ఎన్‌పీఎస్‌, ఈఎల్ఎస్ఎస్‌, యులిప్ లో ఏది మేలు?

మీ భ‌విష్య‌త్తు ఆర్ధిక ల‌క్ష్యాల అవ‌స‌రం ఆధారంగా మీ పెట్టుబ‌డి మార్గం ఉండాలి....​

Published : 19 Dec 2020 13:09 IST

మీ భ‌విష్య‌త్తు ఆర్ధిక ల‌క్ష్యాల అవ‌స‌రం ఆధారంగా మీ పెట్టుబ‌డి మార్గం ఉండాలి.​​​​​​​

పొదుపు చేయ‌డం ఒక క‌ళ‌. ప్ర‌తి వ్య‌క్తి తాను సంపాదించిన మొత్తం నుంచి కొతం భాగాన్ని పొదుపు/ పెట్టుబ‌డుల‌లో పెట్టాలి. ఇది మీ ఆర్ధిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు, పొదుపు అల‌వాటు చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఖ‌ర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు, ప‌క్క‌న పెట్టి ఉంచుకోవాలి. అయితే పెట్టుబ‌డి పెట్టేందుకు బ్యాంకులు/ పోస్టాఫీసుల ఆర్‌డీ, ఎఫ్‌డీ లు, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు, బంగారం, స్థిరాస్తులు వంటి వివిధ‌ ర‌కాల పెట్టుబ‌డి సాధ‌నాలు అందుబాటులో ఉన్నాయి. మ‌న‌లో చాలా మంది, రాబ‌డి శాతం త‌క్కువ‌గా ఉన్న స‌రే రిస్క్(న‌ష్ట‌భ‌యం) లేని రాబ‌డుల‌నే కోరుకుంటారు. వారు వ‌డ్డీ లేదా మూల‌ధ‌న రాబ‌డుల రూపంలో లాభం త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డి తిరిగి వ‌చ్చే విధంగా కోరుకుంటారు. కానీ కొంత మంది మూల‌ధ‌నం, అధిక రాబ‌డుల‌ను పొందేందుకు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేస్తున్నారు. ఈ విధంగా పెట్టుబ‌డులు పెట్టే వారికి ఈక్విటీలు ఒక మంచి మార్గంగా నిలుస్తున్నాయి. అయితే ఇవి స్వ‌ల్ప‌కాలంలో చాలా అస్థిరంగానూ, దీర్ఘ‌కాలంలో స్థిర‌మైన లాభాల‌నిచ్చే పెట్టుబ‌డి సాధ‌నాలు. ఈక్విటీ మార్కెట్లు, పెట్టుబ‌డి, కాల‌ప‌రిమితి, న‌ష్ట‌భ‌యం త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారు నేరుగా స్టాక్‌ల‌లో వారి సొంతంగా పెట్టుబ‌డి పెట్టుకోవ‌చ్చు. స‌రైన అవ‌గాహ‌న‌, స‌మ‌యం లేని వారు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం ఒక మంచి మార్గం.

ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్టే మూడు ప‌థ‌కాలు:

  1. జాతీయ ఫించ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌)
  2. ఈక్విటీ లింకిడ్ పన్ను ఆదాయ ప‌థ‌కం (ఈఎల్ఎస్ఎస్‌)
  3. యూనిట్ లింకిడ్ బీమా ప‌థ‌కాలు (యులిప్స్‌)

ఈ ప‌థ‌కాలలోని ముఖ్య‌మైన అంశాలు, లాభ‌న‌ష్టాల గురించి వివ‌రాలు:

ఎన్‌పీఎస్‌:

  • కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫించ‌ను ఖాతాల‌ను నిర్వ‌హించేందుకు ప్రారంభించారు. వీటిని పీఎఫ్ఆర్‌డీఏ నియంత్రిస్తుంది.
  • సెప్టెంబ‌రు, 2009 నుంచి ప్ర‌తీ భార‌త పౌరుడు, ఎన్‌పీఎస్‌తో ఖాతా తెర‌వ‌డానికి అనుమ‌తించారు.
  • ఇందులో రెండు ఖాతాలు ఉంటాయి. టైర్ 1 ఖాతా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. టైర్ 2 ఖాతా కావాల‌నుకుంటే తీసుకోవ‌చ్చు. త‌ప్ప‌నిస‌రి కాదు.
  • ప్ర‌ధానంగా ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని అభివృద్ది చేసుకునేందుకు ఏర్పాటు చేశారు.
  • ఈక్విటీల‌లో పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం కూడా ఉంది.
  • యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్‌ల ద్వారా ఈక్విటీలు,ప్ర‌భుత్వ బాండ్లు, కార్పొరేట్ డెట్‌ల‌ను ఎంచుకోవ‌చ్చు.
  • యాక్టివ్ చాయిస్‌: మూడు మార్గాల‌లో చ‌ందాదారుడు పెట్టుబ‌డుల శాతాన్ని ఎంచుకునేందుకు అనుమ‌తిస్తుంది.
  • ఆటో చాయిస్‌: యాక్టివ్ ఛాయిస్‌ను ఎంచుకోని స‌భ్యుల‌కు ఆటోమెటిక్‌గా ఆటో ఛాయిస్‌ను వ‌ర్తింప‌జేసి చందాదారుల వ‌య‌సును బ‌ట్టి పెట్టుబ‌డి ర‌కాల కేటాయింపులు చేస్తారు.
  • ప్ర‌స్తుత నియ‌మాల ప్ర‌కారం 40 శాతం ప‌న్ను రాయితీతో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 40 శాతం నిర్దేశిత‌ యాన్యూటీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. మిగిలిన 20 శాతం బ్యాలెన్స్‌ను యాన్యూటీగా గాని, ప‌న్ను చెల్లించి గానీ విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. యాన్యూటీ తో నెల నెలా పింఛను పొందే వీలు ఉంది.

nps1.jpg

ఈఎల్ఎస్ఎస్‌:

ఈ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను, స్టాక్ మార్కెట్ల రాబ‌డుల‌ను అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్‌లో మొత్తం నిధి నుంచి 80 శాతం నిధిని లార్జ్ కాప్, మిడ్ కాప్‌, స్మాల్ కాప్ ఈక్విటీల‌లో పెట్టుబ‌డి పెడ‌తారు. అందువ‌ల్ల మల్టీ కాప్ ఫండ్ల మాదిరిగానే రాబ‌డులు ఉంటాయి. క‌నీస లాక్ ఇన్ పిరియ‌డ్ 3 సంవ‌త్స‌రాలు. ఇతర ఈక్విటీ ఫండ్లలో లాగా ఇందులో కూడా కనీసం 10 ఏళ్ళు మదుపు చేస్తే మంచి రాబడి పొందే వీలు ఉంటుంది, స్వల్ప కాలం లో నష్ట భయం ఉంటుంది.

elss1.jpg

యులిప్‌:

బీమా, పెట్టుబ‌డి ప్ర‌యోజ‌నాలు రెండింటిని అందించే దీర్ఘ‌కాల పెట్టుబ‌డి ప‌ధ‌కం. వీటిలో రాబడి మార్కెట్ మీద ఆధార పడి ఉంటుంది కాబట్టి ముందే ఎంత రాబడి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేము. ఇవి సాంప్రదాయ బీమా పాలసీల కంటే భిన్నమైనవి.

ulip1.jpg

పెట్టుబ‌డిదారుడు ఆర్ధిక ల‌క్ష్యాల‌ను ఏర్ప‌ర‌చుకోవాలి. దీర్ఘ‌కాలిక‌ ల‌క్ష్యాల‌కు ఎన్‌పీఎస్ మంచి ఎంపిక‌. ఎన్‌పీఎస్ తో నిధి ని సమకూర్చుకోవడమే కాకుండా పింఛను పధకం గా కూడా ఉపయోగపడుతుంది. మధ్య కాల ల‌క్ష్యాలు 6 నుంచి 10 సంవ‌త్స‌రాల కోసం ఈఎల్ఎస్ఎస్ మంచి ఎంపిక‌. ఈఎల్ఎస్ఎస్ ను క‌నీసం 3 సార్లు అన‌గా 9 సంవ‌త్స‌రాలు నిలిపి ఉంచడం వ‌ల్ల ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో పాటు పెట్టుబ‌డుల‌లో పెరుగుద‌ల కూడా ఉంటుంది. యులిప్స్‌లలో ఉండే రుసుముల కార‌ణంగా అవి సరిప‌డినంత బీమా హామీని గాని, పెట్టుబ‌డుల‌పై మంచి రాబ‌డుల‌ను గాని అందించ‌వు. అందువ‌ల్ల యులిప్‌ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది. బీమా, పెట్టుబ‌డులు రెండింటిని ఎప్పుడూ క‌లప‌కూడ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని