బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు...

భారతీయులు పెట్టుబడులు పెట్టిన మొదటి ఐదు పెట్టుబడి సాధనాల్లో బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు ఉన్నాయి.....

Published : 22 Dec 2020 17:19 IST

భారతీయులు పెట్టుబడులు పెట్టిన మొదటి ఐదు పెట్టుబడి సాధనాల్లో బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు ఉన్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) గురువారం విడుదల చేసిన “ఇండియా రిటైల్ ఇన్వెస్టర్ ఇన్‌సైట్స్” నివేదిక ప్రకారం, భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరైతే బంగారంపై పెట్టుబడి పెట్టలేదో వారిలో 29 శాతం మంది రిటైల్ పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారంఫై పెట్టుబడి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12,000 మంది రిటైల్ పెట్టుబడిదారుల సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు, ఇందులో 2,285 మంది భారతీయులు ఉన్నారు. సర్వే ప్రకారం, భారతీయులు పెట్టుబడులు పెట్టిన మొదటి ఐదు పెట్టుబడి సాధనాల్లో బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు ఉన్నాయి.

రిటైల్ పెట్టుబడిదారులు బంగారం గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వారు ఎలా పెట్టుబడులు పెడతారు, బంగారం వారి పెట్టుబడి లక్ష్యాలను చేరుకుంటుందా అని పరిశ్రమకు అర్థమయ్యేలా చేయడం ఈ సర్వే వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

పెట్టుబడిగా బంగారం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య నమ్మకం లేకపోవడం. గతంలో ఎన్నడూ బంగారం కొనుగోలు చేయని 61 శాతం మంది, భవిష్యత్తులో కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తున్నారు, ఉత్పత్తి లేదా పరిశ్రమపై నమ్మకం లేకపోవడం కొనుగోలుకు అవరోధంగా మారిందని నివేదిక తెలిపింది. పెట్టుబడిదారులలో అవగాహన లేకపోవడం మరో కారణం. ఉదాహరణకు, బంగారం ధర ఎలా మారుతుందో వారికి అర్థం కాకపోవడం లేదా కొనుగోలు చేసే విధానం చాలా కష్టమని భావించడం.

ఈ సర్వే పట్టణ, గ్రామీణ పెట్టుబడిదారులపై జరిగింది. భారతదేశంలో సర్వే చేసిన మొత్తం 2,285 మంది పెట్టుబడిదారులలో 1,005 మంది గ్రామీణ పెట్టుబడిదారులను నేరుగా కలిసి ఇంటర్వ్యూల ద్వారా ప్రశ్నించగా, 1280 పట్టణ పెట్టుబడిదారులను ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు.

సర్వే చేసిన అందరిలో, 52 శాతం మంది ఇప్పటికే ఏదో ఒక రూపంలో బంగారాన్ని కలిగి ఉన్నారు, అయితే 48 శాతం మంది మాత్రం సర్వే చేయడానికి ముందు 12 నెలల్లో పెట్టుబడి పెట్టారు. సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేవారు, ఇతరుల సలహాలతో పెట్టుబడులు పెట్టేవారు, పెట్టుబడిపై అవగాహన ఉన్నవారు, రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టే వారిని ఈ సర్వే లో భాగస్వాములను చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు