ప్ర‌వాసులా! ఈ పెట్టుబ‌డి అవ‌కాశం లేన‌ట్టే!

ప్ర‌వాస భార‌తీయుల‌కు త‌మ ముందున్న పెట్టుబ‌డి మార్గాల‌పై ప‌లు సందేహాలు. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందాల‌నుకుంటారు. అలాంటివారి కోస‌మే ఈ వ్యాసం...

Published : 15 Dec 2020 18:41 IST

సంపాదించేవారు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందేందుకు వివిధ మార్గాల‌ను అన్వేషిస్తుంటారు. 80C, 80CCC, 80CCD(1) సెక్ష‌న్లను ఇలాంటివారి ప్ర‌యోజ‌నార్థ‌మే రూపొందించారు. సెక్ష‌న్ 80 CCE కింద రూ.1.5ల‌క్ష‌ల దాకా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌) స‌హా వివిధ పెట్టుబ‌డుల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తించ‌డం ప‌న్ను చెల్లింపుదార్ల‌కు లాభ‌దాయ‌క‌మే. సెక్ష‌న్ 80CCD(1B) కింద ఎన్‌పీఎస్‌లో జ‌మ‌చేసే సొమ్ముపై రూ.50వేల ప‌రిమితితో ప‌న్ను మిన‌హాయింపు అద‌నంగా దొరికిన‌ స‌దావ‌కాశం. కొన్ని ర‌కాల పెట్టుబ‌డులను స్థానికులు(రెసిడెంట్లు) మాత్ర‌మే చెయ్యాలి. మ‌రికొన్ని మార్గాల్లో పెట్టుబడికి భార‌త పౌర‌సత్వాన్ని క‌లిగి ఉండాలి.

ప్ర‌వాస భార‌తీయుడి (ఎన్‌.ఆర్‌.ఐ)గా ఉండి భార‌తీయ వ్య‌వ‌స్థ‌లో పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి చూపిస్తున్న వారికి ఏయే ప‌థ‌కాలు అవ‌కాశమిస్తాయో చూద్దాం. నిజానికి ఇలా ఎన్‌.ఆర్‌.ఐల పెట్టుబ‌డుల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ఎలాంటి నియ‌మ‌నిబంధ‌న‌లు విధించ‌లేదు. అయితే ఎన్‌.ఆర్‌.ఐల‌ను ఆయా పధకాల నియమ నిబంధనలను అనుసరించి ఎన్ఆర్ఐ లు పెట్టుబడి పెట్టె వీలు ఉండదు.

ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌), జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్.ఎస్‌.సి):

  • అటు పీపీఎఫ్‌, ఇటు ఎన్‌.సి.సి తోపాటు ఇత‌ర పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించే ప్ర‌ముఖ సెక్ష‌న్ 80C.
  • ఫెమా చ‌ట్టాల ప్ర‌కారం స్థానిక రెసిడెంట్లు మాత్ర‌మే పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు అర్హులు. చ‌ట్టం ప్ర‌కారం నాన్ రెసిడెంట్లు ఎవ్వ‌రైనా ఖాతా తెరిచే అవ‌కాశం లేదు.

  • పీపీఎఫ్ ఖాతా తెరిచాక‌, భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా ఎన్‌.ఆర్‌.ఐగా మారితే హుటాహుటిన ఖాతా మూయాల్సిన అవ‌స‌రం లేదు. ఆ త‌ర్వాత ఖాతా కొన‌సాగించే అవ‌కాశం ఉంది. ఖాతాలో సొమ్మును జ‌మ‌చేసేందుకూ అనుమ‌తి ఉంది.

  • పీపీఎఫ్ నిబంధ‌న‌ల మేర‌కు ఖాతా తెరిచి 15ఏళ్లు పూర్త‌యితే దాన్ని పొడిగించుకునే వీల్లేదు. రెసిడెంట్ల‌కు మాత్ర‌మే అయిదేళ్ల చొప్పున పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకునే స‌దావ‌కాశం ఉంటుంది.

  • 15 సంవ‌త్స‌రాలు పూర్తి చేసిన ఖాతాల నుంచి మెచ్యూరిటీ సొమ్మును విదేశాల‌కు త‌ర‌లించే వీలు లేదు. విధిగా నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ (ఎన్‌.ఆర్‌.ఓ) ఖాతాకు జ‌మ‌చేయాల్సిందే త‌ప్ప నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ (ఎన్‌.ఆర్‌.ఈ) ఖాతాకు మ‌ళ్లించలేము.

  • ఇలా ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాలో సొమ్మును ఏడాదికి రూ.10ల‌క్ష‌ల అమెరిక‌న్ డాల‌ర్ల వ‌ర‌కు మాత్ర‌మే తీసుకునే అవ‌కాశం ఉంటుంది అదీ కొన్ని ష‌ర‌తులకు లోబ‌డే.

  • ఫెమా చ‌ట్టం కింద నాన్ రెసిడెంట్లుగా గుర్తింపు పొందిన‌వారు జాతీయ పొదుపు ప‌త్రాలలో స‌హా ఏ ఇత‌ర చిన్న‌పొదుపు పథ‌కాల్లో చేరేందుకు అన‌ర్హులు.

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌)

  • స్వ‌యం ఉపాధి పొందేవారైనా, ఉద్యోగులైనా ఎన్‌పీఎస్‌లో జ‌మ‌చేసే సొమ్ముపై సెక్ష‌న్ 80 సీ కింద‌ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి.

  • ఉద్యోగులైతే వారి యాజ‌మాని జ‌మ‌చేసే సొమ్మ‌పైనా ప‌న్ను ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది.

  • భార‌త పౌర‌స‌త్వం క‌లిగిన‌వారు మాత్ర‌మే ఎన్‌పీఎస్ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఫెమా నియంత్ర‌ణ‌ల‌ను అనుస‌రించి నాన్ రెసిడెంట్‌గా మారినా స‌రే భార‌తీయ పాస్‌పోర్టు క‌లిగి ఉంటే చాలు నిర‌భ్యంత‌రంగా ఎన్‌పీఎస్‌లో చేర‌వ‌చ్చు. సెక్ష‌న్ 80సీసీడీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాలూ పొంద‌వ‌చ్చు.

  • విదేశీ పౌరులు మ‌న దేశంలో ప‌నిచేస్తున్న‌ట్ట‌యితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం రెసిడెంట్లుగా గుర్తింపు పొందుతారు. వాళ్లు రెసిడెంట్లు అయినా స‌రే ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరిచేందుకు మాత్రం అన‌ర్హులే.

  • భార‌తీయ మూలాలున్న వ్య‌క్తుల‌ను ఫెమా చ‌ట్టం ఎన్ఆర్‌.ఐ గా ప‌రిగ‌ణిస్తుంది. వీరికి భార‌త పాస్‌పోర్టు ఉండ‌దు క‌నుక వీళ్లు ఎన్‌పీఎస్ ఖాతాను తెర‌వ‌లేరు.

ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు (ఈ.ఎల్‌.ఎస్‌.ఎస్‌)

  • విదేశాల్లో నివ‌సించే ఎన్‌.ఆర్‌.ఐలు ఈ.ఎల్‌.ఎస్‌.ఎస్‌. స‌హా అన్ని భార‌తీయ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల్లో చేరేందుకు ఇక్క‌డి బ్యాంకింగ్‌, ఆదాయ‌ ప‌న్ను చ‌ట్టాల ప్ర‌కారం ఎలాంటి అభ్యంత‌రాలు లేవు.

  • కెన‌డా, అమెరికా దేశాలకు చెందిన‌వారు ఇక్క‌డ పెట్టుబ‌డి పెట్టేందుకు కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఒప్పుకోవు. ప‌న్ను చెల్లించే రీత్యా ఈ దేశాల‌కు చెందిన‌వారు కాక‌పోతే ఈ.ఎల్‌.ఎస్‌.ఎస్‌లో చేరి ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందే వీలుంది.

బీమా, పింఛ‌ను ప‌థ‌కాల కొనుగోళ్లు

ప్ర‌వాస భార‌తీయులు భార‌త దేశానికి చెందిన బీమా కంపెనీల వ‌ద్ద బీమా పాల‌సీలు, పింఛ‌ను ప‌థ‌కాలు కొనేందుకు ఎటువంటి ష‌ర‌తులు లేవు. కాబ‌ట్టి ఎన్‌.ఆర్‌.ఐలూ వారి ప్ర‌యోజ‌నార్థం ఇక్క‌డి పాల‌సీలు, పింఛ‌ను ప‌థ‌కాలను కొనుగోలుచేసి త‌గిన ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందే అవకాశం ఉంది. ఎన్‌.ఆర్‌.ఐలకు వ‌ర్తించేలా ఏయే పెట్టుబ‌డి మార్గాలున్నాయో, భార‌త్‌లో ప‌న్ను చెల్లించేవారైతే మిన‌హాయింపులపై అవ‌గాహ‌న క‌లిగించేలా ఈ క‌థ‌నం సాగింద‌ని ఆశిస్తున్నాం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని