Home loan: 6.4% వడ్డీరేటుకే గృహరుణం.. ‘నావీ’ కొత్త ఆఫర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ నావీ (NAVI). ఇది ఆర్‌బీఐ నమోదిత బ్యాంకింగేతర సంస్థ (NBFC). ఇప్పటి వరకు వ్యక్తిగత రుణాలు, బీమా సేవలు అందించిన ఈ సంస్థ తాజాగా గృహ రుణ (Home Loan) రంగంలోకీ అడుగుపెట్టింది. అదీ తక్కువ వడ్డీరేటుకే. పైగా ప్రాసెస్‌ మొత్తం యాప్‌లోనే పూర్తి చేయొచ్చని నావీ పేర్కొంది. 

ఆఫర్‌ ఏంటి?

నావీ రూ.20 లక్షలు నుంచి రూ.5 కోట్ల వరకు గృహరుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీనికి గరిష్ఠ కాలపరిమితి 25 సంవత్సరాలని తెలిపింది. బెంగళూరు, హుబ్బళి, దేవన్‌గిరి, గుల్బర్గా, చెన్నై, దిల్లీ, గురుగ్రాం, హైదరాబాద్‌ నగరాల ప్రజలకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. 

వడ్డీరేటు 6.46 శాతం నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. మంచి క్యాష్‌ ఫ్లోతో పాటు, క్రెడిట్‌ స్కోర్‌, రుణ చెల్లింపుల చరిత్ర చిక్కులు లేకుండా ఉన్న అర్హత గల వారికే ఈ వడ్డీరేటు వర్తిస్తుందని పేర్కొంది. దాదాపు ప్రక్రియ మొత్తం నావీ యాప్‌లోనే పూర్తి చేయొచ్చని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్‌ ఫీజు వంటి ఎలాంటి అదనపు ఛార్జీలు కూడా ఉండవని పేర్కొంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ముందుగా నావీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఖాతా తెరవాలి. పాన్‌కార్డులో ఉన్న విధంగా పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబరు వంటి వ్యక్తిగత వివరాలు ఎంటర్‌ చేయాలి. ఉద్యోగ వివరాలు, నెలవారీ ఆదాయం, పాన్‌కార్డు ఫొటోకాపీ వంటి వివరాలనూ ఆన్‌లైన్‌లో సమర్పించాలి. గృహ రుణానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. టైటిల్‌ డాక్యుమెంట్లతో పాటు ఇతర పత్రాలతో కూడిన ప్రాపర్టీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్‌ ఎస్సెమ్మెస్‌లు, కాంటాక్ట్‌లు, లోకేషన్‌, ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌, స్టోరేజీ వంటి వాటికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదాన్ని తిరస్కరించినా.. రుణ మంజూరులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నావీ స్పష్టం చేసింది. ఒకసారి మీ నావీ యాప్‌ యాక్టివేట్‌ అయితే, మీరు ఎంత మొత్తం గృహరుణానికి అర్హులు వంటి వివరాలు తెలియజేస్తారు. 

రుణ మంజూరుకు ముందే నెలవారీ ఈఎంఐకి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తారు. అప్పుడే మీ ఖాతా నుంచి ఈఎంఐ ఆటో డెబిట్‌కు అనుమతి కోరతారు. ఒకసారి రుణం మంజూరైన తర్వాత ఆటో డెబిట్‌ ఆప్షన్‌ను రద్దు చేయలేరని నావీ స్పష్టం చేసింది. అలాగే యాప్‌ ద్వారా కూడా వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని పేర్కొంది. వడ్డీరేటును ‘ట్రెజరీ బిల్‌ బెంచ్‌మార్క్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌ (TBLR)’కు అనుసంధానించినట్లు వెల్లడించింది. అయితే, మూడేళ్ల వరకు స్థిర వడ్డీరేటును ఎంచుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేరుగా యాప్‌ ద్వారానే రుణ మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నందున ఎలాంటి మధ్యవర్తిత్వ రుసుములు ఉండవని నావీ తెలిపింది. ఆ ప్రయోజనాన్ని వడ్డీరేటులో రాయితీ రూపంలో వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని పేర్కొంది.

ఇతర వివరాలు..

నావీ ముఖ్యంగా వేతన జీవులకు రుణాలు మంజూరు చేయడంపై దృష్టి సారించింది. ఇక వడ్డీరేటు విషయంలో కంపెనీ మూడు నెలల టీబీఎల్‌ఆర్‌ బెంచ్‌మార్క్‌ను పరిగణనలోకి తీసుకుంటోంది. దీని వల్ల ప్రతి త్రైమాసికంలో వడ్డీరేట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల్లో కొంత గందరగోళాన్ని సృష్టించొచ్చు. రుణం పూర్తిగా చెల్లించే వరకు నావీ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడానికి కుదరదు. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కంపెనీ చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

దరఖాస్తు చేసుకోవచ్చా?

సాధారణంగా గృహరుణాలు 15-20 ఏళ్ల కాలపరిమితితో తీసుకుంటారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రుణగ్రహీతలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీసుకున్న రుణాన్ని పునర్‌వ్యవస్థీకరించాల్సి రావొచ్చు. కాబట్టి ఆ సదుపాయం ఉన్న సంస్థల నుంచే గృహ రుణాన్ని తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పైగా కంపెనీకి, రుణగ్రహీతకు మధ్య కేవలం డిజిటల్‌ సంబంధాలే ఉన్న కారణంగా వ్యక్తిగత వివరాలను ఎక్కువ మొత్తంలో యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిందే. అలాగే సంస్థ పూర్వాపరాల్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గృహరుణాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని