Vishaka Steel Plant: విశాఖ ఉక్కు రేసులో లక్ష్మీమిత్తల్‌!

విశాఖ ఉక్కును కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉందని దేశీయ దిగ్గజం టాటా స్టీల్‌ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా గుజరాత్‌కు చెందిన ఏఎమ్‌ఎన్‌ఎస్‌ ఇండియా కూడా బిడ్‌ దాఖలు చేయాలని భావిస్తోంది

Updated : 24 Aug 2021 09:11 IST

ఏఎమ్‌ఎన్‌ఎస్‌ ఇండియా ద్వారా

దిల్లీ: విశాఖ ఉక్కును కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉందని దేశీయ దిగ్గజం టాటా స్టీల్‌ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా గుజరాత్‌కు చెందిన ఏఎమ్‌ఎన్‌ఎస్‌ ఇండియా కూడా బిడ్‌ దాఖలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉక్కు శాఖ పాలనా నియంత్రణలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) లేదా విశాఖ ఉక్కుకు 7.3 మిలియన్‌ టన్నుల(ఎమ్‌టీ) సామర్థ్యం ఉంది. విశాఖ ఉక్కుపై ఆసక్తి ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ఏఎమ్‌ఎన్‌ఎస్‌ ఇండియా ఆ అవకాశాలను పరిశీలిస్తోంద’ని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. ఆర్సెలర్‌ మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా (ఏఎన్‌ఎమ్‌ఎస్‌)కు మాతృసంస్థ అయిన ఆర్సెలర్‌ మిత్తల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ లక్ష్మీ ఎన్‌ మిత్తల్‌ గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినట్లు ఏఎమ్‌ఎన్‌ఎస్‌ ఇండియా ఒక ట్వీట్‌ చేసింది. ఆ సమావేశానికి కారణాలను మాత్రం వివరించలేదు. ఏఎమ్‌ఎన్‌ఎస్‌ ఇండియా అనేది ఆర్సెలర్‌మిత్తల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఆఫ్‌ జపాన్‌ల సంయుక్త సంస్థ అనే విషయం తెలిసిందే. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను కొనుగోలు చేయడానికి తమ కంపెనీకి ఆసక్తి ఉందని టాటా స్టీల్‌ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్‌ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కులో ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటా విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయ అంగీకారం తెలిపిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని