auto news: కీలక మైలురాళ్లు దాటిన స్విఫ్ట్‌, సోనెట్‌..!

మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, కియా సోనెట్‌ కార్లు నేడు కీలక మైలురాళ్లను దాటాయి. 2005లో మార్కెట్‌లోకి విడుదలై అద్భుత విజయాన్ని చవిచూసిన స్విఫ్ట్‌ మోడల్‌ ఇప్పటి వరకు

Published : 14 Sep 2021 19:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, కియా సోనెట్‌ కార్లు నేడు కీలక మైలురాళ్లను దాటాయి. 2005లో మార్కెట్‌లోకి విడుదలై అద్భుత విజయాన్ని చవిచూసిన స్విఫ్ట్‌ మోడల్‌ కార్లు ఇప్పటి వరకు 25 లక్షలు అమ్ముడు పోయాయి. ఈ ఏడాది జనవరిలో స్విఫ్ట్‌ విక్రయాలు 23 లక్షలను చేరినట్లు కంపెనీ ప్రకటించింది. అక్కడి నుంచి ఎనిమిది నెలల్లోనే మరో 2లక్షల కార్లను విక్రయించడం విశేషం. మొత్తం 16ఏళ్ల కాలంలో స్విఫ్ట్‌ ఈ ఘనత సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్విఫ్ట్‌ విక్రయాలు నంబర్‌ 1 స్థానంలో నిలిచి అద్భుతమైన చరిత్రను సృష్టించాయని మారుతీ విక్రయాల విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. భారత్‌లో స్విఫ్ట్‌తోనే ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ సెగ్మెంట్‌ మొదలైందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. భారత్‌లో అత్యధిక అవార్డులు అందుకొన్న హ్యాచ్‌ బ్యాక్‌ ఇదేనని తెలిపారు.

లక్ష సోనెట్‌లను విక్రయించిన కియా..

కియా మోటార్స్‌కు చెందిన సోనెట్‌ కారు  విక్రయాలు కూడా లక్ష మార్కును దాటాయి. ఈ కారును సెప్టెంబర్‌ 2020లో విడుదల చేశారు. ధర, ఫీచర్లు వినియోగదారులను బాగా ఆకర్షించాయి. భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే నాలుగో ఎస్‌యూవీ సోనెట్‌ కావడం విశేషం. భారత్‌లో కియా విక్రయాల్లో 32శాతం ఈ ఒక్క కారువే కావడం గమనార్హం. ఈ సెగ్మెంట్‌ కార్లలో 17శాతం విక్రయాలు సోనెట్‌వే. ఈ సందర్భంగా కంపెనీ విక్రయ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తాయ్‌ జిన్‌ పార్క్‌ మాట్లాడుతూ..‘‘కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ చరిత్రలో అతిపెద్ద కష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో వీటన్నింటిని లెక్కచేయకుండా సోనెట్‌ను విడుదల చేశాం.  ఇది భారత్‌లో కియా చరిత్రను తిరగరాస్తూ విజయవంతమైంది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని