Income Tax Returns: 5.89 కోట్ల ఐటీ రిటర్నుల దాఖలు

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన వారి సంఖ్య 5.89 కోట్లుగా నమోదైందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది....

Published : 01 Jan 2022 21:24 IST

దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన వారి సంఖ్య 5.89 కోట్లుగా నమోదైందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. నిన్నటి(డిసెంబరు 31)తో ఐటీఆర్‌ దాఖలుకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 46.11 లక్షల మంది రిటర్నులు సమర్పించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలిపింది. అదే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు చవరి రోజైన జనవరి 10, 2021న 31.05 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. మొత్తం ఆ ఏడాదికిగానూ 5.95 కోట్ల రిటర్నులు అందాయి.

2020-21 సంత్సరానికి సంబంధించి దాఖలైన 5.89 కోట్ల ఐటీఆర్‌లలో ఐటీఆర్‌-1లు 2.92 కోట్లు (49.6%), ఐటీఆర్‌-2లు 54.8 లక్షలు (9.3%), ఐటీఆర్‌-3లు 71.05 లక్షలు (12.1 శాతం), ఐటీఆర్‌-4లు 1.60 కోట్లు (27.2%), ఐటీఆర్‌-5లు 7.66 లక్షలు (1.3%), ఐటీఆర్‌-6లు 2.58 లక్షలు, ఐటీఆర్‌-7లు 0.67 లక్షలు ఉన్నాయని సీబీడీటీ పేర్కొంది. వీటిలో 45.7 శాతం రిటర్నులను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా సమర్పించారు.

చిన్న, మధ్యస్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్‌), ఐటీఆర్‌ ఫారం 4 (సుగమ్‌) ఉన్న విషయం తెలిసిందే. వేతనం, ఒక ఇళ్లు సహా ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు సహజ్‌ను సమర్పిస్తారు. ఇక ఐటీఆర్‌-4ను రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సమర్పిస్తాయి. క్రితం ఆర్థిక సంవత్సంలో మొత్తం 5.95 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఐటీఆర్‌-2ను రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల ద్వారా ఆదాయం వచ్చేవారు, ఐటీఆర్‌-3ని వ్యాపార/వృత్తి వల్ల ఆదాయం ఉన్నవారు, ఐటీఆర్-5ని ఎల్‌ఎల్‌పీలు, ఐటీఆర్‌-6ను వ్యాపారస్థులు, ఐటీఆర్‌-7ను ట్రస్టీలు సమర్పిస్తాయి.

ఇ-వెరిఫికేషన్‌కు ఫిబ్రవరి 28 వరకు గడువు..

2019-20 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేసిన రిటర్నులకు ఇ-వెరిఫికేషన్‌ చేసేందుకు 2022 ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే లేదా 120 రోజుల్లోపు ఆధార్‌ ఓటీపీ లేదా నెట్‌ బ్యాంకింగ్‌, డీమ్యాట్‌ ఖాతా, ఏటీఎం తదితర విధానాల్లో ఇ-వెరిఫై చేయాలి. ప్రత్యామ్నాయంగా అక్‌నాలడ్జ్‌మెంట్‌ ఐటీఆర్‌-5ను పోస్టులో బెంగళూరు సీపీసీకి పంపించాలి. 2020-21 మదింపు సంవత్సరానికి ఇప్పటికీ ఎంతోమంది ఇ-వెరిఫై చేసుకోలేదని సీబీడీటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికీ ఇ-వెరిఫై చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సీబీడీటీ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు