Microsoft: తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌?

అమెరికా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో భారీ డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో జరుపుతున్న...

Published : 21 Jul 2021 16:46 IST

రూ.15 వేల కోట్ల పెట్టుబడులు!

హైదరాబాద్‌: అమెరికా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో భారీ డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ ప్రముఖ వాణిజ్య పత్రిక ‘బిజినెస్ స్టాండర్డ్‌’ ఓ కథనం ప్రచురించింది.

త్వరలో దీనిపై మైక్రోసాఫ్ట్‌ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ డేటా సెంటర్‌ కోసం ఇప్పటికే హైదరాబాద్‌ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ కలిసి ఓ స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దీనిపై మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచాయి. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ గత కొన్నేళ్లుగా ముందు వరుసలో ఉంటున్న విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా పారిశ్రామిక అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు సింగిల్‌ విండో, ఈపాస్‌ వంటి ప్రత్యేక విధానాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

మరోవైపు భారత్‌లో డేటా సెంటర్ల నిర్మాణం కోసం కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాతో మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకునే దిశగా సాగుతోంది. బీఏఎం డిజిటల్‌ రియాలిటీ పేరిట డేటా సెంటర్లను నిర్మించాలని యోచిస్తున్నారు. అలాగే భారత్‌లో క్లౌడ్‌ డేటా సెంటర్ల ఏర్పాటు విషయమై 2019లో రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్‌ మధ్యం దీర్ఘకాలిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జియో నెట్‌వర్క్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ తమ క్లౌడ్‌ టెక్నాలజీ అయిన అజూర్‌ క్లౌడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో చిరు వ్యాపారులకు సైతం క్లౌడ్‌ సాంకేతికతను చేరువ చేయాలని యోచిస్తున్నారు.

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, గూగుల్‌ సైతం భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. 2024 కల్లా భారత్‌లో డేటా సెంటర్ల ఆదాయం నాలుగు బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నట్లు ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయన్స్‌ నివేదిక ఇటీవల అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని