600 వాహనాలు వెనక్కి రప్పించనున్న మహీంద్రా..!

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎమ్‌ అండ్‌ ఎమ్‌) తమ సంస్థ ఇటీవల తయారు చేసి విక్రయించిన సుమారు 600 వాహనాలను వెనక్కు రప్పించనుంది.

Updated : 06 Dec 2021 17:28 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎమ్‌ అండ్‌ ఎమ్‌)  ఇటీవల తయారు చేసి విక్రయించిన సుమారు 600 వాహనాలను వెనక్కు రప్పించనుంది. నాసిక్‌ ప్లాంట్‌లో తయారైన పలు వాహనాల్లోని డీజిల్‌ ఇంజిన్లను తనిఖీ చేసి అవసరం మేరకు తిరిగి కొత్తవి అమర్చనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 21 నుంచి ఈ నెల 2 వరకు తయారు చేసిన పలు వాహనాల్లో కలుషిత ఇంధనం నింపినట్లు అనుమానం తలెత్తినట్లు పేర్కొంది. తమ సంస్థపై వినియోగదారుల విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్‌ అండ్‌ ఎమ్‌ వివరించింది. అందులో భాగంగానే వాహనాలను వెనక్కు రప్పిస్తున్నట్లు పేర్కొంది.

అయితే వెనక్కు రప్పించిన వాహనాలకు సంబంధించి వాటి యజమానులకు వ్యక్తిగతంగా సమాచారం అందించనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ పేర్కొంది. ఆ వాహనాల్లో చేసే మార్పులకుగాను వినియోగదారులు ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని  స్పష్టం చేసింది. అయితే వాటిలో ఏయే మోడళ్ల వాహనాలు ఉన్నాయనే అంశాన్ని సంస్థ వెల్లడించలేదు. దేశీయంగా ఈ సంస్థ  థార్‌, స్కార్పియో, ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 500 లాంటి ప్రఖ్యాత మోడళ్లను ఎక్కువగా విక్రయిస్తోంది.  


    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని