ఈపీఎఫ్ వ‌ర్సెస్ ఎన్‌పీఎస్! రెండింటిలో ఏది మంచిది?

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జీవితం సాఫీగా గ‌డిచేందుకు అవ‌స‌ర‌మైన నిధిని ఏర్ప‌రుచుకోవ‌డంలో ఉద్యోగ భ‌విష్య నిధి(ఈపీఎఫ్‌), జాతీయ పింఛ‌ను ప‌థ‌కాలు(ఎన్‌పీఎస్‌) ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. ఈ ప‌థ‌కాలలోని అంశాలు, అవి....

Updated : 02 Jan 2021 16:34 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జీవితం సాఫీగా గ‌డిచేందుకు అవ‌స‌ర‌మైన నిధిని ఏర్ప‌రుచుకోవ‌డంలో ఉద్యోగ భ‌విష్య నిధి(ఈపీఎఫ్‌), జాతీయ పింఛ‌ను ప‌థ‌కాలు(ఎన్‌పీఎస్‌) ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. ఈ ప‌థ‌కాలలోని అంశాలు, అవి అందించే వ‌డ్డీ రేట్లు వేటిక‌వే వేరువేరుగా ఉంటాయి. రెండు ప‌థ‌కాలూ ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కాలు. ఇవి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలను క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ, గ‌రిష్ట ప‌న్ను ఆదా ప‌రిమితి, ఇచ్చే రాబ‌డులు, ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్టే వెసులుబాటు ప‌రంగా రెండింటికీ ఎన్నో బేధాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈపీఎఫ్ వ‌ర్సెస్ ఎన్‌పీఎస్‌ ల గురించి తెలుసుకోవాల్సిన ఐదు విష‌యాలు

1.ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు
భ‌విష్య నిధి(పీఎఫ్‌) చందాదారులు త‌మ పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోల‌లో 15 శాతం వ‌ర‌కు ఈక్విటీల‌లో పెట్ట‌వ‌చ్చు. ఆగ‌స్టు, 2015 నుంచి ఈపీఎఫ్ఓ ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంబించింది. తొలుత 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో 5 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టిన ఈపీఎఫ్ఓ, 2016-17 లో ఈ ప‌రిమితిని 10 శాతం వ‌ర‌కు పెంచింది. అనంత‌రం 2017-18 లో దీనిని 15 శాతానికి పెంచింది.

ఇదే స‌మ‌యంలో జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌)లోని చందాదారులు త‌మ పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోలో 75 శాతం వ‌ర‌కు ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్టే వెసులుబాటు ఉంది. దీంతోపాటు ఈటీఎఫ్‌ల్లో ప్ర‌స్తుతమున్న ప‌రిమితి(15 శాతం)కి మించి పెట్టుబ‌డ‌లు పెట్ట‌వ‌చ్చ లేదా త‌గ్గించ‌వ‌చ్చ‌న్న అవ‌కాశాన్ని చందాదారుల‌కే వ‌దిలేసే ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించాల‌ని గ‌త వారం కేంద్ర ధ‌ర్మ‌క‌ర్త‌ల బోర్డు(సీబీటీ) నిర్ణ‌యం తీసుకుంది. ఇది ఇంకా అమ‌ల్లోకి రావాల్సి ఉంది.

2.ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు

ఈపీఎఫ్ చందాదారుల‌కు ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. అదే ఎన్‌పీఎస్ ప‌రిధిలోని చందాదారులు సెక్ష‌న్ 80సీసీడీ(1), సెక్ష‌న్ 80 సీసీడీ(1బీ) కింద‌ రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే ఈపీఎఫ్ఓలో చందాదారుల‌కు భాగ‌స్వామ్యం చెల్లించేట‌ప్పుడు, వ‌డ్డీ ఆదాయంపై, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ఇలా మూడు సంద‌ర్భాల్లో ప‌న్ను మిన‌హాయింపులు పొందే వీలుంది. అదే ఎన్‌పీఎస్‌లో కేవ‌లం భాగ‌స్వామ్యం చెల్లించేట‌ప్పుడు, వ‌డ్డీ ఆదాయంపై మాత్ర‌మే మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ప‌న్ను ప‌డుతుంది. అయితే ఏక‌మొత్తంలో ఉప‌సంహ‌రించ‌కున్న న‌గదులో 40 శాతం మొత్తానికి మాత్రం ప‌న్ను ప‌డ‌దు.

3. వెసులుబాటు

ఈపీఎఫ్ చందాదారుల‌కు ఫండ్ మేనేజ‌ర్ల‌ను ఎంచ‌కునే వెసులుబాటు లేదు. అయితే ఎన్‌పీఎస్ చందాదారుల‌కి ఈ వెసులుబాటు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏడు ఫండ్ మేనేజింగ్ సంస్థ‌లు వివిధ ర‌కాల వడ్డీ రేట్ల‌తో వివిధ రాబ‌డులను అందిస్తున్నాయి. వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ పెన్ష‌న్ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ పెన్ష‌న్‌, కోట‌క్ పెన్ష‌న్ ఫండ్‌, ఎల్ఐసీ పెన్ష‌న్ ఫండ్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ పెన్ష‌న్‌, ఎస్‌బీఐ పెన్ష‌న్ ఫండ్‌, యూటీఐ రిటైర్‌మెంట్ సొల్యూష‌న్స్ ఉన్నాయి. ఎన్‌పీఎస్‌లో చందాదారులు త‌మ పెట్టుబ‌డులను ఒక ప‌థ‌కం నుంచి మ‌రో ప‌థ‌కంలోకి కొన్ని నిబంధ‌న‌ల‌ననుస‌రించి మార్చుకోవ‌చ్చు. ఈ వెసులుబాటు ఈపీఎఫ్ చందాదారుల‌కి లేదు. అలాగే ఎన్‌పీఎస్‌లో ల‌భించే వ‌డ్డీ రేట్లు పూర్తిగా మార్కెట్ ఆధారంగా ఉంటాయి.

4. ఖాతాల నిర్వ‌హ‌ణ‌

భ‌విష్య నిధి చందాదారులు సార్వ‌జ‌నీన ఖాతా సంఖ్య‌(యూఏఎన్‌)తో అనుసంధాన‌మైన ఒకే ఖాతాను నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే ఎన్‌పీఎస్ చందాదారులు మాత్రం రెండు ఖాతాల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. మొద‌టి ఖాతా టైర్‌-1 త‌ప్ప‌నిస‌రిగా క‌లిగి ఉండాలి. రెండో ఖాతా టైర్‌-2ని చందాదారులు స్వ‌చ్ఛందంగా నిర్వ‌హించాల్సి ఉంటుంది. దీనిని ఉప‌సంహ‌ర‌ణ‌ల కోసం వినియోగిస్తారు. ఖాతా ప్రారంభించ‌గానే చందాదారుల‌కు ఎన్‌పీఎస్ ప్రాన్‌(ప‌ర్మ‌నెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబ‌ర్‌) ఇస్తుంది.

5.త‌ప్ప‌నిస‌రి/ ఐచ్ఛిక అంశాలు

20 లేదా అంత‌కంటే ఉద్యోగులు గ‌ల సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఈపీఎఫ్ఓ ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది. అంత‌కంటే త‌క్కువుంటే అవ‌స‌రం లేదు. అలాగే ఎన్‌పీఎస్ ఖాతా అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ ఉద్యోగుల‌కు త‌ప్ప‌నిస‌రి. ప్రైవేట్ ఉద్యోగుల‌కు మాత్రం ఐచ్ఛికం. చేస్తున్న ఉద్యోగంతో సంబంధం లేకుండా ఎవ‌రైనా ఎన్‌పీఎస్‌లో చేర‌వ‌చ్చు.

చివరి మాట…

రాబడి పరంగా చూసుకున్నట్లైతే ఈపీఎఫ్ లో ప్రస్తుతం 8.55 శాతం ఉండగా ఎన్పీఎస్ లో టయర్-1 ఈక్విటీ పథకాల్లో సగటు 3 ఏళ్ళ రాబడి 10 నుంచి 11 శాతంగా ఉంది. మార్కెట్ ని బట్టి ఇది మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా ఎంత అనేది అని చెప్పలేము. ఇప్పుడే ఉద్యోగంలో చేరిన వారు, మధ్య వయస్కులు ఎన్పీఎస్ లో ఇప్పట్నుంచే మదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. పదవీ విరమణ నిధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని