మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎన్.ఆర్‌.ఐలు మ‌దుపు చేయాలంటే...

భార‌తీయ స్టాక్ మార్కెట్లు ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్నాయి. దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో నిధుల ప్ర‌వాహం మార్కెట్ల జోరుకు మ‌రింత వూత‌మిస్తోంది. ప్ర‌వాస భార‌తీయులు...

Published : 15 Dec 2020 16:31 IST

భార‌త మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌తో లాభార్జ‌న గ‌డించేందుకు ఎన్‌.ఆర్‌.ఐలు ఎలా మొద‌లుపెట్టాలో తెలుసుకుందాం..

భార‌తీయ స్టాక్ మార్కెట్లు ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్నాయి. దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో నిధుల ప్ర‌వాహం మార్కెట్ల జోరుకు మ‌రింత వూత‌మిస్తోంది. ప్ర‌వాస భార‌తీయులు, భార‌తీయ మూలాలున్న వ్య‌క్తులు ఇలాంటి గొప్ప‌ అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని లాభార్జ‌న దిశ‌గా అడుగులు వేయాల‌ని ఉవ్విళూరుతున్నారు. దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డిని వేదిక‌గా చేసుకొని త‌మ ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని ఆశిస్తున్నారు. దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసేందుకు ఎన్‌.ఆర్‌.ఐల ముందున్న మార్గాలు, అవి అందుకునే అవ‌కాశాల‌పై స‌మ‌గ్ర వివ‌ర‌ణ.

మీ ఖాతాదారును తెలుసుకోండి (కే వై సీ) నిబంధ‌న‌లు

ఏ ఆర్థిక‌ప‌ర లావాదేవీ నెరిపేందుకైనా ఎన్‌.ఆర్‌.ఐలు ప్రాథ‌మికంగా కేవైసీ నిబంధ‌న‌ల‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. భార‌త్‌లో నివ‌సించే స్థానికుల‌కు, ఎన్.ఆర్‌.ఐల‌కు కేవైసీ విధానం ఒకే తీరుగా ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజీ ద్వారా బాండ్లు, ఈక్విటీల‌లో లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే ప్ర‌వాస భార‌తీయలెవ‌రైనా విధిగా పాన్ వివ‌రాలు స‌మ‌ర్పించాల్సిందే. తాము నివ‌సించే విదేశీ చిరునామాను త‌ప్ప‌నిస‌రిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఏదైనా స‌మ‌చారం కోసం ఇక్క‌డి స్థానిక చిరునామాను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. కేవైసీ విధానాన్ని పూర్తి చేశాక నాన్ రెసిడెంట్‌గా మీ హోదా మారుతుంది.

చెల్లింపు విధానం

మ్యూచువ‌ల్ ఫండ్ల యూనిట్ల‌ను కొనుగోలు చేసేందుకు నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ ఖాతా లేదా నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ ఖాతాను ఉప‌యోగించ‌వ‌చ్చు. రూపాయి డినామినేష‌న్ల‌లో డిమాండ్ డ్రాఫ్ట్‌, లేదా బ్యాంక‌ర్స్ చెక్కుల ద్వారా చెల్లింపు చేయాల‌నుకుంటే ఫారిన్ ఇన్‌వార్డ్ రెమిటెన్స్ స‌ర్టిఫికెట్ (ఎఫ్‌.ఐ.ఆర్‌.సి)ని స‌మ‌ర్పించాలి. దీంతో పాటు దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసేందుకు అనుమ‌తి మంజూరు చేస్తున్న‌ట్లుగా విదేశీ బ్యాంకు జారీ చేసే లేఖను ఇక్క‌డ ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబ‌డులు పెట్టేందుకైనా, వెన‌క్కి తీసుకునేందుకైనా మీ ఎన్‌.ఆర్‌.ఓ లేదా ఎన్‌.ఆర్ ఈ ఖాతానే రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విదేశీ బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను న‌మోదు చేసేందుకు అనుమ‌తులు లేవు. భార‌తీయ రూపాయి విలువ‌తోనే మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబడులు సాధ్య‌మవుతుంది త‌ప్ప ఏ ఇత‌ర విదేశీ క‌రెన్సీ విలువ‌గా లెక్కించ‌బోరు అన్న విషయంలో స్ప‌ష్ట‌త ఏర్ప‌ర్చుకోవాలి. రీడీమ్ చేసుకున్న సొమ్ము కూడా భార‌తీయ రూపాయ‌ల్లోనే ఇస్తారు త‌ప్పితే విదేశీ క‌రెన్సీగా ఇవ్వ‌జాల‌రు.

న‌గ‌దు త‌ర‌లింపు ఉద్దేశం

విదేశాల్లో ఉన్నవారు తిరిగి పెట్టుబడి సొమ్మును విదేశాలకు తీసుకెళ్లే ఉద్దేశంతో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసేందుకు చూస్తారు. ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా ద్వారా లేదా నేరుగా రీపాట్రియేష‌న్ విధానంలో పెట్టిన మొత్తం నిధుల‌ను విదేశాలకు తిరిగి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా ద్వారా జ‌రిగే లావాదేవీల‌ను విదేశాల‌కు త‌ర‌లించే వీలు లేదు( నాన్ రీపాట్రియ‌బుల్‌). దీనికో మిన‌హాయింపు ఉంది. ఎన్‌.ఆర్‌.ఐ గా 10ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్ల వ‌ర‌కు వెన‌క్కి త‌ర‌లించే వీలుంది. అయితే త‌ర‌లించే సొమ్ముపై వ‌ర్తించే ప‌న్ను చెల్లించి, ఇత‌ర నిబంధ‌న‌లేమైనా అనుస‌రించిన తర్వాతే ఈ త‌ర‌లింపును అనుమ‌తిస్తారు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు ఈక్విటీలు, డెట్ ఫండ్లు లేదా ఈ రెండింటిలోనూ చేయ‌వ‌చ్చు.

నామినేష‌న్‌, ఉమ్మ‌డి భాగ‌స్వామ్యం

దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎన్‌.ఆర్‌.ఐగా ఒక్కరిగా లేదా ఉమ్మడిగానూ పెట్టుబ‌డుల‌ను అనుమ‌తిస్తున్నారు. స్థానికులు లేదా ప్ర‌వాసులు ఎవ‌రితోఅయినా ఉమ్మడిగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అయితే ఉమ్మ‌డి భాగ‌స్వామిగా ఉండాల‌నుకునేవారు త‌గిన‌ కేవైసీ విధానాన్ని పూర్తి చేసి ఉండాలి. భార‌త్‌లో చేసే మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌కు నామినీగా ఎవ‌రినైనా అపాయింట్ చేసే వెసులుబాటు ఎన్‌.ఆర్‌.ఐగా మీకుంటుంది. నామినీ ఎన్‌.ఆర్‌.ఐ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. భార‌త స్థానికులెవ‌రైనా నామినీగా పేర్కొన‌వ‌చ్చు.

ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ హోల్డ‌ర్‌

దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రోజువారీ కార్య‌క‌లాపాలు చూసుకునేందుకో, పెట్టుబ‌డులు నిర్వ‌హించేందుకుగాను ఎవ‌రైనా స్థానికుడిని ప‌వ‌ర్ ఆఫ్ ఆటార్నీ(పీఓఏ)గా నియ‌మించ‌వ‌చ్చు. పెట్టుబ‌డి పెట్ట‌బోయే స‌ద‌రు మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌తో పీఓఏ రిజిస్ట‌ర్ అయి ఉండాలి. రిజిస్ట‌ర్ అయ్యాక పీఓఏ కు సంబంధిత లావాదేవీలు చేసుకునేందుకు, డాక్యుమెంట్ల‌పై సంత‌కాలు చేసేందుకు అవ‌కాశం ల‌భిస్తుంది. ఫండ్ యూనిట్ల‌ను కొనుగోలు చేసేందుకు పీఓఏ , ఎన్‌.ఆర్‌.ఐల ఇద్ద‌రి సంత‌కం అవ‌స‌ర‌మ‌వుతుంది.

అమెరికా, కెన‌డాలో నివ‌సించేవారైతే…

అమెరికా, కెన‌డా దేశాలలో నివసించే వారికి ‘విదేశీ ఖాతాల‌ ప‌న్ను వ‌ర్తింపు చ‌ట్టాల’ (ఫ‌ట్కా) నిబంధ‌న‌లు క్లిష్ట‌మైన‌విగా ఉంటాయి. ఈ కార‌ణంగా కేవ‌లం కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు మాత్ర‌మ ఆయా దేశాల‌లో నివ‌సించేవారిని పెట్టుబ‌డుల‌కు అనుమ‌తిస్తాయి. ప్ర‌స్తుతానికైతే బిర్లా స‌న్ లైఫ్‌, ఎన్‌బీఐ, ఎల్ అండ్ టీ, పీపీఎఫ్ ఏస్‌, యూటీఐ, సుంద‌రం, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియ‌ల్‌, డీహెచ్.ఎఫ్.ఎల్ ప్రామెరికా లాంటి కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లే అదీ కొన్ని ప‌థ‌కాల్లోనే పెట్టుబ‌డి పెట్టేందుకు అనుమ‌తిస్తున్నాయి.

స్థానికత హోదా మారితే

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తూ ఏదో ఒక‌సారి విదేశాల‌కు వెళ్లేవారు త‌మ స్థానిక హోదా విష‌యంపై స్ప‌ష్ట‌త‌నివ్వాలి. విదేశాల‌కు వెళ్తూ ఇక స‌మీప భ‌విష్య‌త్తులో తిరిగి రామ‌ని నిశ్చ‌యించుకున్నాక స‌ద‌రు విష‌యాన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు తెలియ‌జేయాలి. అప్పుడు ఆ సంస్థ‌లు త‌మ రికార్డుల్లో మీ హోదాను ఎన్‌.ఆర్‌.ఐగా మారుస్తారు. అదే విధంగా భార‌త్‌కు తిరిగి వ‌చ్చే క్ర‌మంలో రెసిడెంట్‌గా ఫెమా దృష్టిలో గుర్తింపు పొందిన‌ట్ట‌యితే ఈ విష‌యాన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు తెలియ‌జేయాలి. అప్పుడు వారి రికార్డుల్లో త‌గిన మార్పుల‌ను చేస్తారు.

ఈ విధంగా కొన్ని నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఎన్‌.ఆర్‌.ఐలు దేశీయ మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా లావాదేవీలు జ‌ర‌ప‌డం చాలా సుల‌భ‌మ‌వుతుంది.

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని