పదేళ్లు దాటిన‌ మైనర్లకూ నెలవారీ ఆదాయ పథకం!

దీనిలో మీరు ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిర వడ్డీని సంపాదించవచ్చు

Updated : 05 Jul 2021 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టి నెల నెలా స్థిరమైన వడ్డీని పొందేందుకు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌.. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (పీవోఎంఐఎస్‌)ను అందిస్తోంది. ఇదో పొదుపు పథకం. ఏ పోస్టాఫీసులోనైనా తెరవొచ్చు. పెద్దలే కాదు.. 10 ఏళ్లు పైబడిన మైనర్లూ ఈ ఖాతాను తెరిచి స్థిరమైన వడ్డీని పొందొచ్చు. ఇంతకీ ఈ పథకంలో ఎంత పెట్టాలి? వడ్డీ ఎలా చెల్లిస్తారు? వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌ ఖాతా తెరవొచ్చు. ముగ్గురు వ్య‌క్తులు క‌లిసి కూడా ఉమ్మ‌డి ఖాతాను తెరవొచ్చు. పదేళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ పేర్లపైనా ఈ ఖాతా తెరుచుకునే వీలుంది. ఈ ఖాతా తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1,000. ఒక‌రి పేరుతో ఖాతా ప్రారంభించిన‌ప్పుడు గ‌రిష్ఠంగా రూ.4.5 ల‌క్ష‌లు డిపాజిట్ చేయొచ్చు. ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్ఠంగా ₹9 లక్షలు పెట్టొచ్చు. దీనిలో పెట్టుబడిదారులందరికీ సమాన వాటా ఉంటుంది.

ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత వడ్డీ చెల్లింపు ప్రారంభ‌మ‌వుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిమ్ చేసుకోక‌పోతే అలాంటి వడ్డీపై అదనపు వడ్డీ ల‌భించదు. నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ డిపాజిట్లు చేస్తే తిరిగి రీఫండ్ అవుతుంది. ఒక‌వేళ అద‌న‌పు డిపాజిట్ చేస్తే దానిపై పోస్టాఫీసు పొదుపు ఖాతాకు ఇచ్చే వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది. అది కూడా అద‌న‌పు డిపాజిట్‌ను తిరిగి రీఫండ్ చేసేంతవ‌ర‌కే ల‌భిస్తుంది. ఆటో క్రెడిట్ ఆప్ష‌న్ ఎంచుకుంటే ప్ర‌తి నెలా వడ్డీని నేరుగా మీ పొదుపు ఖాతాలోకి పొందొచ్చు. అయితే ఈ వ‌డ్డీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంద‌న్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వడ్డీ మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి వ‌ర్తించ‌దు.
మెచ్యూరిటీ: మీరు ఖాతా తెరిచిన పోస్టాఫీసు వద్ద పాస్‌బుక్‌తో సూచించిన దరఖాస్తు ఫారాన్ని సమర్పించడం ద్వారా ఐదేళ్ల తర్వాత ఖాతాను మూసివేయొచ్చు. ఒక‌వేళ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే ఆ ఖాతాను నిలిపివేసి ఆ మొత్తం డిపాజిట్‌ను నామినీకి అందిస్తారు. అందుకే ఖాతా ప్రారంభించేట‌ప్పుడు నామినీని ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. 
డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు గడువుకు ముందే డిపాజిట్ ఉపసంహరించుకునేందుకు వీలుండ‌దు. సంవత్సరం తర్వాత, మూడేళ్లకు ముందు ఖాతాను ముంద‌స్తుగా మూసివేస్తే మొత్తం డిపాజిట్ నుంచి 2 శాతం త‌గ్గించి చెల్లిస్తారు. అదేవిధంగా మూడేళ్ల నుంచి ఐదేళ్ల మ‌ధ్య ఖాతాను నిలిపివేస్తే 1 శాతం మిన‌హాయించి మిగ‌తా మొత్తం ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని