మీ పిల్లలకు నేర్పుతున్నారా ఈ పాఠాలు..?

డబ్బు నిర్వహణ ఒక కళ. జీవితంలో సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే కష్టాలు తప్పవు. మరి అలాంటి సబ్జెక్టును మన పిల్లలకు చిన్నప్పుడే పరిచయం చేయాలి. ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్పించాలి.....

Updated : 12 Feb 2021 20:12 IST

 

డబ్బు నిర్వహణ ఒక కళ. జీవితంలో సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే కష్టాలు తప్పవు. మరి అలాంటి సబ్జెక్టును మన పిల్లలకు చిన్నప్పుడే పరిచయం చేయాలి. ఆర్థిక పాఠాల్ని ఇంట్లోనే నేర్పించాలి. ఈ విషయాలపై పిల్లలకు ఎంత తొందరగా అవగాహన కల్పిస్తే అంత మంచిది. ఈ క్రమంలో వారిలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలను జొప్పించకుండా జాగ్రత్త పడాలి. మరి చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన కనీస అంశాలేంటో చూద్దాం..!


డబ్బుపై అవగాహన

మన జీవితంలో డబ్బు పాత్ర ఎంటో వారికి వివరించాలి. ఎలా సంపాదిస్తారు? అందుకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? వంటి అంశాల్ని వారికి తెలియజేయాలి. ఈ దశలోనే అవసరాలు, సౌకర్యాలకు మధ్య తేడా ఏంటో ఉదాహరణతో చెప్పాలి.


పొదుపు సూత్రాలు

‘రూపాయిని ఆదా చేస్తే.. రూపాయి సంపాదించినట్లే..’ ఈ సూత్రం పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి. అప్పుడే వారికి ప్రతి రూపాయి విలువ అర్థమవుతుంది. పొదుపు చేస్తే వచ్చే లాభాలను ప్రత్యక్షంగా చూపించండి. వారితో పొదుపు చేయించి వారికి కావాల్సిన వస్తువుల్ని వాటితోనే కొనివ్వండి. అప్పుడు వారికి ఇంకా సులభంగా అర్థమవుతుంది.


చిన్న మొత్తాల పెట్టుబడులు

పై రెండు సూత్రాలు వారికి ఒంటబట్టాయనుకుంటే.. ఓ దశ వచ్చిన తర్వాత మెల్లిగా పెట్టుబడుల గురించి వివరించాలి. దాని వల్ల ఉన్న మార్గాలను ఉదాహరణతో వివరించాలి. ఇంట్లో మీరు చేసిన పెట్టుబడిని.. దాని వల్ల కలిగిన లాభాల్ని వారికి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేయండి. పోస్టాఫీసులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వంటి చిన్న చిన్న పెట్టుబడి మార్గాల్ని అలవర్చండి.


ఆర్థిక ప్రణాళిక

ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేయాలన్న సూత్రాన్ని వివరించాలి. అందుకోసం ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలియజేయాలి. ఇంట్లో ఆదాయం.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం.. వంటి విషయాల్ని చూపించాలి. వారికి కూడా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగానే ఖర్చు చేయమని చెప్పాలి.


రుణ పాఠాలు

అత్యవసర సమయంలో మన ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకునే రుణాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎలాంటి సమయంలో అప్పు తీసుకోవాలి? లేదా ఇతరులకు ఇవ్వాలి అనే విషయాలను స్పష్టంగా వివరించాలి. సకాలంలో చెల్లించకపోతే ఉండే రిస్క్‌ను తెలియజేయాలి. అలాగే మార్కెట్లో ఉన్న వివిధ రకాల రుణ సదుపాయాలు.. వాటి లబ్ధిని వివరించాలి.


పన్నులు

మనం పనిచేసి సంపాదిస్తున్నాం. మరి ప్రభుత్వానికి ఎలా ఆదాయం సమకూరుతుందన్న అనుమానం పిల్లలకు కలగొచ్చు. సర్కార్‌కు ఆదాయం ఎలా వస్తుందో వివరించాలి. అందులో ఒక మార్గమే పన్నులు, సుంకాలని తెలియజేయాలి. వాటిని ఎలా వసూలు చేస్తారో వివరించాలి. మనం ఆదాయ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఎలా తోడ్పాటునందిస్తున్నామో వివరించాలి. మీ పిల్లలు కాస్త పెద్ద వారైతే జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించాలి.


సాంకేతిక సాధనాలు

డబ్బు నిర్వహణ, ఆదాయ-వ్యయాల నమోదు, ఆర్థిక ప్రణాళిక కోసం అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయాలి. అవి ఎలా వినియోగించాలో వివరించాలి. ఈఎంఐ‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం వంటి వాటిని గణించేందుకు ఉన్న కాలిక్యులేటర్లను పరిచయం చేయాలి. వివిధ బ్యాంకుల వెబసైట్‌లను చూపించి వాటి నుంచి సామాన్యులకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించే విధానం అలవర్చాలి. బ్యాంకుకు వెళ్లకుండానే.. మన పనులను పూర్తిచేసుకునేందుకు ఉన్న మార్గాల్ని వివరించాలి. ఇంట్లోనే ఉండి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ చేయడం, నామినీని మార్చుకోవడం వంటి చిన్న చిన్న విషయాలను చేయించాలి. వివిధ పేమెంట్‌ యాప్స్‌ పనితీరును వివరించాలి. ఈ-పేమెంట్స్‌ వల్ల కలిగే లాభాలను తెలియజేయాలి. 

పిల్లలు పుట్టగానే వారి చదువు, పెళ్లి, వ్యాపారం-ఉద్యోగం ఇలా అనేక అవసరాల కోసం తల్లిదండ్రులు ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. కానీ, అనుకోకుండా వచ్చిపడే ఖర్చులు వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి అప్పుడప్పుడు అడ్డుపడుతుంటాయి. తిరిగి దాన్ని గాడినపెట్టేందుకు ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ పిల్లలకు చిన్నతనంలోనే డబ్బు విలువ తెలియజేస్తే.. వారు ముందుగానే జాగ్రత్తపడతారు. పొదుపు, పెట్టుబడిని అలవర్చుకొని సంపాదనను సంపదగా మార్చుకుంటారు.

ఇవీ చదవండి...

బ్యాంకు...మీ ఇంటి వద్దకే...

బ్యాంక్ పేరుతో వ‌చ్చే ఫేక్ మెసేజ్‌ల‌ను గుర్తించ‌డం ఎలా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని