ట‌ర్మ్ బీమాలో .. హామీ మొత్తం భార్య, పిల్ల‌లకు చేరాలంటే..

జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు ఆర్థిక భ‌విష్య‌త్తుకు అద‌న‌పు భ‌ద్ర‌త కల్పించేందుకు ట‌ర్మ్‌పాల‌సీని ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated : 03 Jun 2021 13:09 IST

ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు అస‌లు ఉద్దేశ్యం.. సంపాదించే వ్య‌క్తి అనుకోని విధంగా మ‌ర‌ణిస్తే.. అత‌ని భార్య‌, పిల్ల‌లు భ‌విష్య‌త్తును ఆర్థికంగా భ‌ద్ర‌ప‌ర‌చ‌డం. మ‌ర‌ణానంత‌రం క్లెయిమ్ మొత్తం ఎటువంటి ఇబ్బందులు, స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా కుటుంబ స‌భ్యుల‌కు చేరాల‌ని కోరుకుంటారు పాల‌సీదారులు.  అయితే, పాల‌సీదారుడు మ‌ర‌ణించే స‌మ‌యానికి ఏదైనా సంస్థ నుంచి గానీ, బంధువులు, స్నేహితుల నుంచి గానీ అప్పు తీసుకుని ఉంటే, పాల‌సీ మొత్తం నామినీ(జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు) కంటే ముందు రుణ‌దాత‌లు క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల, ట‌ర్మ్ బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారానే పాల‌సీదారుని మ‌ర‌ణానంత‌రం హామీ మొత్తం నామినీ పొందగ‌ల‌ర‌ని చెప్ప‌లేము. 

పాల‌సీఎక్స్‌.కామ్ వ్య‌వ‌స్థాప‌కుడు, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ నావ‌ల్ గోయ‌ల్ మాట్లాడుతూ.. ఎమ్‌డ‌బ్ల్యూపీ(వివాహిత మ‌హిళ‌ల ఆస్తి) చ‌ట్టం కింద కొనుగోలు చేయ‌ని సాధార‌ణ ట‌ర్మ్ బీమా పాల‌సీకి సంబంధించి పాల‌సీదారుని మ‌ర‌ణాంత‌రం హామీ మొత్తాన్ని దురాక్ర‌మ‌ణ‌దారులు, రుణ‌దాత‌లు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. అందువ‌ల్ల‌, పాల‌సీ హామీ మొత్తం భార్య, పిల్ల‌ల‌కు అందాలంటే, వివాహిత మ‌హిళ‌ల ఆస్తి చ‌ట్టం, 1874 ప్ర‌కారం ట‌ర్మ్ బీమా పాల‌సీని కొనుగోలు చేయాలి. 

ఎమ్‌డ‌బ్ల్యూపి(MWP) చట్టం..
కెన‌రా హెచ్ఎస్‌బీసీ ఓబీసి లైఫ్ ఇన్సురెన్స్ చీఫ్ డిజిటెల్ అండ్ స్ట్రాట‌జీ ఆఫీస‌ర్ రిషి మాథూర్ మాట్లాడుతూ.. ఎమ్‌డ‌బ్ల్యూపి చ‌ట్టం కింద పాల‌సీ కొనుగోలు చేస్తే, పాల‌సీదారుడు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో హామీ మొత్తాన్ని అందించేందుకు మొద‌టి ప్రాధాన్య‌త అత‌ని భార్య, పిల్ల‌ల‌కు ఇస్తారు.

ఈ చ‌ట్టం రివ‌ర్స్‌లో ప‌నిచేయ‌దు. అంటే ఒక భార్య త‌న భ‌ర్త‌ను మొద‌టి ల‌బ్ధిదారునిగా చేయ‌డం కుద‌ర‌దు. అయితే ఒక వివాహిత మ‌హిళ త‌న పిల్ల‌ల కోసం ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద పాల‌సీ కొనుగోలు చేసి ల‌బ్ధి పొంద‌వ‌చ్చు. 

సింపుల్గా చెప్పాలంటే  వివాహిత మ‌హిళ‌ల ఆస్తి చ‌ట్టం కింద పాల‌సీ కొనుగోలు చేస్తే, పాల‌సీ ప్ర‌యోజ‌నాలు నేరుగా భార్య‌/  పిల్ల‌ల‌కు చేరుతాయి. ఈ మొత్తంతో రుణాలు చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మ‌రో మాట‌లో చెప్పాలంటే రుణదాత‌లు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయ‌లేరు. ఎమ్‌డ‌బ్ల్యూపీ చట్టంలోని సెక్షన్ 6 ఈ అంశాన్ని తెలియ‌జేస్తుంది.

మీరు పురుషుడైవుండి.. కుటుంబానికి పోషణాధారం అయితే ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారా అద‌న‌పు భ‌ద్ర‌త పొంద‌వ‌చ్చ‌ని మాథూర్ అన్నారు. 

ఎమ్‌డ‌బ్ల్యూపీ చట్టం కింద జారీ చేయబడిన బీమా పాలసీ సాధారణంగా ఉద్యోగులు(జీతం ద్వారా ఆదాయం పొందుతున్న‌ వ్యక్తులు), వ్యాపారంలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తులు కొన్నిసార్లు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వ్యక్తిగత రుణం, గృహ రుణం, వ్యాపార రుణం, వినియోగదారుల‌ రుణం వంటి ప‌లు ర‌కాల రుణాలపై ఆధారపడతారు.

ఉదాహరణకు, అశోక్‌కి పెళ్లైంది. ఇద్దరు పిల్ల‌లు ఉన్నారు. అత‌నికి వ్యాపారం చేయాలనేది ఒక క‌ల‌. వ్యాపారంలో భాగంగా ప్లాంట్‌, మిష‌న‌రీ కోసం బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇలాంటి సంధ‌ర్భంలో అత‌డు ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద ఒక ట‌ర్మ్ పాల‌సీ కూడా తీసుకోవాలి. అనుకోకుండా అత‌ను మ‌ర‌ణిస్తే, వ్యాపారం కోసం రుణం ఇచ్చిన బ్యాంకు ట‌ర్మ్ పాల‌సీ హామీ మొత్తాన్ని క్లెయిమ్ చేయ‌డం సాధ్యం కాదు. ఈ మొత్తం అత‌ని భార్య‌, పిల్ల‌ల భ‌విష్య‌త్త‌కు స‌హాయ‌ప‌డుతుంది. భార‌త్‌లో నివ‌సించే వివాహితులు ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద పాల‌సీ తీసుకోవ‌చ్చు. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలోనే ఎమ్‌డ‌బ్ల్యూపీ కింద పాల‌సీ తీసుకోవాలి. ప్ర‌స్తుతం ఉన్న ట‌ర్మ్ పాల‌సీని ఎమ్‌డ‌బ్ల్యూపీ కింద‌కి తీసుకురావ‌డం కుద‌ర‌దు. 

ఎలా కొనుగోలు చేయాలి..
ఈ చట్టం క్రింద బీమా పాల‌సీని సుల‌భంగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. " పాలసీ తీసుకునే సమయంలో బీమా దరఖాస్తుతో పాటు ఎమ్‌డ‌బ్ల్యూపీఏ అనుబంధాన్ని పూర్తి చేసి, సంతకం చేయాలి. కొన్ని బీమా సంస్థ‌లు ద‌ర‌ఖాస్తు ఫారంలోనే ఆప్ష‌న్‌ను అందిస్తున్నాయి. పాల‌సీదారులు ఎమ్‌డ‌బ్ల్యూపి చ‌ట్టం కింద ‘అవును’ అనే అప్ష‌న్ ఎంచుకోవాలి." అని ఇన్సూర్‌టెక్ ఫ్లాట్‌ఫామ్.. ప్రోబ‌స్ ఇన్సురెన్స్ డైరెక్ట‌ర్ రాకేష్ గోయ‌ల్ తెలిపారు. 

ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద ట‌ర్మ్ పాల‌సీని తీసుకుంటే.. పాల‌సీ తీసుకునే స‌మ‌యంలో ఒక‌సారి నామినీని ఎంచుకున్న త‌రువాత మ‌ర‌ల భ‌విష్య‌త్తులో మార్చేందుకు వీలులేదు. అంతేకాకుండా త‌ల్లిదండ్రులను నామినీలుగా చేర్చ‌లేరు. భార్య లేదా పిల్ల‌ల‌ను మాత్ర‌మే నామిని ల‌బ్ధిదారులుగా చేర్చాల్సి ఉంటుంది.  భార్య‌ను గానీ, పిల్ల‌ల‌ను గానీ, ఇద్ద‌రిని గానీ నామినీలుగా చేర్చ‌వ‌చ్చు. భార్య‌తోపాటు పిల్ల‌ల‌ను కూడా నామినీలుగా చేర్చితే హామీ మొత్తంలో ఎవ‌రికి ఎంత వాటా ఇవ్వాలో పాల‌సీదారుడు ముందుగానే నిర్ణ‌యించ‌వ‌చ్చు. 

చివ‌రిగా..
ట‌ర్మ‌పాల‌సీని ఎమ్‌డ‌బ్ల్యూపీ చ‌ట్టం కింద కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ, ట‌ర్మ్ పాల‌సీ ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు,  ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులు సాధార‌ణ ట‌ర్మ్ పాల‌సీ మాదిరిగానే ఉంటాయి. ఎలాంటి మార్పులుండ‌వు. 

పాల‌సీదారుని మ‌ర‌ణానంత‌రం హామీ మొత్తం రుణ సంస్థ‌లు, బంధువులు, స్నేహితుల వ‌ద్ద తీసుకున్న రుణాల‌కు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు పోకుండా, జీవిత భాగ‌స్వామి, పిల్ల‌ల ఆర్థిక భ‌విష్య‌త్తు ర‌క్ష‌ణ‌కు హామీ ఇస్తుంది. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు