Maruti Suzuki: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, సీఎన్‌జీ కార్ల ధరల పెంపు

దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీఎన్‌జీ కార్ల ధరను భారీగా పెంచింది. దీంతోపాటు స్విఫ్ట్‌ కారు ధరలో మార్పులు చేసింది.  ఈ పెంపు అత్యధికంగా రూ.15,000 వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Published : 12 Jul 2021 15:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీఎన్‌జీ కార్ల ధరను భారీగా పెంచింది. దీంతోపాటు స్విఫ్ట్‌ కారు ధరలో మార్పులు చేసింది. ఈ పెంపు అత్యధికంగా రూ.15,000 వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ధరల పెంపు విషయాన్ని ప్రస్తావించింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరగటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. పెట్రోల్‌ కార్ల ధరలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

‘‘మారుతీ సుజుకీ లిమిటెడ్‌ స్విఫ్ట్‌ కారు ధరను పెంచింది. దీంతోపాటు అన్ని మోడళ్ల సీఎన్‌జీ కార్ల రేట్లు కూడా మారాయి. కొత్త లెక్క ప్రకారం దిల్లీలో ఎక్స్‌షోరూమ్‌ ధరలో రూ.15,000 పెంపు ఉంటుంది. ఇది నేటి నుంచే అమల్లోకి వస్తుంది. ఇతరకార్ల ధరల్లో మార్పుల విషయాన్ని పరిశీలిస్తున్నాం. త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ఫైలింగ్‌లో పేర్కొంది.

ప్రస్తుతం కంపెనీ ఆల్టో, ఎస్‌ప్రెస్సో, సెలిరియో, వేగనార్‌, ఎకో, ఎర్టిగా మోడళ్లు మాత్రమే సీఎన్‌జీ విభాగంలో విక్రయిస్తోంది. స్విఫ్ట్‌, డిజైర్‌, బ్రెజా మోడళ్లు కేవలం పెట్రోల్‌ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తాయి. 2022 రెండో త్రైమాసికం నాటికి ధరల పెంపు ఉంటుందని మారుతీ జూన్‌ 21వ తేదీనే వెల్లడించింది. ఈ ఏడాది నుంచి మారుతీ ధరలను పెంచడం ఇది మూడోసారి. జనవరిలో కొన్ని మోడళ్లపై రూ.34వేల వరకు పెంచింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరోసారి పెంచింది. ఇప్పుడు మూడోసారి ధరల పెంపును ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని