
IPO: మెట్రో బ్రాండ్స్, ఇన్‌స్పిరా ఐపీఓ.. ఎప్పుడంటే?
దిల్లీ: ప్రముఖ ఫుట్‌వేర్ రిటైలర్ ‘మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్’ ఐపీఓ డిసెంబరు 10న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 14న ముగియనుంది. రూ.295 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 2.14 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్లు 10 శాతం వాటాను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కంపెనీలో వీరి వాటా 75 శాతానికి రానుంది. ఈ సంస్థలో ప్రముఖ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు కూడా వాటాలున్నాయి.
ఈ పబ్లిక్ ఇష్యూలో సమీకరించే నిధులతో మెట్రో, మోచి, వాక్‌వే, క్రోక్స్ బ్రాండ్ల పేరిట కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాలకు కూడా కొన్ని నిధులను వినియోగించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 134 నగరాల్లో 586 స్టోర్లు ఉన్నాయి. గత మూడేళ్లలోనే 211 స్టోర్లను తెరిచారు. మిడ్, ప్రీమియం సెగ్మెంట్లే లక్ష్యంగా ఈ సంస్థ వ్యాపారాన్ని విస్తరిస్తోంది.
ఈ నెలలోనే ఇన్‌స్పిరా కూడా...
ప్రముఖ సైబర్‌సెక్యూరిటీ సంస్థ ఇన్‌స్పిరా ఎంటర్‌ప్రైజెస్ ఇండియా కూడా ఈ నెలలో ఐపీఓకి రావాలని యోచిస్తోంది. రూ.800 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ నిధులతో వ్యాపారాన్ని ముఖ్యంగా అమెరికాలో విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం సింగపూర్, ఫిలిప్పైన్స్, యూఏఈ, ఇండోనేసియా, అమెరికా, కెన్యాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రూ.300 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.500 కోట్లు విలువ చేసే ఆఫర్ ఫర్ సేల్ షేర్లు విక్రయించనున్నారు. క్రిస్‌మస్‌కి ముందే ఐపీఓకి రావాలని యోచిస్తున్నట్లు సంస్థ ఎండీ చేతన్ జైన్ తెలిపారు. ఒకవేళ సాధ్యం కాకపోతే.. వచ్చే నెల కచ్చితంగా పబ్లిక్ ఇష్యూ ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.