ఆధార్‌ ఇ కేవైసీ లైసెన్సుకు ఎన్‌బీఎఫ్‌సీలు దరఖాస్తు చేయొచ్చు: ఆర్‌బీఐ

ఆధార్‌ ఇ-కేవైసీ ధ్రువీకరణ లైసెన్సు పొందేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), చెల్లింపుల వ్యవస్థ ఆపరేటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. బ్యాంకింగ్‌ సంస్థలు...

Updated : 17 Aug 2022 11:26 IST

ముంబయి: ఆధార్‌ ఇ-కేవైసీ ధ్రువీకరణ లైసెన్సు పొందేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), చెల్లింపుల వ్యవస్థ ఆపరేటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. బ్యాంకింగ్‌ సంస్థలు కాకుండా ఇతర కంపెనీలు ఆధార్‌ ధ్రువీకరణ సేవలు వినియోగించేందుకు దరఖాస్తు చేసుకునే పూర్తి ప్రక్రియను 2019 మేలో ఆర్థిక శాఖ  ప్రకటించింది. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను ఆర్‌బీఐ అందిస్తోంది.

ఆరు సంస్థల పరీక్ష దశ పూర్తి: నియంత్రణపరమైన శాండ్‌బాక్స్‌ పథకం కింద ‘ఫస్ట్‌ కోహోర్ట్‌’లో పరీక్ష దశను 6 సంస్థలు పూర్తి చేశాయని ఆర్‌బీఐ తెలిపింది. నియంత్రణపరమైన సంస్థలు రిటైల్‌ చెల్లింపులు, ఉత్పత్తులు వినియోగించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఆఫ్‌లైన్‌ డిజిటల్‌ చెల్లింపులు, ప్రీపెయిడ్‌ కార్డులు, కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు, వాయిస్‌ ఆధారిత యూపీఐ వంటి వాటికి సంబంధించి ఈ ఉత్పత్తులు ఉంటాయి. కొత్త ఉత్పత్తులు లేదా సేవలను నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో పరీక్షించడాన్ని రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌గా పరిగణిస్తారు. ఇందులో నియంత్రణ సంస్థలు కొన్ని సడలింపులు ఇస్తాయి. ఆర్‌బీఐ నిబంధనలు అందుకున్న వాటిలో న్యూక్లియస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (పేసే), ట్యాప్‌ స్మార్ట్‌ డేటా ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (సిటీ క్యాష్‌), నేచురల్‌ సపోర్ట్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఇండీక్యాష్‌), నఫ్ఫా ఇన్నోవేషన్స్‌ (టోన్‌ట్యాగ్‌), ఉబోనా టెక్నాలజీస్‌ (భీమ్‌ వాయిస్‌), ఈరూట్‌ టెక్నాలజీస్‌( సిమ్‌ వినియోగంతో ఆఫ్‌లైన్‌ చెల్లింపులు) ఉన్నాయి.


30 కాంప్యాక్ట్‌ వర్క్‌షాపుల ఏర్పాటులో స్కోడా

ముంబయి: ఐరోపాకు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కోడా ఆటో, భారత్‌లో ఈ ఏడాది 30 ‘కాంప్యాక్ట్‌ వర్క్‌షాపు’లను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. దేశీయంగా తన వినియోగదార్లకు నిర్వహణ, సేవల అవసరాలను ఇవి అందిస్తాయి. ఈ తరహా సర్వీస్‌-ఫస్ట్‌ నమూనాతో వస్తున్న వర్క్‌షాపులను కొన్ని కొత్త మార్కెట్లలోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 170 వినియోగదారు టచ్‌ పాయింట్లు, విక్రయ-విక్రయానంతర సేవల కేంద్రాలు ఉన్నాయి. ‘స్కోడా బ్రాండ్‌ వృద్ధికి 2021 ఏడాది కలిసొస్తోంది. ‘కుశాక్‌’ ఆవిష్కరణతో, సవాలు భరిత వాతావరణంలోనూ మా విక్రయాలు పెరిగాయ’ని కంపెనీ బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని