GST Council: జీఎస్టీపై రెండు కమిటీల ఏర్పాటు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు కమిటీలను సోమవారం ఏర్పాటు చేసింది.

Published : 27 Sep 2021 18:10 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు కమిటీలను సోమవారం ఏర్పాటు చేసింది. జీఎస్టీ నుంచి మినహాయించాల్సిన వస్తువులు, ప్రస్తుత శ్లాబ్‌ రేట్లు, జీఎస్టీ ఎగవేతదారుల మూలాలు, ఐటీ సిస్టమ్స్‌లో మార్పులు తదితర అంశాలపై ఈ కమిటీలు సమీక్షించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 17న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో రెండు మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మేరకు ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి.

జీఎస్టీ పన్ను నుంచి మినహాయించాల్సిన వస్తువులు, శ్లాబుల విలీనం తదితర అంశాలపై ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం నియమించింది. ఈ ప్యానెల్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వం వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌, బిహార్‌ డిప్యూటీ సీఎం తార్కిషోర్‌ ప్రసాద్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

జీఎస్టీ సిస్టమ్‌లో తీసుకురావాల్సిన సంస్కరణలు, పన్ను ఎగవేత మూలాలు, ఆదాయానికి గండి కొడుతున్న అంశాలపై దృష్టి సారించేందుకు ఎనిమిది మందితో మరో కమిటీని కేంద్ర ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నేతృత్వం వహించనున్నారు. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్‌, ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి టీఎస్‌ సింగ్‌ డియో సభ్యులుగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని