Deloitte: దూసుకెళ్తున్న రిలయన్స్‌ రిటైల్‌ 

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ అరుదైన ఘనతను సాధించింది. 2021లో ప్రపంచలోనే

Published : 09 May 2021 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ అరుదైన ఘనత సాధించింది. 2021లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న రిటైలర్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయం డెలాయిట్‌ నిర్వహించిన గ్లోబల్‌ రిటైల్‌ పవర్‌ హౌసెస్‌  సర్వేలో తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్స్‌లో 53వ స్థానంలో నిలిచింది. గతంలో 56వ స్థానంలో ఉండగా ఈ సారి మూడు స్థానాలను మెరుగుపర్చుకుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ దిగ్గజంగా అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అమెజాన్‌ రెండో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఈ సారి దీని స్థానం మెరుగుపడింది. ఆ తర్వాతి స్థానంలో కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్పొరేషన్‌ ఉండగా, నాలుగో స్థానంలో జర్మనీకి చెందిన స్క్వార్జ్‌ గ్రూప్‌ నిలిచింది. గతంతో పోలిస్తే ఈ సారి కాస్ట్‌కో స్థానం పడిపోయింది. తొలి పది స్థానాల్లో అమెరికాకు చెందిన ఏడు కంపెనీలు నిలిచాయి. ఇక యూకేకు చెందిన టెస్కో 10వ స్థానంతో సరిపెట్టుకొంది. ఈ జాబితాలో క్రూగర్ కో (5),వాల్‌గ్రీన్స్‌ బూట్స్ అలయన్స్‌ (6), సీవీసీ హెల్త్‌ కార్పొరేషన్‌ (9) ఉన్నాయి.

250 కంపెనీలతో తయారు చేసిన ఈ జాబితాలో భారత్‌ నుంచి రిలయన్స్‌ రిటైల్‌ మాత్రమే స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో చోటు  సాధించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలో జాబితాలో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి. ‘‘గతేడాది రిలయన్స్‌ రిటైల్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న 50 రిటైల్‌ కంపెనీల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ సారి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాదితో పోలిస్తే 41.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా వివిధ రకాల స్టోర్ల సంఖ్య 13.1 శాతం పెరగడంతో ఈ అభివృద్ధి నమోదైంది. ప్రస్తుతం 7,000కు పైగా పట్టణాల్లో 11,784 స్టోర్‌లు ఉన్నాయి’’ అని డెలాయిట్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని