ఎన్ఆర్ఐల స్థిరాస్తి పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఎలా?

ఎన్ఆర్ఐలు ఇల్లు,స్థ‌లం లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారా? వాటికి వ‌ర్తించే ప‌న్ను విధానం ఎలా ఉంటుంది​​​​​​...

Updated : 01 Jan 2021 20:04 IST

ఎన్ఆర్ఐలు ఇల్లు,స్థ‌లం లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్నారా? వాటికి వ‌ర్తించే ప‌న్ను విధానం ఎలా ఉంటుంది.

ఎన్ఆర్ఐలు భార‌త‌దేశంలో ఉండే ఇంటి ద్వారా పొందే అద్దె లేదా విక్ర‌యించ‌డం ద్వారా ల‌భించే మొత్తానికి ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ - నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, నాన్ రెసిడెంట్ ఇండియ‌న్ రెండు పేర్లు ఒకే లా అనిపించినా ఆదాయ‌ప‌ప‌న్ను చ‌ట్టం, ఫెమా ప్ర‌కారం వేర్వేరు అర్థాల‌ను క‌లిగి ఉంటాయి. భార‌తదేశ నివాసిగా గుర్తించేందుకు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం 182 రోజులు స్వేదేశంలో ఉంటే వారిని రెసిడెంట్ ఇండియ‌న్ గా గుర్తిస్తారు. ప్ర‌స్తుతం ఒక సంవ‌త్స‌రంలో క‌నీసం 60 రోజులు , నాలుగేళ్ల‌లో క‌నీసం 365 రోజులు నివ‌సించిన వారిని కూడా భార‌త‌దేశ నివాసిగా ప‌రిగ‌ణిస్తారు. ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం పూర్వీకులు, త‌ల్లిదండ్రులు అవిభాజిత భార‌త‌దేశంలో జ‌న్మించిన‌ట్ట‌యితే వారిని భార‌త‌దేశ పౌరుడిగా గుర్తిస్తారు. ఫెమా చ‌ట్టం ప్ర‌కారంనేపాల్,భూటాన్, పాకిస్థాన్, ఇరాన్, శ్రీలంక‌,బంగ్లాదేశ్, ఆఫ్గ‌నిస్తాన్,చైనా దేశాల్లో పౌర‌స‌త్వం లేకుండా ఉండాలి. భార‌తీయ పాస్ పోర్టు క‌లిగినా లేదా వారి పూర్వీకులు భార‌త‌దేశానికి చెందిన వారైతే వారిని భార‌త నివాసులుగా ప‌రిగ‌ణిస్తారు. రెండు చ‌ట్టాల ప్ర‌కారం వారిని ప‌న్ను ప‌రంగా 'ఎన్ఆర్ఐ’లుగా గుర్తిస్తారు. ఎన్ఆర్ఐలు వాణిజ్య లేదా గృహాల పై పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు కానీ వ్య‌వ‌సాయ భూమిని కొనుగోలు చేసేందుకు అనుమ‌తి లేదు. ఆ ఆస్తులు పూర్వీకుల నుంచి వ‌స్తే ఫ‌ర్వాలేదు. ఇత‌ర దేశాల‌కు చెందిన పౌరులు మ‌న‌దేశంలో ఆస్తుల‌ను కొనుగోలు చేయాలంటే రిజ‌ర్వు బ్యాంకు అనుమ‌తి ఉండాలి. అయితే వారికి స్థ‌లం ఐదేళ్లు లీజుగా తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఎన్ఆర్ఐలు భార‌త దేశంలో స్థిరాస్తిని కొనుగోలు చేస్తే వ‌ర్తించే ప‌న్ను విధానం త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ద్వంద్వ ప‌న్ను ర‌ద్దు ఒప్పందం డీటీఏఏ:

ఏదేశంలో నైనా ప‌న్ను విధానం ఆయా దేశాల్లో పౌరులు నివాసం, ఆదాయ మార్గం ఆధారంగా నిర్ణ‌యిస్తారు. ద్వంద్వ ప‌న్ను చెల్లింపు జ‌ర‌గ‌కుండా చూసేందుకు చాలా దేశాలు ఇత‌ర దేశాల తో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. దీంతో వ్య‌క్తులు ప‌న్ను రెండు దేశాల్లో చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.ఉదాహ‌ర‌ణ‌కు భార‌త‌దేశంలో ఉండే ఆస్తికి సంబంధించిన లావాదేవీల‌పై ప‌న్ను విధించే అధికారం ఆదాయ‌పుశాఖ వారికి ఉంటుంది. ఎన్ఆర్ఐలు వారునివ‌సించే దేశాల్లో ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

మూల‌ధ‌న రాబ‌డి:

భార‌త‌దేశంలో చేసిన స్థిరాస్తి లావాదేవీల‌పై ఎన్ఆర్ఐలు లాభం పొందితే వాటిపై ప‌న్ను విధించే అధికారం ఆదాయ‌ప‌న్ను శాఖ‌కు ఉంటుంది. స్థిరాస్తి ని కొనుగోలు చేసిన 24 నెల‌ల కంటే త‌క్కువ కాలం ఉంటే వాటిపై ప‌న్ను వ్య‌క్తిగ‌త శ్లాబ్ రేటు వ‌ద్ద చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘ‌కాలం అంటే 24 నెల‌ల‌కు మించిన వాటిపై ప‌న్ను ఇండెక్షేష‌న్ తో 20 శాతం ఉంటుంది.

అద్దె ఆదాయం:

ఎన్ఆర్ఐలు త‌మ‌కు స్వ‌దేశంలో ఉండే ఆస్తుల ద్వారా ల‌భించే అద్దె ఆదాయంపై ప‌న్ను చెల్లించాలి. అద్దె ఆదాయంపై ప‌న్నులెక్కించేట‌పుడు మున్సిప‌ల్ ప‌న్ను మొదలైన వాటిని మిన‌హాయింపు చేసి గ‌ణిస్తారు. దీనికి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ 30 శాతం ఆస్తి కొనుగోలు చేసేందుకు తీసుకునే రుణం పై చెల్లించే వ‌డ్డీపై మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

విత్‌హోల్డింగ్:

ఇంటిలో లేదా స్థ‌లంపై అద్దె చెల్లించేవారు మొత్తం లో కొంత భాగం ప‌న్నుకు సంబంధించి ప‌క్క‌న పెట్టాలి. ఆ మొత్తం చెల్లింపు తేదీ లేదా చెల్లించ‌డం ఏది ముందైతే అంత వ‌ర‌కూ వారు ఉంచుకోవాలి. అద్దె ఆదాయంపై ప‌న్ను 30 శాతం. 24 నెల‌ల‌కు మించిన ఆస్తి విక్ర‌యంపై వ‌చ్చే మూల‌ధ‌న లాభంపై 20 శాతం, 24 నెల‌ల కంటే త‌క్కువ‌ కాలానికి వ‌చ్చే ఆదాయంపై 30 శాతం ప‌న్ను విత్‌హోల్డ్ ట్యాక్స్ గా ఉంటుంది.

ప‌న్ను మిన‌హాయింపులు:

ఎన్ఆర్ఐలు మూల‌ధ‌న రాబ‌డితో తిరిగి పెట్టుబ‌డి చేస్తే సెక్ష‌న్ 54 54ఈసీ 54 ఎఫ్ ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు ఉన్నాయి. మూల‌ధ‌న రాబ‌డిని తిరిగి ఇంటి కొనుగోలు చేస్తే దానికి సెక్ష‌న్ 54, 54ఎఫ్ ద్వారా, ఎన్‌హెచ్ఏఐ, ఆర్ఈసీ బాండ్ల‌లో పెట్టుబ‌డి చేస్తే దానికి 54ఈసీ కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే ఈ పెట్టుబ‌డులు ప‌రిమిత కాలంలో చేయాల్సి ఉంటుంది.

రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి:

ఎన్ఆర్ఐలు ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు జులై 31 లోగా దాఖ‌లు చేయాలి. ప్ర‌స్తుతం దీన్ని ఆగ‌స్టు 31 వ‌ర‌కూ పొడిగించారు. సాధార‌ణంగా వార్షిక ఆదాయం 2.5 ల‌క్ష‌లు దాటితే ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి. ఎన్ఆర్ఐలు అద్దె ద్వారా ల‌భించే ల‌భించే ఆదాయం మాత్ర‌మే ఉంటుంది కాబ‌ట్టి రూ.2.5 ల‌క్ష‌లు దాట‌క‌పోయినా రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి. ఎందుకంటే అద్దెకుండే వారు ప‌న్ను భాగాన్ని ప్ర‌భుత్వం ఖ‌జానాలో డిపాజిట్ చేస్తారు. ఒక వేశ ఎన్ఆర్ఐ ప‌న్ను రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే రిట‌ర్నులు దాఖ‌లు చేసి ఉండాలి.

మిన‌హాయింపులు:

ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ నుంచి 80టీటీఏ వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త ప‌న్ను అంశాలు నివ‌సించే ప్ర‌దేశంతో సంబంధం లేకుండా ఉంటాయి. ఈ మిన‌హాయింపు ద్వారా ఎన్ఆర్ఐలు ఇంటి కొనుగోలు నిమిత్తం రుణం తీసుకుంటే సెక్ష‌న్ 80సీ కింద ఆ రుణానికి చెల్లించే అస‌లు పై రూ. 1.5 ల‌క్ష‌లు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని