Electric Cars: ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ విద్యుత్తు కార్లివే..

ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లపై ఓ లుక్కేద్దాం....

Published : 24 Dec 2021 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తంతా విద్యుత్తు వాహనాల(ఈవీ)దే. పెట్రోలు ధర లీటరు రూ.వంద దాటింది. అది ఇంకా పెరగడమే కానీ తగ్గే దారి కనబడడం లేదు. దీంతో ఈవీలకు హఠాత్తుగా క్రేజ్‌ పెరిగింది. పర్యావరణ మార్పుల దృష్ట్యా ప్రభుత్వమూ వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక రాయితీలూ ఇస్తోంది. దీంతో గూగుల్‌లో విద్యుత్తు కార్ల గురించి శోధించడం పెరిగింది. ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లపై ఓ లుక్కేద్దాం..!


టాటా నెక్సాన్‌ ఈవీ

భారత్‌లో భారీ ఆదరణ ఉన్న విద్యుత్తు కార్లలో టాటా నెక్సాన్‌ది తొలిస్థానం. ఈ ఏడాది ఈ కారు గురించి గూగుల్‌లో నెలకు సగటున దాదాపు 1.35 లక్షల శోధనలు నమోదయ్యాయి. టాటా నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధర రూ. 13.99లక్షలు(ఎక్స్‌ షోరూం). పర్సనల్‌ సెగ్మెంట్‌ కింద తీసుకొచ్చిన ఈ నెక్సాన్‌ ఈవీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. హై వోల్టేజ్‌ సిస్టమ్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యం, బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునే సదుపాయం, అధునాతన భద్రతా ప్రమాణాలు దీని అదనపు ఫీచర్లు.


టాటా టిగోర్‌ 

టాటా మోటార్స్‌ నుంచి వచ్చిన రెండో విద్యుత్‌ వాహనం టిగోర్‌ ఈవీ. దీని ధరల శ్రేణి రూ.11.99-13.14 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ మోడల్‌ 3 వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరలు వరుసగా రూ.11.99 లక్షలు, రూ.12.49 లక్షలు, రూ.12.99 లక్షలు. డ్యూయల్‌ టోన్‌ టాప్‌-ఎండ్‌ మోడల్‌ ధర రూ.13.14 లక్షలుగా ఉంది. ఈ మోడల్‌కు అంతర్జాతీయ ఎన్‌క్యాప్‌ నుంచి 4-స్టార్‌ భద్రతా రేటింగ్‌ లభించడంతో సహా 306 కి.మీ రేంజ్‌తో ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ కూడా లభించింది. కంపెనీ హై వోల్టేజ్‌ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌ జిప్ట్రాన్‌ సాంకేతికతో ఈ మోడల్‌ రూపొందింది. 55 కిలోవాట్ల గరిష్ఠ సామర్థ్యం, 170 ఎన్‌ఎం టార్క్‌, 26 కిలోవాట్‌అవర్‌ లిక్విడ్‌-కూల్డ్‌, అధిక శక్తిమంత ఐపీ 67 రేటెడ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఈ మోడల్‌ సొంతం. 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ. వరకు బ్యాటరీ, మోటార్‌కు వారెంటీతో లభిస్తుంది. ఇక ఈ కారుకు గూగుల్‌లో నెలకు సగటున లభించిన శోధనలు 74 వేలు.


ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ

ఎంజీ మోటార్స్‌ నుంచి వచ్చిన తొలి విద్యుత్తు ఎస్‌యూవీ జెడ్‌ఎస్‌ ఈవీ గురించి గూగుల్‌లో నెలకు సగటున 60,500 శోధనలు రికార్డయ్యాయి. రెండు వేరియంట్లలో ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఎక్సైట్‌ వేరియంట్‌ కారు ధర రూ.20.88లక్షలు కాగా..ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ.23.58లక్షలుగా నిర్ణయించారు. ఈ కారులో 44.5 కిలోవాట్స్‌ శక్తి ఉన్న బ్యాటరీని అందించారు. దీన్ని ఒకసారి ఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది. 40 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. కేవలం ఎనిమిది క్షణాల్లో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఆఫీస్‌, ఇంట్లో ఛార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం ఛార్జర్‌ను ఎంజీ అందజేస్తోంది.


ఆడి ఈ-ట్రాన్‌

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఈ-ట్రాన్‌ పేరిట మూడు విద్యుత్తు ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఇందులో ఈ-ట్రాన్‌ 50 ధర ₹99.99 లక్షలు. ఈ-ట్రాన్‌ 55, ఈ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ 55 ధర ₹1.16 కోట్లు, ₹ 1.18 కోట్లు(ఎక్స్‌షోరూమ్‌ ధరలు). ఈ-ట్రాన్‌ 55, ఈ-ట్రాన్‌ స్పోర్ట్‌బ్యాక్‌ 55 కార్లలో డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటర్లు వినియోగించారు. ఇవి 300 కేడబ్ల్యూ పవర్‌ను, 664 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. 95కేడబ్ల్యూహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ కలిగిన ఈ ఎస్‌యూవీలు ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 359-484 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ-ట్రాన్‌ 50లో డ్యూయల్‌ మోటార్‌ ఉంది. 71 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌తో 264-379 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వీటిలో రెండువైపులా ఛార్జింగ్‌ పోర్ట్స్‌ ఉంటాయి. స్టాండర్డ్‌ వారెంటీ 2 ఏళ్లతో పాటు హై వోల్జేజ్‌ బ్యాటరీ వారెంటీ 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు (ఏది ముందైతే అది) అందిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కారుకు గూగుల్‌లో నెలకు సగటున లభించిన శోధనలు 27,100.


జాగ్వార్‌ ఐ-పేస్‌

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) భారత్‌లో ఐ-పేస్‌ పేరిట తొలి విద్యుత్తు కారును విడుదల చేసింది. దీని గురించి ఈ ఏడాదిలో నెలకు సగటున 24,000 శోధనలు అందాయి. దీంట్లో 90 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 294 కేవీ శక్తిని, 696 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 4.8 సెకన్లలోనే  100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఐ-పేస్‌ ఎలక్ట్రిక్‌ కారును ఇళ్లల్లోనూ ఛార్జ్‌ చేయొచ్చు. దీని కోసం స్టాండర్డ్‌ ఛార్జింగ్‌ కేబుల్‌ వాహనంతో పాటే వస్తుంది. లేదా కంపెనీ ఇచ్చే 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్‌ మౌంటెడ్‌ ఛార్జర్‌ని కూడా వాడుకోవచ్చు. ఇది కూడా కారుతో పాటే వస్తుంది. ఛార్జర్‌ని అమర్చడానికి టాటా పవర్‌ లిమిటెడ్‌ సిబ్బంది సహకరిస్తారు. ఈ కారు కొనుగోలు చేస్తే ఐదేళ్ల సర్వీస్‌ ప్యాకేజీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ ప్యాకేజీ, ఎనిమిదేళ్ల లేదా 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తారు. ఈ కారులో ‘సాఫ్ట్‌వేర్‌ ఓవర్‌ ది ఎయిర్‌(ఎస్‌ఓటీఏ)’ వ్యవస్థను పొందుపరిచారు. దీంతో బ్యాటరీ మేనేజ్‌మెంట్‌, ఛార్జింగ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థలను రిమోట్‌తో నియంత్రించవచ్చు. దీని ప్రారంభ ధర రూ.1.06 కోట్లు.


కోనా ఎలక్ట్రిక్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ దేశీయంగా తయారుచేసిన విద్యుత్తు కారు కోనా ఎలక్ట్రిక్‌. ఈ కారు టిబెట్‌లోని సావులా కొండల్లో 5,731 మీటర్ల ఎత్తుకు ప్రయాణించి గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించింది. స్టాండర్డ్‌ పోర్టబుల్ ఛార్జర్‌ ద్వారా ఇది దానికదే రీఛార్జి చేసుకుంటుంది. ఈ కారుకు 39.2 కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. అది ఒక సారి ఛార్జింగ్‌ చేస్తే 452 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.23.79 లక్షలు. ఈ కారుకు గూగుల్‌లో నెలకు సగటున లభించిన శోధనలు 22,200.

* అయితే, ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌(ఐసీఈ- పెట్రోల్‌, డీజిల్‌లో నడిచేవి) వాహనాలకు ఉన్న ఆదరణ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. గరిష్ఠంగా కియా సెల్టోస్‌కు నెలకు సగటున 8.23 లక్షల గూగుల్‌ శోధనలు రికార్డవడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని