ఎల్ఐసీ 'క్యాన్స‌ర్ క‌వ‌ర్' పాల‌సీ స‌మ‌గ్ర వివ‌రాలు

క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ కొనుగోలుకు క‌నీస వార్షిక ప్రీమియం రూ.2,400

Published : 20 Dec 2020 14:53 IST

క్యాన్స‌ర్ కార‌ణంగా త‌లెత్తే ఆర్థిక ఇబ్బందుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఎల్ఐసీ ‘క్యాన్స‌ర్ క‌వ‌ర్’ పేరిట ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని గురించి పూర్తి వివ‌రాలు. క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీని ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు. రెండు ఆప్ష‌న్లు - బీమా హామీ ప్ర‌యోజ‌న ప‌రంగా ఈ ప్లాన్ రెండు ఆప్ష‌న్ల‌ను అందిస్తుంది. 1. లెవ‌ల్ స‌మ్ అస్యూర్డ్‌ - ఎంచుకున్న పాల‌సీ కాల‌వ్య‌వ‌ధికి ఒకే మొత్తం బీమా హామీ సొమ్ము ఉంటుంది. 2. ఇంక్రీజింగ్ స‌మ్ అస్యూర్డ్ - పాల‌సీ తీసుకున్న ఏడాది త‌ర్వాత(లేదా ఈ లోపు క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను క‌నుగొంటే) నుంచి 5ఏళ్ల దాకా ఏటా 10శాతం బీమా హామీ సొమ్ము పెంచుతూ వెళ‌తారు.

ప్ర‌యోజ‌నాలు: తొలి ద‌శ క్యాన్స‌ర్‌ - పాల‌సీ తీసుకున్న‌వారిలో తొలి ద‌శ క్యాన్స‌ర్ ను గుర్తిస్తే బీమా హామీ సొమ్ము మొత్తంలో 25శాతం అంద‌జేస్తారు. ఆ త‌ర్వాత నుంచి 3ఏళ్ల పాటు లేదా పాల‌సీ గ‌డువు ముగిసే దాకా త‌దుప‌రి ప్రీమియంల‌ను ర‌ద్దు చేస్తారు. మేజ‌ర్ ద‌శ క్యాన్స‌ర్‌ - మేజ‌ర్ ద‌శ క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే 100శాతం బీమా హామీ సొమ్మును చెల్లిస్తారు. గ‌తంలో తొలి ద‌శ క్యాన్స‌ర్‌ను గుర్తించి దానికి ప‌రిహారం చెల్లించిన‌ట్ట‌యితే అది కాకుండా మిగ‌తాది మాత్ర‌మే ప‌రిహారంగా ఇస్తారు. 100శాతం ప‌రిహారం కాకుండా బీమా హామీ సొమ్ములో 1శాతం చొప్పున నెల నెలా పాల‌సీదారుల‌కు చెల్లిస్తారు. ఇలా 10ఏళ్ల దాకా ఆదాయ ప్ర‌యోజ‌నం క‌ల్పిస్తారు. పాల‌సీ గ‌డువు ముగిసినా స‌రే ఈ ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది. పై రెండు ప్ర‌యోజ‌నాలు కాకుండా త‌దుప‌రి ప్రీమియం ఛార్జీల‌ను ర‌ద్దు చేసేస్తారు. వెయిటింగ్ పీరియ‌డ్‌ - పాల‌సీ కొనుగోలు చేసిన నాటి నుంచి 180 రోజుల వ‌ర‌కు క్యాన్స‌ర్‌ను గనుక గుర్తిస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు అందించ‌రు. కాబ‌ట్టి పాల‌సీ కొనుగోలు చేశాక క‌నీసం 6 నెల‌ల వెయిటింగ్ పీరియ‌డ్ కింద ఆగాల్సి ఉంటుంది. పాల‌సీ కొనుగోలుకు అర్హ‌త‌లు - పాల‌సీదారు క‌నీస వ‌య‌సు- 20ఏళ్లు (పూర్తి అవ్వాలి), పాల‌సీదారు గ‌రిష్ట వ‌య‌సు - 65ఏళ్లు ( నిండి ఉండాలి), పాల‌సీ క‌నీస కాల‌వ్య‌వ‌ధి - 10ఏళ్లు, పాల‌సీ గ‌రిష్ట కాల‌వ్య‌వ‌ధి - 30ఏళ్లు, క‌నీస బీమా హామీ సొమ్ము - రూ.10లక్ష‌లు. గ‌రిష్ట బీమా హామీ సొమ్ము - రూ.50ల‌క్ష‌లు, క‌నీస ప్రీమియం - అన్ని ప‌ద్ధతుల్లో - రూ.2,400. ప్రీమియం చెల్లింపులు - ఏడాదికి లేదా ఆరు నెల‌ల‌కు ఒక సారి ప్రీమియం చెల్లింపులు జ‌ర‌పాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లింపున‌కు 30 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఇస్తారు. ఆ లోపు చెల్లించ‌క‌పోతే రుసుములు వ‌ర్తిస్తాయి. ప్రీమియం ధ‌ర‌లు ఇలా…న‌మూనా ప్రీమియం ధ‌ర‌లను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు. ప్ర‌తి రూ.10ల‌క్ష‌ల బీమా హామీ సొమ్ముకు, వ్య‌క్తి వ‌య‌సు, పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిని బ‌ట్టి ప్రీమియం రేట్ల‌ను లెక్కించి ఇస్తున్నాం.

TABLE.png

పున‌రుద్ధ‌ర‌ణ‌:

  • గ్రేస్ పీరియ‌డ్‌లోనూ ప్రీమియం చెల్లించ‌క‌పోతే పాల‌సీ ల్యాప్స్ అవుతుంది. అలా అయిన దాన్నితిరిగి పున‌రుద్ధ‌రించుకునేందుకు 2 ఏళ్ల దాకా అవ‌కాశం ఉంటుంది.

  • బ‌కాయి ప‌డిన ప్రీమియంల‌ను, దానిపై వ‌డ్డీని చెల్లిస్తేనే పాల‌సీని తిరిగి పున‌రుద్ధ‌రిస్తారు.

ఇత‌ర అంశాలు:

  • పాల‌సీకి ఎలాంటి పెయిడ్ అప్ విలువ లేదు.

  • పాల‌సీని మ‌ధ్య‌లో స్వాధీనం చేయ‌లేం. క‌ట్టిన ప్రీమియంల‌ను తిరిగి పొంద‌లేం.

  • పాల‌సీపై ఎటువంటి రుణాన్ని పొంద‌లేం.

న‌చ్చ‌క‌పోతే:

  • పాల‌సీ కొనుగోలు చేశాక నియ‌మ‌నిబంధ‌న‌లు న‌చ్చ‌క వెన‌క్కి ఇచ్చేందుకు 15 రోజుల గ‌డువుంటుంది.

  • ఆన్లైన్‌లో కొంటే 30రోజుల స‌మ‌యంలోపు తిరిగి ఇచ్చేయ‌వ‌చ్చు.

  • పాల‌సీ తిరిగిచ్చాక అప్ప‌టికే చెల్లించిన ప్రీమియంలో కొంత రుసుముగా సంస్థ తీసుకొని మిగ‌తాది ఇచ్చేస్తుంది.

పాల‌సీ వ‌ర్తించ‌ని సంద‌ర్భాలు:

  • ముంద‌స్తుగా క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి

  • పాల‌సీ కొనుగోలు చేశాక 180 రోజుల లోపు క్యాన్స‌ర్‌ను గుర్తించిన సంద‌ర్భంలో…

  • పాల‌సీదారు హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ లాంటి క్లిష్ట‌మైన వ్యాధుల‌తో ఉన్న సంద‌ర్భంలో…

  • అణు ధార్మిక‌త‌కు నేరుగా గురైన వారికి, మాద‌క ద్ర‌వ్యాల సేవ‌నం అధికంగా చేసిన‌వారికి…

క్యాన్స‌ర్ … మారిన జీవ‌న ప్ర‌మాణాల దృష్ట్యా భార‌త‌దేశంలో వేగంగా విస్త‌రిస్తోంది. ఇది ఒక్క‌సారి వ‌స్తే ఆర్థికంగా బాగా న‌ష్ట‌పోతాం… భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని త‌క్కువ ప్రీమియంతో మంచి పాల‌సీ కొనుగోలు చేయాలంటే ఎల్ఐసీ అందిస్తోన్న క్యాన్స‌ర్ క‌వ‌ర్ పాల‌సీ కొనుగోలును ప‌రిశీలించవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని