ఆరోగ్య బీమా క్లెయింలకు ప్రత్యేక సేవా కేంద్రం

ఆరోగ్య బీమా పాలసీల సమాచారం, క్లెయింల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వినియోగదారుల సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌బీఐ

Published : 20 Apr 2021 01:18 IST

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య బీమా పాలసీల సమాచారం, క్లెయింల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వినియోగదారుల సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా, పాలసీదారులకు సహాయం చేసేందుకు ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ హెల్త్‌లైన్‌ ద్వారా పాలసీలు, క్లెయింలకు సంబంధించిన ఏ సమస్యనైనా ఫిర్యాదు చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ పేర్కొంది.

ఏసీసీ లాభంలో 74% వృద్ధి

దిల్లీ: మార్చి 2021తో ముగిసిన త్రైమాసికంలో సిమెంటు తయారీ కంపెనీ ఏసీసీ ఏకీకృత నికర లాభం రూ.562.59 కోట్లకు చేరింది. 2020 ఇదే త్రైమాసికంలో నమోదైన లాభం రూ.323.02 కోట్లతో పోలిస్తే ఇది 74.17% అధికం కావడం విశేషం. మొత్తం ఆదాయం సైతం రూ.3501.71 కోట్ల నుంచి 22.57 శాతం వృద్ధితో రూ.4291.97 కోట్లకు చేరుకుంది. కంపెనీ మొత్తం వ్యయాలు కూడా రూ.3,083.78 కోట్ల నుంచి రూ.3,586.19 కోట్లకు పెరిగాయి. జనవరి-డిసెంబరును కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ‘తొలి త్రైమాసికంలో అత్యధిక ఆదాయం, నిర్వహణ ఎబిటా నమోదు చేశాం. మా వ్యయ నియంత్రణ ప్రాజెక్టు ‘పర్వత్‌’ సరిగ్గా పనిచేస్తోంద’ని కంపెనీ ఎండీ, సీఈఓ శ్రీధర్‌ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.  సిమెంటు విభాగంలో ఆదాయం 26.25% హెచ్చి రూ.3,980.84 కోట్లకు చేరుకుంది. ‘ప్రభుత్వం మౌలిక రంగంపై వ్యయాలు పెంచనున్నందున వచ్చే కొద్ది నెలల్లో జాగ్రత్తతో కూడిన సానుకూల భవిష్యత్‌ను అంచనా వేస్తున్న’ట్లు కంపెనీ తెలిపింది. ‘మా ఉద్యోగుల్లో 70% వరకు అర్హత గల వారికి టీకా వేయించాం. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామ’ని వివరించింది.
బీఎస్‌ఈలో సోమవారం ఏసీసీ షేరు ధర 0.26% నష్టంతో రూ.1876.85 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని