దీర్ఘ‌కాలం పెట్టుబ‌డితో మంచి రాబ‌డి

ప్యాసివ్ ఫండ్ల నిర్వ‌హ‌ణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది.....​

Published : 19 Dec 2020 17:03 IST

ప్యాసివ్ ఫండ్ల నిర్వ‌హ‌ణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది.​​​​​​​

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ పెట్టుబ‌డులకు సంబంధించి ఏవిధ‌మైన క్రియాశీల‌క నిర్వ‌హ‌ణ అవ‌స‌రం లేని (ప్యాసివ్) విధానం, క్రియాశీల‌కంగా (యాక్టివ్) విధానం రెండు విధానాలు మ‌దుప‌ర్లకు అందుబాటులో ఉంటాయి. ప్యాసివ్ విధానంలో ఈటీఎఫ్ లు, ఇండెక్స్ ఫండ్లు మొద‌లైన‌వి వ‌స్తాయి. వీటిలో పెట్టుబ‌డి చేసేందుకు మ‌దుప‌రి ఏదైనా సూచీని అనుస‌రించి పెట్టుబ‌డి చేసే అవ‌కాశం ఉంటుంది. ఇండెక్స్ (సూచీని) అనుక‌రించి చేసే ప్యాసివ్ ఫండ్ పెట్టుబ‌డులు ఈ విధానంలో మ‌దుప‌ర్లు చేస్తుంటారు. నిఫ్టీ ఈటీఎఫ్, బ్యాంకింగ్ ఈటీఎఫ్ వంటి ఈటీఎఫ్ లు ఆయా సూచీల ఆధారంగా పెట్టుబ‌డి చేస్తుంటాయి. త‌ద్వారా మ‌దుప‌ర్లు ఇంచుమించుగా సూచిలో వ‌చ్చేంత రాబ‌డి పొంద‌వ‌చ్చు. అయితే సూచీ కంటే కొంత త‌క్కువ రాబ‌డి ఈ ప్యాసివ్ ఫండ్ లో వ‌స్తుంది. దీనికి కార‌ణం ఫండ్లు వ‌సూలు చేసే నిర్వ‌హ‌ణ రుసుము. కాబ‌ట్టి సూచీ కంటే ఫండ్ కొంత త‌క్కువ రాబ‌డిని అందిస్తుంది. ప్యాసివ్ ఫండ్ల కేట‌గిరీలో వివిధ ర‌కాల ఇండెక్స్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి.

యాక్టివ్ విధానంలో ఫండ్ మేనేజ‌ర్లు త‌మ విశ్లేష‌ణ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏయే షేర్లు కొనుగోలు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకుంటారు. కాబ‌ట్టి వీటిని క్రియాశీల‌క పెట్టుబ‌డులుగా పిలుస్తారు. వీటిలో నిర్వ‌హ‌ణ రుసుము ప్యాసివ్ ఫండ్ల కంటే ఎక్కువ‌గా ఉంటుంది. ఏ విధ‌మైన పెట్టుబ‌డుల‌ను ఎంచుకున్నా మ‌దుప‌ర్లు లావాదేవీలు త‌ర‌చూ చేయ‌కుండా పెట్టుబ‌డి చేసి దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగించ‌డం క్రమ ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డి చూస్తూ ఉండ‌టం వ‌ల్ల‌ మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. దీర్ఘ‌కాలం పెట్టుబ‌డిని కొన‌సాగించ‌డం వ‌ల్ల హెచ్చుత‌గ్గులు స‌ర్దుబాటై పెట్టుబ‌డుల‌కు స్థిర‌త్వం వ‌స్తుంది. త‌ర‌చూ లావాదేవీలు చేయ‌డం వ‌ల్ల ట్రాన్సాక్ష‌న్ ఛార్జీలు, నిర్ణీత కాల‌ప‌రిమితి కంటే ముందు యూనిట్ల‌ను ఉప‌సంహ‌రించ‌డం ద్వారా ఏవైనా లోడ్ ఛార్జీలు వ‌ర్తించ‌వ‌చ్చు.

యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్ల ప్ర‌ధాన ఉద్దేశం ఇండెక్స్ ను మించి రాబ‌డి సాధించ‌డ‌మే. ఈ ఫండ్ల‌లో ఎక్కువ శాతం రాబ‌డి పొందాల‌ని ఉద్దేశ్యంతో నిర్వాహ‌కులు మార్కెట్ కు అనుగుణంగా లావాదేవీలు చేస్తుంటారు. అయితే కొన్ని యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్లు ఇండెక్స్ ను మించి రాబ‌డి సాధించ‌లేక‌పోవ‌డం మ‌నం చూస్తున్నాం.

ప్యాసివ్ విధానంలో మార్కెట్ సూచీలు నిఫ్టీ , సెన్సెక్స్ లేదా ఇత‌ర సూచీల ఆధారంగా పెట్టుబ‌డులు చేస్తుంటారు. ఈ ఫండ్ల ఉద్దేశం మార్కెట్ సూచీ కంటే ఎక్కువ రాబ‌డి ని పొంద‌డం కాదు ఆ సూచీకి ద‌గ్గ‌ర‌గా రాబ‌డి పొందడమే ల‌క్ష్యం. క్రియాశీల‌క ఫండ్ల కంటే ప్యాసివ్ ఫండ్లు మంచి రాబ‌డిని అందించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

ప్యాసివ్ ఫండ్ల నిర్వ‌హ‌ణ రుసుం యాక్టివ్ ఫండ్ల కంటే త‌క్కువ‌గా ఉంటుంది. పెట్టుబ‌డి విధానంలో ఏవిధ‌మైన షేర్లను ఎంపిక చేసుకోకుండా ఏదైనా ఒక ఇండెక్స్ అనుక‌రించి పెట్టుబ‌డులు చేయ‌డంతో నిర్వ‌హ‌ణ రుసుం బాగా త‌గ్గుతుంది. ఇవి మార్కెట్ సూచీ లేదా ఏదైనా రంగానికి చెందిన సూచీని అనుక‌రిస్తుంటాయి. యాక్టివ్ ఫండ్లలా వీటిలో పోల్చిచూసుకోవ‌డానికి ఏమీ ఉండ‌దు. ఏ సూచీలో పెట్టుబ‌డి చేద్దామ‌నేది నిర్ణ‌యించుకుంటే స‌రిపోతుంది.

సాధార‌ణంగా ఈ రెండు ఈక్విటీ ప‌థ‌కాలే కాబ‌ట్టి న‌ష్ట‌భ‌యం రెండింటిలోనూ ఓ మోస్త‌రు న‌ష్ట‌భ‌యం ఉంటుంది. సెక్టార్ ఆధారిత‌మైన‌వి అయితే ఆ రంగానికి సంబంధించిన సెక్టార్ సంబంధిత రిస్క్ కూడా ఉంటుంది.యాక్టివ్, ప్యాసివ్ ఏదైనా దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగించే పెట్టుబ‌డుల‌పై మంచి రాబ‌డి వ‌స్తుంది. కాబ‌ట్టి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు అనుకూలంగా ఉంటాయి.

మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం, ల‌క్ష్యం ఆధారంగా పెట్టుబ‌డులు ఎంచుకోవాలి. స్వ‌ల్ప‌కాలంలో ఎక్కువశాతం రాబ‌డి సాధించాలంటే అధిక న‌ష్ట‌భ‌యం ఉన్న ఫండ్ల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా న‌ష్ట‌భ‌యం తక్కువ‌గా ఉండే యాక్టివ్ లేదా ప్యాసివ్ ఫండ్ల‌ను ఎంచుకుని దీర్ఘ‌కాలంలో స్థిరంగా పెట్టుబ‌డిని కొన‌సాగించ‌డం ద్వారా మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని