ఎల్ఐసీ పాల‌సీలకు పాన్‌, ఆధార్‌ అనుసంధానం ఎలా?

ఆధార్‌, పాన్‌తో ఎల్ఐసీ పాల‌సీల‌ను ఎలా అనుసంధానం చేసుకోవాలో ఈ కింది క‌థ‌నంలో తెలుసుకుందాం.

Published : 20 Dec 2020 17:12 IST

ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం పాలసీదారులు త‌మ పాలసీల‌ను ఆధార్‌, పాన్‌తో క‌చ్చితంగా అనుసంధానం చేసుకోవాల‌ని ఎల్ఐసీ ప్ర‌క‌టించింది. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లోనూ రెండు ర‌కాలుగా పాల‌సీల‌తో పాన్‌, ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు త‌గిన ఏర్పాట్లు చేసిన‌ట్లు ఎల్ఐసీ తెలిపింది. ఆన్‌లైన్ విధానంలో ఆధార్ ప్రాధికార సంస్థ‌(యూఐడీఏఐ) వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నెంబ‌ర్‌ని ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేయ‌గానే వ‌న్‌టైమ్ పాస్‌వ‌ర్డ్(ఓటీపీ) వ‌స్తుంది. యూఐడీఏఐ వ‌ద్ద వెరిఫికేష‌న్ పూర్త‌యితే ఎస్ఎమ్ఎస్ లేదా మొయిల్ రూపంలో పాల‌సీదారుడికి సమాచారం వ‌స్తుంది. ఆఫ్‌లైన్ విధానంలో పాల‌సీదారుడు సంబంధిత ఫారాన్ని పూర్తి చేసి, అన్ని ప‌త్రాల‌ను ద‌గ్గ‌రున్న ఎల్ఐసీ శాఖ‌లో స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది.

ఆన్‌లైన్ విధానంలో పాల‌సీల‌ను ఎలా అనుసంధానం చేయాలి?

  1. మీ ఎల్ఐసీ పాల‌సీల నెంబ‌ర్ల లిస్ట్‌ను త‌యారు చేసిపెట్టుకోండి. దీంతోపాటు మీ ఆధార్ కార్డ్‌, పాన్ కార్డ్‌ని ద‌గ్గ‌రుంచుకోండి.

  1. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవండి. హోమ్‌పేజీలో పాన్‌, ఆధార్‌తో పాల‌సీల అనుసంధానానికి సంబంధించిన లింక్ క‌నిపిస్తుంది.

  2. దానిపై క్లిక్ చేస్తే పాలసీల‌ను ఎలా అనుసంధానించాలో కొన్ని సూచ‌న‌లు క‌నిపిస్తాయి. ఆ సూచ‌న‌ల‌ను చ‌ద‌వండి.

  3. యూఐడీఏఐ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నెంబ‌ర్‌ని న‌మోదు చేస్తే, వ‌న్‌టైమ్ పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది.

  4. ఒక‌వేళ ఆధార్‌తో మీ మొబైల్ నెంబ‌ర్ అప్‌డేట్ కాక‌పోయుంటే, ఆధార్ అనుసంధానం కోసం మీ స‌మీపంలోని ఎల్ఐసీ శాఖని సంద‌ర్శించండి.

  5. చెక్‌లిస్ట్‌ని ఒక‌సారి ప‌రిశీలించిన త‌ర్వాత పేజీ చివ‌ర‌న ఉన్న ప్రోసీడ్ బ‌ట‌న్ నొక్కితే ఈ క్రింది ర‌కంగా ఒక ఫారం ద‌ర్శ‌నమిస్తుంది.

lic policy aadhar pan.PNG

  1. ఆ ఫారంలో పాల‌సీదారుడు ఆధార్ లో ఉన్న‌ట్లుగా త‌న పూర్తి పేరు, పుట్టిన రోజు, తండ్రి లేదా జీవిత భాగ‌స్వామి, ఆధార్ సంఖ్య‌, పాల‌సీ సంఖ్య‌, పాన్ కార్డ్ వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

  2. త‌ర్వాత ఓటీపీ కోసం ఉద్ధేశించిన లింక్‌ని క్లిక్ చేస్తే, ఆధార్ వ‌ద్ద రిజిస్టర‌యిన మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.

  3. ఫారం స‌మ‌ర్పించ‌డం పూర్త‌యిన త‌ర్వాత రిజిస్ట్రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన‌ట్లు మీకు సందేశం వ‌స్తుంది.

  4. యూఐడీఏఐ ప‌రిశీల‌న పూర్త‌యిన త‌ర్వాత మీకు సందేశం లేదా మెయిల్ వ‌స్తుంది. ప‌రిశీల‌న పూర్తి కావ‌డానికి కొన్ని రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉందని ఎల్ఐసీ తెలిపింది.

ఆన్‌లైన్ లో పాన్‌, ఆధార్‌తో పాల‌సీల అనుసంధానం వీలు కాక‌పోతే స‌మీప ఎల్ఐసీ శాఖ‌ని సంప్ర‌దించండి. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ఫారం లింక్ ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. దానిలో పాల‌సీ సంఖ్య‌లు న‌మోదు చేసి సంత‌కం చేసి ఇవ్వండి. దీంతోపాటు ఆధార్/ పాన్ అనుసంధానం కోసం ఫారం-60 ని నింపి, ఆధార్‌, పాన్ జిరాక్స్ కాపీల‌పై సంత‌కం చేసి స‌మీప శాఖ‌లో ఇవ్వండి.

దీంతోపాటు ఒక నెంబ‌ర్‌కి ఎస్ఎమ్ఎస్ చేయ‌డం ద్వారా పాల‌సీల‌ను లింక్ చేయ‌వ‌చ్చ‌ని సామాజిక మాధ్య‌మాల‌లో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఎల్ఐసీ ఖండించింది. అవ‌న్నీ అస‌త్యాల‌ని, మేం ఆ విధంగా ఎలాంటి విధానాన్ని రూపొందించ‌లేద‌నీ ఎల్ఐసీ స్ప‌ష్టం చేసింది. అలాంటివి న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు, పాల‌సీదారుల‌కు ఎల్ఐసీ విజ్ఞ‌ప్తి చేసింది. ఒక‌వేళ అలాంటి విధానాన్ని ప్ర‌వేశ‌పెడితే దానికి సంబంధించిన వివ‌రాలు మా సైట్‌లో అప్‌డేట్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని