Health Insurance: దీర్ఘ‌కాలిక‌ ఆరోగ్య బీమా వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఏంటి? 

 సాధారణంగా, ఆరోగ్య బీమా వార్షిక ఒప్పందంతో వ‌స్తుంది. దీనికి ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట తేదీన పునరుద్ధరణ అవసరం.

Updated : 06 Oct 2021 16:06 IST

ఆరోగ్యం చ‌క్క‌గా ఉంటే రోజువారి జీవ‌న విధానంలో పెద్ద‌గా ఒడిదుడుకులు క‌నిపించ‌వు. జీవ‌నం సాఫీగా సాగిపోతుంది. కానీ అనారోగ్యంతో ఒక్క‌సారి ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చినా.. కుటుంబ ఆర్థిక వ్య‌వ‌స్థ భారీగా దెబ్బ‌తింటుంది. మెరుగైన‌, నాణ్య‌మైన వైద్యానికి అయ్యే ఖ‌ర్చు భారీగా పెర‌గ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ స‌మ‌స్య‌కి ఏకైక ప‌రిష్కారం సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ.

ఆరోగ్య బీమా మీకు, మీ కుటుంబానికి వైద్య సంర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. భారీ వైద్య ఖర్చులను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకు ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. ఇలాంటి అనేక ప్ర‌యోజ‌నాలు ఆరోగ్య బీమా ద్వారా ల‌భిస్తాయి. సాధారణంగా, ఆరోగ్య బీమా వార్షిక ఒప్పందంతో వ‌స్తుంది. దీనికి ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట తేదీన పునరుద్ధరణ అవసరం.  

ప్ర‌తీ ఏడాది ఆరోగ్య బీమాను పున‌రుద్ధ‌రించ‌డం క‌ష్ట‌మైన ప‌ని. బీమా సంస్థ‌లు పున‌రుద్ధ‌ర‌ణ తేదిని గుర్తు చేస్తూ, ప్ర‌తి సంవ‌త్స‌రం ఎస్ఎమ్ఎస్ ద్వారా పున‌రుద్ధ‌ర‌ణ నోటీసును పంపుతాయి. అయిన‌ప్ప‌టికీ కొంత మంది ఆల‌స్యం చేస్తుంటారు. దీంతో వెయిటింగ్ ప‌రియ‌డ్‌, నో-క్లెయిమ్ బోన‌స్ వంటి ప్ర‌యోజ‌నాలు క‌ల్పోయే అవ‌కాశం ఉంది. అయితే ఈ ఇబ్బందిని తొల‌గించేందుకు, వార్షిక పున‌రుద్ధ‌ర‌ణ భారాన్ని త‌గ్గించేంద‌కు బీమా సంస్థ‌లు దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా పాల‌సీల‌ను అందిస్తున్నాయి. ఈ పాలసీలు ప్రాథమికంగా ఒక సంవత్సరానికి పైగా కవరేజీని అందిస్తాయి. రెండు లేదా మూడు సంవత్సరాల పాటు నిరంతర కవరేజీ అందించే పాలసీలు భారత‌దేశంలో అందుబాటులో ఉన్నాయి. 

దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పాల‌సీ ప్రయోజనాలు..
పునురుద్ధ‌ర‌ణ చింత ఉండ‌దు..
ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం చేయాల్సి ప‌నుల‌లో ఆరోగ్య బీమా పునరుద్ధ‌ర‌ణ ముఖ్య‌మైన‌ది. సాధార‌ణ పాల‌సీలో వార్షిక పున‌రుద్ధ‌ర‌ణ కోసం కొంత డ‌బ్బును కేటాయించాలి. ఒక‌వేళ చెల్లింపు విఫ‌లం అయితే పాల‌సీ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది. దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల రెండు లేదా మూడు సంవ‌త్స‌రాలు పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ గురించిన‌ ఆందోళ‌న ఉండదు. 

ప్రీమియంపై డిస్కౌంట్‌..
వార్షిక పాలసీ కంటే దీర్ఘ‌కాలిక పాల‌సీలు చౌక‌గా ల‌భిస్తాయి. రెండు లేదు మూడు సంవ్స‌రాల క‌లిసి చెల్లించే ప్రీమియంపై దీర్ఘ‌కాలిక డిస్కౌంట్ వ‌ర్తించ‌డ‌మే ఇందుకు కార‌ణం. రెండేళ్ల పాల‌సీకి అయితే వార్షిక ప్రీమియంపై 1.8x నుంచి 1.9x వ‌ర‌కు మూడేళ్ల పాల‌సీకి 2.7x నుంచి 2.8x వ‌ర‌కు ప్రీమియం రేంజ్ ఉంటుంది. దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా పాల‌సీల‌లో ప్రీమియం రెండు నుంచి మూడు సంవ‌త్స‌రాలు లాక్ అయ్యి ఉంటుంది. ధ‌ర పెరుగుద‌ల ఉండ‌దు. 

ఉదాహ‌ర‌ణ‌కి, బ‌జాజ్ అలియాంజ్ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ అందిస్తున్న హెల్త్ గార్డ్ పాల‌సీ తీసుకుంటే.. జోన్ Aలో ప్లాటిన‌మ్ ప్లాన్ తీసుకుంటే రూ.5 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌ కోసం 32 సంవ‌త్స‌రాల వ్య‌క్తి ఒక సంవ‌త్స‌రం ప్లాన్‌కి చెల్లించాల్సిన ప్రీమియం రూ. 10,600. రెండు-సంవ‌త్స‌రాల‌(వ‌య‌సు 33 సంవ‌త్స‌రాలు) పాల‌సీ ప్రీమియం రూ.20,352, మూడేళ్ల‌(వ‌య‌సు 34 సంవ‌త్స‌రాలు) పాల‌సీ ప్రీమియం రూ.29,256 ఉంటుంది. పాల‌సీ రెండు సంవ‌త్స‌రాల‌కు తీసుకుంటే 4శాతం, మూడేళ్ల‌కు తీసుకుంటే 8శాతం దీర్ఘ‌కాలిక డిస్కౌంట్ ల‌భిస్తుంది. 

వ‌య‌సు పెరిగితే..
సాధార‌ణంగా ఆరోగ్య బీమా ప్రీమియం రేట్లు వ‌య‌సు ప‌రిధిని బ‌ట్టి కూడా ఖరారు చేస్తారు. ఒక వ‌య‌సు ప‌రిధి నుంచి మ‌రొక ప‌రిధికి మారిన‌ప్పుడు ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయి. అంటే  36-45 వ‌ర‌కు, 46-50 వ‌ర‌కు ఇలా ప‌రిధిలు ఉంటాయి. 45 నుంచి 46 సంవ‌త్స‌రంలోకి అడుగుపెడితే ప్రీమియం పెరుగుతుంది. దీర్ఘ‌కాలిక పాల‌సీ విష‌యంలో 45సంవ‌త్స‌రాల వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే మరో రెండు, మూడు సంవ‌త్స‌రాలు ప్రీమియంలో స‌హేతుక‌మైన పొదుపు ఉంటుంది.

దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తే, ఒక పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌తీ రెండు లేదా మూడు సంవ‌త్స‌రాల‌కు ఒకసారి ఈ మొత్తం స‌మ‌కూరేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే ప్ర‌స్తుతం ఆరోగ్య బీమా సంస్థ‌లు ప్రీమియంను వాయిదాల‌లో చెల్లించే అవ‌కాశాన్ని కూడా అందిస్తున్నాయి. ఏక‌మొత్తంగా చెల్లించ‌లేనివారు ఈ విధంగా ప్లాన్  చేసుకోవ‌చ్చు. 

ప‌న్ను..
ఆదాయ‌పు పన్ను చ‌ట్టం సెక్ష‌న్ 80డి ప్ర‌కారం ఆరోగ్యబీమా ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. వివిధ సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ప్రీమియం మొత్తం ఒకే సంవ‌త్స‌రం చెల్లించిన‌ప్ప‌కీ.. ఏ సంవ‌త్స‌రానికి సంబంధించిన ప్రీమియంపై ఆ సంవ‌త్స‌రం డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌డం వీల‌వుతుంది. అంటే ఏ సంవత్స‌రం ఆరోగ్య బీమా ప్ర‌యోజ‌నాలు ఎంత ఉంటాయో ఆ ప్ర‌పోష‌న్ ప్ర‌కార‌మే ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

క‌వ‌రేజ్‌..
వార్షిక ఆరోగ్య బీమా పాల‌సీలు మాదిరిగానే దీర్ఘ‌కాలిక ఆరోగ్య బీమా పాల‌సీలు హామీనిస్తాయి. క‌వ‌రేజ్‌లో పెద్ద‌గా వ్య‌త్యాసం ఉండ‌దు. కాల‌వ్య‌వ‌ధి, ప్రీమియంలోనే వ్య‌త్యాసం ఉంటుంది. 

చివ‌రిగా..
దీర్ఘ‌కాలిక పాల‌సీ, వార్షిక పాల‌సీ రెండింటింలో ఏదైనా ఎంచుకోండి. అయితే ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునే ముందు పాల‌సీ నియ‌మ నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను పూర్తిగా తెలుసుకోండి. ఏది క‌వ‌ర్ అవుతుంది.. ఏది కాదు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీ కుటుంబ ఆరోగ్య అవ‌స‌రాల‌కు అనుగుణంగా పాల‌సీని ఎంచుకోవాలి. నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితా త‌యారు చేసుకోవాలి. మీ ఇంటి నుంచి నిర్థిష్ట దూరంలో నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రి ఉందా.. చూసుకోవాలి. పాల‌సీ తీసుకునే ముందు వెయిటింగ్ పిరియ‌డ్‌, బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు