ఎన్‌పీఎస్ ద్వారా అద‌న‌పు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చ‌ని తెలుసా?

ఎన్‌పీఎస్‌లో యాజ‌మాన్యం చేసే కాంట్రీబ్యూష‌న్‌కి గానూ సెక్ష‌న్ 80సీసీడీ(2) ప్ర‌కారం అద‌నంగా ఆదా చేసుకోవ‌చ్చు.....

Published : 21 Dec 2020 16:14 IST

ఎన్‌పీఎస్‌లో యాజ‌మాన్యం చేసే కాంట్రీబ్యూష‌న్‌కి గానూ సెక్ష‌న్ 80సీసీడీ(2) ప్ర‌కారం అద‌నంగా ఆదా చేసుకోవ‌చ్చు​​​​​​​.

ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం కొన్ని ర‌కాల పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ముఖ్యంగా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్‌, పిల్ల‌ల స్కూలు ఫీజులు, ఈపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్ వంటి చాలా వ‌ర‌కు పెట్టుబ‌డులు సెక్ష‌న్ 80 సీ ప‌రిధిలోకి వ‌స్తున్నందున ఈ చ‌ట్ట మిన‌హాయింపు ప‌రిధి చాలా త‌క్కువ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. గృహ రుణం తీసుకున్న వారికి గృహ రుణ వడ్డీ చెల్లింపుల‌పై రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అదేవిధంగా నేష‌న‌ల్‌ పెన్ష‌న్ స్కీమ్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు కూడా మ‌రికొంత ప‌న్ను ఆదా చేసుకునే వీలుంది. అది ఏలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఎన్‌పీఎస్ టైర్ I ఖాతాలో చేసే పెట్టుబ‌డుల‌పై రూ. 50 వేల వ‌ర‌కు అద‌న‌పు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలుసు. ఎన్‌పీఎస్ టైర్ I ఖాతాలో పెట్టుబ‌డులు పెట్టే ఉద్యోగులు, స్వ‌యం ఉపాది పొందేవారు కూడా ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) ప్ర‌కారం మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

సంస్థ ద్వారా చేసే ఎన్‌పీఎస్‌కు కో-కాంట్రీబ్యూట్ పై కూడా సెక్ష‌న్ 80సీసీడీ(2) ప్ర‌కారం అద‌న‌పు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే ఇందుకు యాజ‌మాన్యం అంగీకారం కావాల్సి ఉంటుంది. ఉద్యోగి వేత‌నం(బేసిక్‌+డీఏ)లో 10 శాతం వ‌ర‌కు ఈ సెక్ష‌న్ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందేందుకు ఎన్‌పీఎస్ ఒక మంచి పెట్టుబ‌డి మార్గం, ఉద్యోగి చేసే కాంట్రీబ్యూష‌న్ ద్వారా పొందే అద‌న‌పు మిన‌హాయింపు రూ. 50 వేలు కాకుండా య‌జ‌మాని ద్వారా పెట్టుబ‌డి పెట్టి కూడా ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. య‌జ‌మాన్యం ద్వారా చేసే కాంట్రీబ్యూష‌న్ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం కింద‌కి రాదు.

సెక్ష‌న్ 80సీ, 80సీసీసీ(బీమా సంస్థ ఆఫ‌ర్ చేసే ఫించ‌ను ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌కు వ‌ర్తిస్తుంది), సెక్ష‌న్ 80సీసీడీ(1)లో క‌లిపి క్లెయిమ్ చేసే మొత్తం మిన‌హాయింపు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1.5 లక్ష‌ల‌కు మించ‌కూడదు.

ఒక‌వేళ మీ ఆదాయం ప‌న్ను ఆదా ప‌రిమితులను మించిపోతే, ఎన్‌పీఎస్‌లో యాజ‌మాన్యం చేసే కాంట్రీబ్యూష‌న్‌కి గానూ సెక్ష‌న్ 80సీసీడీ(2) ప్ర‌కారం అద‌నంగా ఆదా చేసుకునే అవ‌కాశం ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీ బేసిక్ వార్షిక ఆదాయం రూ. 8 ల‌క్ష‌లు అయితే ఎన్‌పీఎస్‌లో సంస్థ చెల్లింపులు రూ. 80 వేలు, మీ చెల్లింపులు రూ. 80 వేలు ఉంటాయి. ఇందులో ఎంప్లాయి వాటా కింద చెల్లించే రూ. 80 వేల‌పై సెక్ష‌న్ 80సీసీడీ(2) కింద మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని