మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ - రెగ్యులర్‌ ప్లాన్స్‌

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనే చాలా మందికి తెలియ‌ని ఓ స‌రికొత్త విధానం. దీంతో వ‌చ్చే రాబ‌డిని మ‌రింత పెంచుకునే అవ‌కాశం.​​​​​​...​

Published : 21 Dec 2020 16:16 IST

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోనే చాలా మందికి తెలియ‌ని ఓ స‌రికొత్త విధానం. దీంతో వ‌చ్చే రాబ‌డిని మ‌రింత పెంచుకునే అవ‌కాశం.​​​​​​​

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు మనలో చాలా మందికి రెండు రకాల ‘ప్లాన్స్‌’ తారసపడి ఉంటాయి. దరఖాస్తు పత్రాన్ని నింపేటప్పుడు ఏజెంటు సూచించిన విధంగా రెగ్యులర్‌ ప్లాన్‌’ దగ్గర టిక్‌ పెట్టి మిగతా వివరాలు నింపే పనిలో పడతాం. రెగ్యులర్‌ ప్లాన్‌ పక్కనే ‘డైరెక్ట్‌ ప్లాన్‌’ అని ఒకటి ఉంటుంది. దాని గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే… ఆసక్తికర విషయాలు బయటపడతాయి.

రెగ్యుల‌ర్ ప్లాన్ :

డిస్ట్రిబ్యూట‌ర్ లేదా ఏజెంట్ల ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో పెట్టుబ‌డి విధానాన్ని రెగ్యుల‌ర్ ప్లాన్ గా ప‌రిగ‌ణిస్తారు.
మ‌దుప‌ర్లు ఈ విధానంలో మ‌దుపుచేసేందుకు మ్యూచువ‌ల్ ఫండ్ ఏజెంటును ఆశ్ర‌యిస్తుంటారు. వారి సూచ‌న‌ల మేర‌కు ఫండ్ ఎంపిక, ద‌ర‌ఖాస్తు చేయ‌డం మొద‌లైనవి పూర్తిచేస్తారు. ఏజెంట్లు లేదా స‌ల‌హాదారులు ద‌ర‌ఖాస్తు విధానం, ఫండ్ ఎంపిక‌, పెట్టుబ‌డుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మార్పులు చేర్పులలో స‌హ‌క‌రిస్తారు.

డెరెక్ట్ ప్లాన్‌:

పెట్టుబ‌డి సంబంధిత విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌లిగి స్వ‌యంగా నిర్వ‌హించుకోగ‌లిగిన నేర్పు సంపాదించిన వారి సౌల‌భ్యం కోసం డైరెక్ట్ ప్లాన్ ప‌థ‌కాల‌ను మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు అందిస్తుంటాయి.

మదుప‌ర్లు నేరుగా ఫండ్ నిర్వాహ‌ణ‌ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్టే విధానాన్ని డైరెక్ట్ ప్లాన్ అంటారు. ఈ విధానంలో మ‌ధ్య వ‌ర్తులు ఎవ‌రూ ఉండ‌రు.
అయితే మ‌దుప‌ర్ల‌కు ఫండ్ ఎంచుకోగ‌ల నైపుణ్యం, ద‌ర‌ఖాస్తు చేసేవిధానం, పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వ్యేక్షించుకోగ‌ల స‌మ‌యం ఉంటే నేరుగా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థని సంప్రదించి మ‌దుపు చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల మ‌దుప‌రికి ఏజెంట్ క‌మీష‌న్ చార్జీలు త‌గ్గుతాయి. మ‌దుప‌ర్లు త‌మకు అనుకూల‌మైన విధానంలో ఫండ్లలో పెట్టుబడులు చేయవ‌చ్చు.

వీటి మ‌ధ్య తేడా

ఏదైనా ఒక ఫండ్ ను తీసుకున్న‌ట్ల‌యితే అందులోని రెగ్యుల‌ర్ ప్లాన్ కంటే డైరెక్టు ప్లాన్ లో రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లో మదుప‌ర్లు నేరుగా ఫండ్ హౌస్ నుంచి యూనిట్లను కొనుగోలు చేస్తారు. డిస్ట్రిబ్యూట‌ర్ కి క‌మీష‌న్లు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మ‌దుప‌రి చేసిన పెట్టుబ‌డి మొత్తం ఫండ్ పెట్టుబ‌డుల్లోకి వెళుతుంది. అదే రెగ్యుల‌ర్ ప్లాన్లో మ‌దుప‌ర్లు యూనిట్ల‌ను డిస్ట్రిబ్యూట‌ర్ లేదా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తారు కాబ‌ట్టి డిస్ట్రిబ్యూట‌ర్ కి క‌మీష‌న్ రూపంలో కొంత వెన‌క్కి వెళుతుంది.

వ్యూహం ఒక్క‌టే

ఫండ్ పోర్టుఫోలియో (ఎంపిక‌చేసిన కంపెనీల షేర్లు,బాండ్లు త‌దిత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలు) లో డైరెక్ట్ ,రెగ్యుల‌ర్ ప్లాన్ల మ‌ధ్య‌ ఎటువంటి తేడా ఉండ‌దు.

ఇంకా రిస్క్ (న‌ష్ట‌భ‌యం) ఎక్జిట్ లోడ్ (నిష్క్ర‌మ‌ణ ఛార్జీలు) పెట్టుబ‌డి వ్యూహం మొద‌లైనవ‌న్నీ రెండు ప్లాన్ ల‌లో ఒకే విధంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్ కంటే రెగ్యుల‌ర్ ప్లాన్ లో ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలు (ఎక్ప్ పెన్స్ రేషియో) ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో ఒకే ఫండ్ రెగ్యుల‌ర్ ప్లాన్ కంటే డెరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ ఎక్కువ ఉంటుంది.

తేడా కొంచెమే అయినా

రెగ్యులర్‌కు డైరెక్ట్‌ ప్లాన్‌లకు రాబడి విషయంలో తేడా స్వల్పంగానే ఉంటుంది. అయితే పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో ఉండి… 10, 20 ఏళ్ల దీర్ఘకాలంపాటు కొనసాగించినట్టయితే ఈ తేడా భారీగానే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే డైరెక్ట్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడమే మంచిది. డైరెక్ట్‌ ప్లాన్‌లో ‘నిర్వహణ రుసుములు’ తక్కువగా ఉంటాయి. ఈ పథకాలను పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు ఉండరు కాబట్టి పంపిణీ రుసుములు, కమీషన్లు ఉండవు. ఈ ప్రభావంతో రెగ్యులర్‌ ప్లాన్స్‌తో పోలిస్తే డైరెక్ట్‌ ప్లాన్‌కు ఎన్‌ఏవీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో పెట్టుబడిదారు అదే ధరకు ఎక్కువ ‘యూనిట్లు’ కొనుగోలు చేయగలుగుతారు.

అందరికీ అనుకూలమా

ఈ రెండు ప్లాన్స్‌ మధ్య తేడా స్పష్టంగానే తెలిసి వచ్చినట్టు అనిపిస్తోంది. అలా అని లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించి ప్రతిదీ ‘డైరెక్ట్‌’ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం కూడా సమంజసం కాదు. మ్యూచువల్‌ ఫండ్లపై మంచి అవగాహన ఉండి, స్టాక్‌ మార్కెట్ల కదలికలను పరిశీలిస్తూ ఉన్నవారు ‘డైరెక్ట్‌’ ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఏజెంటు సహకారం లేకుండా తామే స్వయంగా నేరుగా ఫండ్‌ సంస్థకు వెళ్లో లేదా సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడి పెట్టగల నేర్పు ఉన్నవారు మాత్రమే డైరెక్ట్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సూచించదగ్గ విషయం. మ్యూచువల్‌ ఫండ్లపై అవగాహన లేనివారు, ఫండ్‌ను ఎంపిక చేసుకోలేనివారు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియనివారు, దాన్ని సమీక్షించే తీరిక, ఓపిక లేనివారికి డైరెక్ట్‌ ప్లాన్లు ఏమాత్రం అనుకూలం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ప్రత్యేక పెట్టుబడి విధానం ఉందా…

‘డైరెక్ట్‌’ ప్లాన్‌ అంటే ఇదేదో కొత్త పథకం. దీని పెట్టుబడి విధానం వేరేగా ఉంటుందని బెంబేలెత్తిపోనవసరం లేదు. సాధారణ రెగ్యులర్‌ ప్లాన్‌కు ఉపయోగించే దరఖాస్తు ఫారాన్నే తీసుకొని అందులో ‘డెరెక్ట్‌ ప్లాన్‌’ దగ్గర టిక్‌ చేయాలి. ఏజెంటు ద్వారా ఫారాన్ని నింపేటప్పుడు సాధారణంగా రెగ్యులర్‌ ప్లాన్‌ వద్ద టిక్‌ చేయించి ఆ తర్వాత ఏజెంటు తన యాంఫీ రిజిస్ట్రేషన్‌ ‘ఏఆర్‌ఎన్‌’ నెంబరు నింపుతారు. దరఖాస్తుదారు ఈ రెంటిపైనా టిక్‌ చేయకుండా, ఏజెంటు ఏఆర్‌ఏన్‌ సూచించకుండా ఉన్నట్టయితే… మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు సదరు పథకాన్ని ‘డైరెక్ట్‌’ కిందికే పరిగణిస్తాయి.

ఆలోచించి పెట్టుబడి పెట్టండి

మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని బ‌ట్టి మీకు ఎలాంటి ప్లాన్‌ అనుకూలమో విశ్లేషించుకొని అందుకు తగినట్టు పెట్టుబడిని ప్రారంభించండి.

చివరి మాట:

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని