Choksi: ఊచలు లెక్కిస్తున్న వజ్రాల వ్యాపారి

పరారీలో ఉన్న ప్రముఖ వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కటకటాల వెనుక బందించిన ఓ చిత్రాన్ని స్థానిక మీడియా శనివారం బహిర్గతం చేయడంతో.....

Updated : 30 May 2021 12:51 IST

డొమినికా: పరారీలో ఉన్న ప్రముఖ వ‌జ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కటకటాల వెనుక నిర్బంధించిన ఓ చిత్రాన్ని స్థానిక మీడియా శనివారం బహిర్గతం చేయడంతో ఆయనను అరెస్టు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, జైలులో ఆయన చిత్రహింసలకు గురిచేసినట్లు చోక్సీ తరఫు న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ ఆరోపించారు. అందుకు సంబంధించి చోక్సీ శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 

భారత్‌ నుంచి పారిపోయిన చోక్సీ ఇన్నాళ్లు అంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఈ నెల 25న అక్కడి నుంచి కూడా పారిపోయి దొంగ మార్గంలో డొమినికాకు చేరుకున్నాడు. దీంతో ఇంట‌ర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. డొమినికాలో చోక్సీని గుర్తించిన పోలీసులు ఆయనను అక్కడే అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చోక్సీకి కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. తనని అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ చోక్సీ డొమినికా కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రానుంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆయన అరెస్టు చట్టబద్ధమైందో.. కాదో.. తెలియనుంది.

మరోవైపు చోక్సీని భార‌త్‌కు అప్పగించేందుకు ఇటు భారత్‌తో పాటు, డొమినికాతోనూ చర్చలు జరుపుతున్నట్లు అంటిగ్వా ప్రధాని ఇటీవల తెలిపారు. డొమినికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన చోక్సీని నిర్భందించాల‌ని.. అత‌డిని అటు నుంచి అటే భార‌త్‌కు పంపాల‌ని ఆయన డొమినికా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే చోక్సీ నేరాలకు సంబంధించిన పత్రాలతో భారత్‌ నుంచి ఓ ప్రత్యేక విమానం అంటిగ్వాకు చేరింది. వీటిని పరిశీలించిన ఆ దేశ ప్రధాని.. చోక్సీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడే అని ధ్రువీకరించుకొన్నారు.

2017లో మెహుల్‌ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో పరారీలో ఉన్న మరో ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీతోపాటు మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్‌ మోదీకి మెహుల్‌ చోక్సీ మేనమామ అవుతాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని