Reliance-Aramco Deal: తుది దశకు రిలయన్స్‌-అరామ్‌కో డీల్‌?

రిలయన్స్‌కు చెందిన చమురు శుద్ధి, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాల్ని సౌదీ అరామ్‌కో సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు ఈ వ్యవహారంతో....

Published : 16 Aug 2021 20:24 IST

ముంబయి: రిలయన్స్‌కు చెందిన చమురు శుద్ధి, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాల్ని సౌదీ అరామ్‌కో సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఈ ఒప్పంద విలువ 20-25 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇది ‘ఆల్‌-స్టాక్‌ డీల్‌’ అయ్యే అవకాశం ఉందన్నారు. అంటే ప్రతిఫలంగా రిలయన్స్‌కు అరామ్‌కోలో వాటాలు లభిస్తాయి. దీనిపై త్వరలో రిలయన్స్‌ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

అరామ్‌కోతో తాజా ఒప్పందం వల్ల భారత్‌లోని రిలయన్స్‌ చమురు శుద్ధి కేంద్రాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముడి చమురు అందే అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన అరామ్‌కోలో రిలయన్స్ భాగస్వామిగా మారనుంది. ఈ ఒప్పందం ఖరారైతే.. 1.9 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన అరామ్‌కోలో రిలయన్స్‌కు ఒక శాతం వాటా లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.

ఈ వ్యవహారంపై స్పందించడానికి అరామ్‌కో ప్రతినిధులు నిరాకరించారు. మరోవైపు అరామ్‌కోతో ఒప్పందం ఖరారు చేసుకోనున్నట్లు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంభానీ జూన్‌లో జరిగిన వార్షిక సమావేశంలోనే వెల్లడించారు. అప్పుడే రిలయన్స్‌ బోర్డులోకి అరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌-రుమాయూన్‌ను సభ్యుడిగా చేర్చుకున్నారు. తాజా వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం ఓ దశలో 2.6 శాతం మేర లాభపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని