Reliance: గతేడాది అంబానీ వేతనం ఎంతో తెలుసా? 

అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరానికిగానూ జీతం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంబానీ

Published : 03 Jun 2021 17:30 IST

ముంబయి: అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరానికిగానూ జీతం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంబానీ వేతనం ‘సున్నా’  అని రిలయన్స్‌ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం మతన వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు అంబానీ గతేడాది జూన్‌లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 

అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ అంబానీ రూ. 15కోట్ల వేతనం అందుకున్నారు. 12ఏళ్లుగా ఆయన జీతంలో ఎలాంటి మార్పు లేదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమిషన్‌ అన్నీ కలిపి ఏడాదికి రూ. 15 కోట్లే తీసుకుంటున్నారు. ఏటా దాదాపు రూ. 24కోట్లను వదులుకుంటున్నారు. అయితే కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గతేడాదికిగానూ ఆయన ఎలాంటి జీతం తీసుకోలేదని రిలయన్స్‌ వెల్లడించింది. 

కాగా.. అంబానీ బంధువులు, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు నిఖిల్‌, హితాల్‌ మేస్వానీ వేతనాల్లో ఎలాంటి మార్పు లేదు. వీరు గతేడాదికి గానూ రూ. 24కోట్ల జీతం అందుకున్నారు. అయితే ఇందులో రూ. 17.28కోట్లు కమిషన్‌ కిందే పొందారు. మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పీఎంఎస్‌ ప్రసాద్‌, పవన్‌ కుమార్‌ కపిల్‌ రెండేళ్ల ఇన్సెంటివ్‌లు పొందడంతో వారి వేతనాలు కాస్త పెరిగాయి. 2020-21లో ప్రసాద్‌ రూ. 11.15కోట్లు వార్షిక వేతనం అందుకోగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది రూ. 11.99కోట్లకు పెరిగింది. కపిల్‌ జీతం రూ. 4.04కోట్ల నుంచి రూ. 4.24 కోట్లకు పెరిగింది. ఇక కంపెనీ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ గత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 8లక్షల సిట్టింగ్‌ ఫీజు, రూ. 1.65 కోట్ల కమిషన్‌ అందుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు