌క్ష‌ణ‌మే లేదా భ‌విష్య‌త్తులో యాన్యూటీని పొంద‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు భ‌విష్య‌త్తులో యాన్యూటీని పొంద‌డం కోసం జీవ‌న్‌ నిధి పాల‌సీపై ఆధార‌ప‌డ‌వ‌ల‌సి వ‌చ్చేది. జీవ‌న్ నిధి పాల‌సీ ద్వారా బీమా, బోన‌స్‌ను ఇస్తున్నారు.

  1. జీవ‌న్ శాంతి Vs జీవ‌న్ అక్ష‌య్‌:

జీవ‌న్ శాంతి పాల‌సీ ద్వారా పెన్ష‌న్ దారుడు త‌క్ష‌ణ‌మే, భ‌విష్య‌త్తులోయాన్యూటీని పొంద‌వ‌చ్చు. అయితే జీవ‌న్‌ అక్ష‌య్ పాల‌సీ ద్వారా త‌క్ష‌ణ‌మే యాన్యూటీ పొంద‌వ‌చ్చు. కావున త‌క్ష‌ణ‌మే పెన్ష‌న్ పాల‌సీ మొత్తాన్ని పొందాల‌నుకున్న వ్య‌క్తి ఈ రెండింటిలో ఏదో ఒక‌టి ఎంచుకోవ‌చ్చు. జీవ‌న్ అక్షయ్‌లో వార్షిక‌ వ‌డ్డీ రేటు కొంచెం అధికంగా వుంటుంది. అయితే జీవ‌న్ శాంతి పాల‌సీ వ్య‌క్తి ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే కాక కుటుంబ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో పాల‌సీ దారునిపై ఆధార‌ప‌డిన దివ్యాంగునికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. కుంటుంబంలోని దివ్యాంగుడైన వ్య‌క్తిని పాల‌సీ దారుడు త‌న నామీనిగా ఎంచుకోవ‌చ్చు లేదా త‌క్ష‌ణ‌మే యాన్యూటీ పొంద‌డంలో రెండ‌వ వ్య‌క్తిగా నియ‌మించ‌వ‌చ్చు. అద‌న‌పు ఆదాయ‌ప‌న్ను చెల్లించే వ్య‌క్తులకు జీవ‌న్ శాంతి పాల‌సీ అత్యుత్త‌మ ఎంపిక‌.

2.జీవ‌న్ శాంతి Vs జీవ‌న్ నిధి:

పైన‌ తెలిపిన విధంగా జీవ‌న్ శాంతి పాల‌సీ ద్వారా పెన్ష‌న్ దారుడు త‌క్ష‌ణ‌మే, భ‌విష్య‌త్తులో యాన్యుటీని పొంద‌వ‌చ్చు. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి ఒకేసారి ప్రీమిమం చెల్లించ‌లేన‌ప్పుడు క్ర‌మంగా ప్రీమియం చెల్లించ‌డం ద్వారా త‌గిన నిధి అందచేయడ‌మే జీవ‌న్ నిధి ముఖ్య ఉద్దేశం. జీవ‌న్ నిధి పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి యాన్యూటి తీసుకోవ‌డం ప్రారంభించ‌డానికి ముందుగా మ‌ర‌ణిస్తే, నామినీకి బీమా నిధిని, బోన‌స్‌ను అంద‌చేస్తారు. అయితే జీవ‌న్ శాంతి పాల‌సీలో మొత్తం పాల‌సీ కొనుగోలు ధ‌ర, దానిపై వచ్చిన అద‌న‌పు మొత్తం నుంచి ఒక‌వేళ అప్ప‌టి వ‌ర‌కు యాన్యూటి ఇచ్చిన‌ట్ల‌యితే ఆ యాన్యూటీ మొత్త‌న్ని తీసివేయ‌గా వ‌చ్చిన‌ మొత్తం లేదా 110 శాతం కొనుగోలు ధ‌ర రెండింటిలో ఏది అధికంగా వుంటే దాన్ని చెల్లిస్తారు.

  1. జీవ‌న్ శాంతి Vs జీవ‌న్ ఉమాంగ్‌:

జీవ‌న్ ఉమాంగ్ నిజానికి పెన్ష‌న్ ప‌థ‌కం కాదు. జీవిత కాల బీమా ప‌థ‌కం. ప్రీమియం పేయింగ్ ట‌ర్మ్ (పీపీటి) పూర్తి అయితే ఇది న‌గ‌దు రూపంలో హామీతో కూడిన వార్షిక రాబ‌డిని అందిస్తుంది. ఇత‌ర‌ పెన్ష‌న్ ప‌థ‌కాల్లోలా కాకుండా జీవ‌న్ ఉమాంగ్ ద్వారా వ‌చ్చే రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తించ‌దు. జీవ‌న్ ఉమాంగ్ క్ర‌మంగా ప్రీమియం చెల్లించే ప‌థ‌కం. కాని జీవ‌న్ శాంతి ఒకేసారి ప్రీమియం చెల్లించి భ‌విష్య‌త్తులో పెన్ష‌న్ తీసుకోనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు మొత్తంగా ఒకేసారి ప్రీమియం చెల్లించే వారు జీవ‌న్‌ శాంతి పాల‌సీని, క్ర‌మంగా ప్రీమియం చెల్లించే వారు,ప‌న్నుర‌హిత రాబ‌డిని పొందాల‌నుకునే వారు జీవ‌న్ ఉమాంగ్‌ పాల‌సీని ఎంచుకోవడం మంచిది. జీవ‌న్ ఉమాంగ్ పాల‌సీ ఎంచుకునే వ్య‌క్తి గ‌రిష్ట వ‌య‌స్సు 55 సంవ‌త్స‌రాలు ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని