క్రెడిట్ కార్డు పోయిందా?..కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ ఉందా?

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన న‌గ‌దు ర‌హిత లావాదేలీలు చేసే వారి సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉప‌యోగించ‌ని వారు దాదాపు లేర‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదేమో. నోట్ల ర‌ద్దు త‌రువాత ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డంతో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు అనూహ్య రీతిలో స్పంద‌న ల‌భిస్తుంది. దీంతో పాటే..

Updated : 01 Jan 2021 19:34 IST

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన న‌గ‌దు ర‌హిత లావాదేలీలు చేసే వారి సంఖ్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉప‌యోగించ‌ని వారు దాదాపు లేర‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదేమో. నోట్ల ర‌ద్దు త‌రువాత ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డంతో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు అనూహ్య రీతిలో స్పంద‌న ల‌భిస్తుంది. దీంతో పాటే బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగిపోయాయి. స‌బైర్ నేర‌స్థ‌లు, మోస‌గాళ్ళ నుంచి మీ కార్డును ర‌క్షించుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఇందులో భాగంగానే వివిధ‌ బ్యాంకులు, బీమా కంపెనీలు కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్‌(సీపీపీ)ని సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌కు మాత్ర‌మే కాకుండా పాన్ (శాశ్వ‌త ఖాతా సంఖ్య‌) కార్డు వంటి ముఖ్య‌మైన ప‌త్రాల‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది. వినియోగ‌దారులు వారి కార్డుల‌కు బీమా పొందేందుకు కొంత నిర్థిష్ట మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు వివిధ ర‌కాలైన కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ల‌ను అందిస్తున్నాయి. స‌ర్వీసు, కాల‌ప‌రిమితి ఆధారంగా వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా ప‌నిచేస్తాయి?
వివిధ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప‌లు ర‌కాల కార్డు ప్రాటెక్ష‌న్ ప్లాన్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. స‌ర్వీసు పొందేందుకు వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్న స‌ర్వీసు, కాల‌ప‌రిమితికి అనుగుణంగా రూ.900- రూ.2100 మ‌ధ్య‌లో కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ వార్షిక ప్రీమియం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి అన్ని ప్ర‌ధాన‌ బ్యాంకులు కార్డు ప్రొటెక్ష‌న్ ప్రణాళికలను అందిస్తున్నాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉప‌యోగించిన‌ప్పుడు జ‌రిగే నష్టం/ దొంగతనం, స్కిమ్మింగ్, నకిలీ, ఫిషింగ్, ఆన్‌లైన్ వాడకం, పిన్ ఆధారిత మోసాలకు ఈ పథకం వర్తిస్తుంది.

ప్ర‌యోజ‌నాలు:
కార్డు సంబంధించి ఏదైనా న‌ష్టం/ దొంగ‌త‌నం జ‌రిగితే, దానిని గురించి నివేదించేందుకు 24 * 7 టోల్ ఫ్రీ నెంబ‌రు అందుబాటులో ఉంటుంది. వినియోగ‌దారుల కార్డుల పోయినా లేదా దొంగిలించ‌బ‌డినా టోల్ ఫ్రీ నెంబ‌రుకు కాల్ చేసి కార్డును క్రియార‌హితం(బ్లాక్‌) చేయ‌మ‌ని కోర‌వ‌చ్చు. కార్డులు జారీ చేయు సంస్థ‌లైన వీసా, రూపే, మాస్ట‌ర్ కార్డ్ మొద‌లైన సంస్థ‌ల‌కు స‌మాచారాన్ని చేర‌వేస్తాయి. ఎక్కువ కార్డుల‌ను ఉప‌యోగించేవారికి ఇది చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. అత్య‌వ‌స‌రంగా అన్ని కార్డులు బ్లాక్ చేయాల్సి వ‌స్తే, ఒక్కొక్క బ్యాంకుకు విడివిడిగా ఫోన్ చేసి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మీ బ‌దులుగా మీ బ్యాంక్ లేదా బీమా సంస్థ ఈ ప‌ని చేస్తాయి. అంతేకాకుండా ఎటువంటి అద‌న‌పు రుస‌ములు చెల్లించ‌కుండా కొత్త కార్డును పొందొచ్చు.

అత్య‌వ‌స‌ర ప్ర‌యాణ ఖ‌ర్చు:
మీ ప్ర‌యాణ స‌మ‌యంలో మీ కార్డు దొంగిలించబడినా లేదా పోయినా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ మీ అత్యవసర ప్ర‌యాణ ఖ‌ర్చును చూసుకుంటుంది. ఈ ప్లాన్‌ కింద, బ్యాంక్ లేదా బీమా సంస్థ మీ కోసం ప్రయాణ టికెట్ బుక్ చేస్తుంది. హోట‌ల్ బిల్లు వంటి వ‌స‌తి ఖ‌ర్చుల‌ను కూడా చెల్లిస్తారు. కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ.6.16 ల‌క్ష‌ల వ‌ర‌కు హోట‌ల్ బిల్లును చ‌ల్లిస్తుంది. ప్ర‌యాణం ఖ‌ర్చు కింద రూ.1.6 ల‌క్ష‌లు ఇస్తుంది.

అత్య‌వ‌స‌ర ప్ర‌యాణ ఖ‌ర్చు, వ‌స‌తితో పాటు అత్య‌వ‌స‌ర న‌గ‌దు ప్ర‌యోజ‌నాన్ని కూడా కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ అందిస్తుంది. అయితే మీరు ఎంచుకున్న ప‌థ‌కం ఆధారంగా అత్య‌వ‌స‌ర న‌గ‌దు మొత్తం ఉంటుంది.

కుటుంబ స‌భ్య‌ల‌కు వ‌ర్తిస్తుంది:
మీరు మాత్ర‌మే కాకుండా మీ కుటుంబ స‌భ్యుల‌ను కార్డు ప్రొట‌క్ష‌న్ ప్లాన్‌లో చేర్చ‌వచ్చు. ఇందుకోసం ఎటువంటి అద‌న‌పు ఛార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియం కార్డ్‌ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌లో మీ జీవిత భాగ‌స్వామిని కూడా న‌మోదు చేసుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐ ప్లాటినం కార్డ్ ప్రొట‌క్ష‌న్ ప్లాన‌లో మీ కుటుంబంలోని న‌లుగురు స‌భ్యులు(త‌ల్లిదండ్రలు, జీవిత భాగ‌స్వామి) న‌మోదు చేసుకోవ‌చ్చు. వారికి కూడా కార్డు ప్రొట‌క్ష‌న్ ప్లాన్‌కి సంబంధించి అన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందుతాయి.

పాన్ కార్డ్‌:
ఈ ప్లాన్ డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో పాటు దొంగిలించ‌బ‌డిన లేదా పోయిన పాన్ కార్డు వంటి ముఖ్య‌మైన ప్ర‌తాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఎటువంటి అద‌న‌పు రుస‌ములు లేకుండా మీ బ్యాంక్ కొత్త పాన్ కార్డును ఇస్తుంది. మీరు మీ పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, షేర్ స‌ర్టిఫికేట్లు, బీమా పాల‌సీల వివ‌రాల‌ను కూడా ఇందులో న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఫోన్‌పోతే సిమ్ బ్లాక్‌ చేసుకోవ‌చ్చు:
ఒక‌వేళ మీరు మొబైల్ ఫోన్ పోతే మీ బ్యాంక్ లేదా బీమా సంస్థ సిమ్ కార్డును బ్లాక్ చేయ‌డం మాత్ర‌మే కాకుండా కొత్త సిమ్ కార్డును ఏర్పాటు చేస్తుంది. చాలా వ‌ర‌కు ప్రొట‌క్ష‌న్ ప్లాన్ కార్డులు ఒక సంవ‌త్స‌ర కాల‌ప‌రిమితిని క‌లిగి ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని