Automobile: వచ్చే ఏడాది వాహన కొనుగోలుకు అత్యధికుల ఆసక్తి

వచ్చే 12 నెలల్లో భారీ ఎత్తున వినియోగదారులు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని మొబైల్‌ అవుట్‌లుక్ సర్వే తెలిపింది...

Published : 19 Dec 2021 16:41 IST

మొబైల్‌ అవుట్‌లుక్‌ సర్వేలో వెల్లడి

దిల్లీ: ఈ ఏడాది సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో నిరాశలో కూరుకుపోయిన ఆటోమొబైల్‌ రంగానికి ఓ ప్రముఖ సర్వే శుభవార్త తెలియజేసింది. వచ్చే 12 నెలల్లో భారీ ఎత్తున వినియోగదారులు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని మొబైల్‌ అవుట్‌లుక్ సర్వే తెలిపింది. 

కార్‌ట్రేడ్‌ టెక్‌ సంస్థకు అనుబంధంగా పనిచేసే మొబిలిటీ అవుట్‌లుక్‌ మొత్తం 2.7 లక్షల మందిని సర్వే చేసింది. వీరిలో 83 శాతం మంది వచ్చే ఏడాదిలో వాహనం కొంటామని ధీమాగా తెలిపారు. 12 శాతం మంది కొనే అవకాశం ఉందని.. కేవలం 4 శాతం మంది మాత్రమే అస్సలు కొనబోమని స్పష్టం చేశారు. ఇది ప్రజల వినిమయ శక్తి తిరిగి గాడిన పడుతోందనడానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది కొత్త కారు, 33 శాతం మంది కొత్త స్కూటర్‌ లేదా బైక్ కొంటామని తెలిపారు. 13 శాతం మంది మాత్రం పాత కారును, 3 శాతం మంది పాత స్కూటర్‌ లేదా బైక్‌ను కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే 49 శాతం మంది కొవిడ్‌ మునుపటి స్థాయిలోనే వాహన కొనుగోలు వెచ్చిస్తామని తెలిపారు. 14 శాతం మాత్రం బడ్జెట్‌ను పెంచుతామని పేర్కొన్నారు. ఇక 74 శాతం మంది నేరుగా డీలర్‌షిప్‌ల నుంచి శాశ్వత ప్రాతిపదికన కొంటామని తెలిపారు. 17 శాతం మంది 1-4 ఏళ్ల లీజ్‌కు, 5 శాతం మంది ఏడాది కంటే తక్కువ వ్యవధికి లీజ్‌కు తీసుకుంటామని తెలిపారు. మూడు శాతం మంది మాత్రం వెహికల్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసుని వినియోగించుకుంటామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని