రైతన్నల ఆదాయం పెంపే మా లక్ష్యం: మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ .. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Updated : 01 Feb 2021 15:50 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ .. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. రైతులు, గ్రామాల అభివృద్ధిపైనే ఈ బడ్జెట్ ప్రముఖంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ట్విటర్ వేదికగా మోదీ వీడియో సందేశమిచ్చారు. 

‘ఆర్థికమంత్రి ఈసారి బడ్జెట్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో సమర్పించారు. ఇది దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆత్మనిర్భర్‌ సాధనపైనే ప్రధానంగా దృష్టిసారించింది. వృద్ధి, యువతకు కొత్త అవకాశాలు, మౌలికరంగం,  జీవన సౌలభ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం సామాన్య ప్రజానీకంపై భారం వేస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ మేం భారత్‌కు అనుకూలమైన బడ్జెట్‌తో ముందుకొచ్చాం. అన్ని విధాలుగా అభివృద్ధికి ఊతం ఇస్తూ..ఆరోగ్యం, సంపద వృద్ధికి దోహదం చేసేలా దీన్ని తీసుకువచ్చాం. దీనిలో మౌలిక వసతులకు పెద్దపీట వేశాం. ఈ బడ్జెట్‌ రైతుల ఆదాయం పెంపునకు దోహదం చేస్తుంది. గ్రామాలు, రైతులపైనే ఈ బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి పెట్టామని తాజా నిర్ణయాలు వెల్లడిచేస్తున్నాయి’ అని ప్రధాని మోదీ అన్నారు.

కేంద్రం కొద్ది నెలల క్రితం తీసుకువచ్చిన సాగు చట్టాలతో కేంద్రం, రైతు సంఘాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రవర్తిస్తుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. ప్రధాని బడ్జెట్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇవీ చదవండి:

పెన్ను, పేపర్ లేకుండా జనాభా లెక్కింపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని